GT vs PBKS: ఐపీఎల్ 2024లో గురువారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై పంజాబ్ కింగ్స్ మూడు వికెట్లతో విజయం సాదించింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 199 పరుగులు సాధించింది. అనంతరం పంజాబ్ కింగ్స్ 19.5 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. పంజాబ్ బ్యాట్స్‌మెన్‌లో టాప్ స్కోరర్ శశాంక్ సింగ్ (61 నాటౌట్: 29 బంతుల్లో, ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) చివరి వరకు ఉండి మ్యాచ్ గెలిపించాడు. గుజరాత్ బ్యాటర్లలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (89 నాటౌట్: 47 బంతుల్లో, ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) అందరి కంటే ఎక్కువ పరుగులు చేశాడు. శశాంక్ సింగ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.


ప్రారంభంలో తడబడి...
200 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ ఆరంభంలోనే తడబడింది. ఓపెనర్ శిఖర్ ధావన్‌ను (1: 2 బంతుల్లో) ఉమేష్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. కానీ మరో ఓపెనర్ జానీ బెయి‌స్టో (22: 13 బంతుల్లో, నాలుగు ఫోర్లు), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (35: 24 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్) వేగం తగ్గకుండా ఆడారు. కానీ పవర్‌ప్లేలోనే బౌలింగ్‌కు వచ్చిన స్పిన్నర్ నూర్ అహ్మద్ మ్యాజిక్ చేశాడు. వేగంగా ఆడుతున్న జానీ బెయిర్‌స్టోను క్లీన్ బౌల్డ్ చేసి గుజరాత్‌కు రెండో వికెట్‌ను అందించాడు.


అదరగొట్టిన శశాంక్...
నూర్ అహ్మద్ తన తర్వాతి ఓవర్లోనే ప్రభ్‌సిమ్రన్ సింగ్‌ను కూడా పెవిలియన్ బాట పట్టించాడు. ఆ తర్వాత వచ్చిన శామ్ కరన్ (5: 8 బంతుల్లో), సికందర్ రాజా (15: 16 బంతుల్లో) ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు. కానీ మరో ఎండ్‌లో శశాంక్ సింగ్ (61 నాటౌట్: 29 బంతుల్లో, ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగి ఆడుతూ రన్‌రేట్‌ను కంట్రోల్‌లో ఉంచాడు.  తనకు జితేష్ శర్మ, అశుతోష్ శర్మ చక్కటి సహకారం అందించారు. చివర్లో వీరిద్దరూ అవుటయినా శశాంక్ ఒత్తిడికి గురవకుండా మ్యాచ్‌ను ముగించాడు. పంజాబ్ బౌలర్లలో నూర్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, ఉమేశ్ యాదవ్, దర్శన్ నల్కండే, మోహిత్ శర్మలకు ఒక్కో వికెట్ దక్కింది.


Also Read: గుజరాత్ బ్యాటింగ్ ఎలా సాగిందో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి






పంజాబ్ కింగ్స్ తుది జట్టు
శిఖర్ ధావన్ (కెప్టెన్), జానీ బెయిర్ స్టో, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), ప్రభ్‌సిమ్రన్ సింగ్, శామ్ కరన్, శశాంక్ సింగ్, సికిందర్ రజా, హర్ ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబడ, అర్షదీప్ సింగ్ 


గుజరాత్ టైటాన్స్ తుది జట్టు
వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, కేన్ విలియమ్సన్, విజయ్ శంకర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేశ్ యాదవ్, దర్శన్ నల్కండే