Indian Premier League 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023 సీజన్ ప్రారంభం కావడానికి ఇంకా ఒక్క నెల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే అన్ని జట్లు షెడ్యూల్ విడుదల అయ్యాక తమ సన్నాహాలను ప్రారంభించాయి. ఈలోగా డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఒక బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. ఐర్లాండ్ జట్టు ఫాస్ట్ బౌలర్ జాషువా లిటిల్ గాయం కారణంగా పాకిస్తాన్ సూపర్ లీగ్ (పిఎస్ఎల్) నుంచి వైదొలిగాడు. అతను రాబోయే ఐపిఎల్ సీజన్‌లోని మొదటి కొన్ని మ్యాచ్‌లలో ఆడే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి.
ఐపీఎల్ 2023 కోసం జరిగిన మినీ వేలంలో గుజరాత్ టైటాన్స్ జట్టు తమ జట్టులో జాషువా లిటిల్‌ను చేర్చుకోవడానికి రూ. 4.40 కోట్లు వెచ్చించింది. ఐపీఎల్ వేలంలో గుజరాత్ టైటాన్స్ జట్టు కొనుగోలు చేసిన తొలి ఐరిష్ ఆటగాడిగా కూడా జాషువా నిలిచాడు.
జాషువా పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ముల్తాన్ సుల్తాన్స్ తరపున ఆడాల్సి ఉంది, అయితే దక్షిణాఫ్రికా T20 లీగ్‌లో ప్రిటోరియా క్యాప్స్‌తో ఆడుతున్నప్పుడు హ్యామ్ స్ట్రింగ్ గాయంతో బాధపడ్డాడు. ఇప్పుడు మొత్తం PSL సీజన్‌కు దూరంగా ఉన్నాడు. లిటిల్ తన చికిత్స కోసం ఐర్లాండ్‌కు తిరిగి వెళ్లాడు. 2022లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జాషువా లిటిల్ హ్యాట్రిక్ సాధించిన విషయాన్ని కూడా ఇక్కడ గుర్తుంచుకోవాలి.
2023 మార్చిలో ఐర్లాండ్ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటించాలి. అక్కడ వారు ఒక టెస్ట్ మ్యాచ్‌తో పాటు ఆతిథ్య దేశంతో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడాలి. జాషువా ఇప్పుడు ఈ టూర్‌లో ఆడేందుకు ఫిట్‌గా ఉండాలని ఆశిస్తున్నాడు.
మార్చి 18వ తేదీ నుంచి బంగ్లాదేశ్, ఐర్లాండ్‌ల మధ్య వన్డే సిరీస్ జరగనుండగా, టీ20 సిరీస్‌లో చివరి మ్యాచ్ మార్చి 31వ తేదీన జరగనుంది. జాషువా లిటిల్ ఇప్పటి వరకు ఐర్లాండ్ తరఫున అంతర్జాతీయ స్థాయిలో 25 వన్డేలు, 53 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.
ఐపీఎల్ 2023 సీజన్ కు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తన కెప్టెన్ ను ప్రకటించింది. ఈ సీజన్ లో దక్షిణాఫ్రికా ఆటగాడు అయిడెన్ మార్ క్రమ్ ఎస్ ఆర్ హెచ్ జట్టును నడిపించనున్నాడు. మార్ క్రమ్ ను కెప్టెన్ గా నియమిస్తూ సన్ రైజర్స్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.
గతేడాది జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో ఈ ప్రొటీస్ ఆటగాడిని సన్ రైజర్స్ రూ. 2.60 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. ఆ సీజన్ లో మార్ క్రమ్ ఓ మోస్తరుగా రాణించాడు. 47.63 సగటులో 381 పరుగులు చేశాడు. గత నెలలో దక్షిణాఫ్రికా లీగ్ లో సన్ రైజర్స్ ఈస్టర్న్ జట్టును నడిపించిన మార్ క్రమ్ జట్టుకు టైటిల్ ను అందించాడు. అలాగే 2014లో దక్షిణాఫ్రికా అండర్- 19 జట్టుకు కెప్టెన్ గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఐపీఎల్ మినీ వేలంలో భారత ఆటగాడు మయాంక్ అగర్వాల్ ను కూడా ఎస్ ఆర్ హెచ్ కొనుగోలు చేసింది. అలాగే సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ కూడా జట్టులో ఉన్నాడు. వీరిని కాదని అయిడెన్ మార్ క్రమ్ ను కెప్టెన్ గా నియమించడం విశేషం.