Happy Birthday To the Badminton Queen PV Sindhu: ఒలింపిక్స్(Olympic)లో పతకం సాధించడం కాదు పాల్గొనడం కూడా అథ్లెట్లకు ఒక కల. అలాంటింది విశ్వ క్రీడల్లో ఏకంగా రెండు పతకాలు గెలిచి.. ఆ ఘనత సాధించిన తొలి భారత మహిళా అథ్లెట్‌గా చరిత్ర పుటల్లో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్న తెలుగు తేజం పీవీ సింధు(PV Sindhu). అంతర్జాతీయ క్రీడా వేదికపై పీవీ సింధు సృష్టించిన సంచలనాలతో... వేలాదిమంది బాలికలు రాకెట్లు చేతపట్టారంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఒలింపిక్స్ మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో సింధు ఫైనల్ ఆడుతుంటే.... దేశమంతా ఏకమై వేయి కళ్లతో వీక్షించేసింది. క్రికెట్‌ను కాకుండా మరో క్రీడను దేశం మొత్తం కళ్లప్పగించి చూడడం అదే తొలిసారి. ఆ ఘనతను తీసుకొచ్చిన బ్యాడ్మింటన్ క్వీన్ సింధు. బ్యాడ్మింటన్‌లో సింధు సాధించిన విజయాలతో యావత్ దేశంతోపాటు ప్రపంచం కూడా తెలుగు నేల వైపు చూసింది. భారత క్రీడా చరిత్రలో సింధుది ఒక పేజీ కాదు. ఒక అధ్యాయం. ఈ స్టార్ షట్లర్ సాధించిన ఘనతలు... భవిష్యత్ తరాలకు ఓ పాఠ్యాంశం. ఇవాళ సింధు తన 29వ జన్మదినాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా సింధు ఘనతలను... మరో సారి మననం చేసుకుందామా.....
ఆసియా జూనియర్ ఛాంపియన్‌షిప్
PV సింధు 2009లో మొదటి అంతర్జాతీయ పతకాన్ని గెలుచుకుని... బ్యాడ్మింటన్‌లో పతకాల వేట ప్రారంభించింది. అప్పుడు ప్రారంభమైన వేట నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. ఆసియా బ్యాడ్మింటన్ సబ్ జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో సింధు కాంస్యం సాధించింది.
కామన్వెల్త్ యూత్ గేమ్స్
ఆసియా జూనియర్ ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్యం సాధించిన కొన్ని సంవత్సరాల తర్వాత పీవీ సింధు 2011లో జరిగిన కామన్వెల్త్ యూత్ గేమ్స్‌లో మొదటి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది.
2014లో వరుస పతకాలు
2014 పీవీ సింధు జోరుకు పతకాలు పాదాక్రాంతమయ్యాయి. కోపెన్‌హాగన్‌లో జరిగిన BWF ప్రపంచ ఛాంపియన్‌షిప్, ఢిల్లీలో జరిగిన ఉబర్ కప్, గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్, ఇంచియాన్‌లో జరిగిన ఆసియా క్రీడలు, గిమ్‌చియాన్‌లో జరిగిన ఆసియా ఛాంపియన్‌షిప్‌లలో సింధు కాంస్య పతకాలు గెలుచుకుని సత్తా చాటింది.
2016 రియో ఒలింపిక్స్
రియో ఒలింపిక్స్ మహిళల సింగిల్స్‌లో సింధు రజత పతకంతో యావత్ దేశాన్ని ఆనందంలో ముంచెత్తింది. ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన అతి పిన్న వయస్కురాలిగా (21 ఏళ్లు) సింధు చరిత్ర సృష్టించింది.
కామన్వెల్త్ గేమ్స్
2018లో గోల్డ్ కోస్ట్‌లో జరిగిన కామన్‌వెల్త్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో సింధు మొదటి కామన్వెల్త్ స్వర్ణాన్ని గెలుచుకుంది. సింగిల్స్‌లో మాత్రం రజతం సాధించింది.
ప్రపంచ ఛాంపియన్‌షిప్
2019 జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో నోజోమి ఒకుహరను ఓడించి సింధు టైటిల్ గెలిచింది. ఒకుహరను 21-7, 21-7 తేడాతో ఓడించి మహిళల సింగిల్స్ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది.
2020 టోక్యో ఒలింపిక్స్
2020 టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల సింగిల్స్‌లో సింధు రెండో ఒలింపిక్ పతకాన్ని సాధించింది. ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది.
కామన్వెల్త్ గేమ్స్
కామన్‌వెల్త్ గేమ్స్ సింగిల్స్‌లో స్వర్ణం సంపాదించడానికి సింధు 2022 వరకు వేచి ఉండాల్సి వచ్చింది. ఫైనల్‌లో మిచెల్ లీని ఓడించి సింధు కామన్వెల్త్‌లో స్వర్ణాన్ని సాధించి చరిత్ర సృష్టించింది.
బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు 2013లో అర్జున అవార్డు, 2015లో పద్మశ్రీ మరియు 2016లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డులు లభించాయి. ఒలింపిక్స్ సమీపిస్తున్న వేళ... అందులో మరో పతకం నెగ్గి తన బర్త్ డే సందర్భంగా... అభిమానులకు ఈ స్టార్ షట్లర్ మరో బహుమతి అందిస్తుందేమో చూడాలి.