Harbhajan On Yuvraj Singh: టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ల హీరో యువరాజ్‌ సింగ్‌ కెప్టెన్‌ అయ్యుంటే ఆటగాళ్లంతా త్వరగా పడుకొని వేకువ జామునే లేవాల్సి వచ్చేదని మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ అంటున్నాడు. అతడెంతో కఠినంగా సాధన చేస్తాడని వెల్లడించాడు. జట్టు కోసం స్నేహబంధాన్నీ పక్కన పెట్టాల్సి వచ్చేదని వివరించాడు.


హర్భజన్‌ సింగ్‌, యువరాజ్‌ సింగ్‌ చిన్నప్పటి నుంచే మిత్రులు. వీరిద్దరూ పంజాబ్‌ తరఫున దేశవాళీ క్రికెట్లో మెరిశారు. సౌరవ్‌ గంగూలీ కెప్టెన్సీలో టీమ్‌ఇండియాకు తిరుగులేని విజయాలు అందించారు. 2007 టీ20, 2011 వన్డే ప్రపంచకప్పుల్లో కీలకంగా నిలిచారు. వీరిద్దరూ ఉంటే డ్రెస్సింగ్‌ రూమ్‌లో సందడిగా ఉండేదని చాలామంది పేర్కొన్న సంగతి తెలిసిందే. భారత జట్టు బాధ్యతలు యువీ తీసుకొని ఉంటే ఏం జరిగిదేని ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో భజ్జీని ఒకరు ప్రశ్నించారు. దానికి అతడిలా సమాధానం ఇచ్చాడు.


'ఒకవేళ టీమ్‌ఇండియాకు యువరాజ్‌ సింగ్‌ కెప్టెన్‌ అయ్యుంటే మేమంతా త్వరగా పడుకొని వేకువ జామునే లేవాల్సి వచ్చేది (నవ్వులు). మేం చాలా కఠినంగా సాధన చేయాల్సి వచ్చేది. అతడో గొప్ప నాయకుడు అయ్యేవాడు. 2011 ప్రపంచకప్‌లో ప్లేయర్‌ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. ఇలాంటి రికార్డులెన్నో అతడి గొప్పదనం గురించి చెబుతాయి. అవన్నీ అతడికి గౌరవం పెంచాయి' అని భజ్జీ అన్నాడు.


యువీ కెప్టెన్‌గా ఉంటే కొందరు క్రికెటర్ల కెరీర్లు సుదీర్ఘంగా ఉండేవా అన్న ప్రశ్నకూ భజ్జీ జవాబిచ్చాడు. తన తరంలో టాలెంట్‌ను బట్టే జట్టులో చోటు దక్కిందని మరికొరి సాయం అవసరం లేదని పేర్కొన్నాడు. 'యువీ నాయకుడిగా ఉండుంటే మాలో చాలామంది కెరీర్లు సుదీర్ఘంగా ఉంటాయని చెప్పగలను. ఎందుకంటే మేం మా సామర్థ్యాల మేరకే ఆడాం. వేటు పడటం నుంచి ఏ కెప్టెన్‌ మమ్మల్ని రక్షించేవాడు కాదు. ఎప్పుడు సారథ్యం వహించినా స్నేహబంధాన్ని పక్కన పెట్టాల్సిందే. ఎందుకంటే దేశమే ముఖ్యం' అని అతడు స్పష్టం చేశాడు.