GT vs PBKS: ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (89 నాటౌట్: 47 బంతుల్లో, ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పంజాబ్ బౌలర్లలో కగిసో రబడ రెండు వికెట్లు పడగొట్టాడు. పంజాబ్ విజయానికి 120 బంతుల్లో 200 పరుగులు కావాలి.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు...
అంతకు ముందు టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్‌కు దిగింది. క్రీజులో మొదటి నుంచి ఇబ్బంది పడ్డ వృద్ధిమాన్ సాహా (11: 13 బంతుల్లో, రెండు ఫోర్లు) కగిసో రబడ బౌలింగ్‌లో శిఖర్ ధావన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అప్పటికి స్కోరు 29 పరుగులు మాత్రమే. దీంతో శుభ్‌మన్ గిల్‌కు కేన్ విలియమ్సన్ (26: 22 బంతుల్లో, నాలుగు ఫోర్లు) జతకలిశాడు. వీరు వికెట్ల పతనాన్ని ఆపారు కానీ స్కోరింగ్ రేటు మాత్రం వేగం పుంజుకోలేకపోయింది. ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో కేన్ విలియమ్సన్‌ను హర్‌ప్రీత్ బ్రార్ అవుట్ చేశాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన సాయి సుదర్శన్ (33: 19 బంతుల్లో, ఆరు ఫోర్లు) వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. తనకు తోడుగా గిల్ కూడా జోరు పెంచాడు. దీంతో స్కోరింగ్ రేటు వేగం పుంజుకుంది. మూడో వికెట్‌కు 32 బంతుల్లోనే 53 పరుగులు జోడించిన అనంతరం హర్షల్ పటేల్ బౌలింగ్‌లో సాయి సుదర్శన్ అవుటయ్యాడు. అనంతరం వచ్చిన విజయ్ శంకర్ (8: 10 బంతుల్లో) ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేదు.
కానీ చివర్లో వచ్చిన రాహుల్ టెవాటియా (23 నాటౌట్: 8 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్) అద్భుతంగా ఆడాడు. శుభ్‌మన్ గిల్ కూడా ఆఖరి ఓవర్లలో విజృంభించడంతో గుజరాత్ భారీ స్కోరు చేసింది. వీరు ఐదో వికెట్‌కు 14 బంతుల్లోనే 35 పరుగులు జోడించారు. ఆఖర్లో గిల్ సెంచరీ చేస్తాడనుకున్నా బంతులు సరిపోలేదు. గుజరాత్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో కగిసో రబడ రెండు వికెట్లు తీసుకున్నాడు. హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్‌లకు చెరో వికెట్ దక్కింది.
పంజాబ్ కింగ్స్ తుది జట్టు
శిఖర్ ధావన్ (కెప్టెన్), జానీ బెయిర్ స్టో, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), ప్రభ్‌సిమ్రన్ సింగ్, శామ్ కరన్, శశాంక్ సింగ్, సికిందర్ రజా, హర్ ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబడ, అర్షదీప్ సింగ్
గుజరాత్ టైటాన్స్ తుది జట్టు
వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, కేన్ విలియమ్సన్, విజయ్ శంకర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేశ్ యాదవ్, దర్శన్ నల్కండే