Google Doodle pays tribute to India’s first woman wrestler Hamida Banu: రోజుకి కనీసం ఒక పాతిక సార్లు అయినా గూగుల్ ఓపెన్ చెయ్యాకపోతే రోజు గడవదు మనకి. కాబట్టి ఈ రోజు గూగుల్ ఓపెన్ చేశారా అనే ప్రశ్న ఆడగాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు ఈరోజు  గూగుల్ డూడుల్  తప్పక చూసే ఉంటారు. అందులో ఉన్న ఆమె ఎవరో  తెలుశా ..  భార‌త మొద‌టి ప్రొఫెషనల్ మ‌హిళా రెజ్ల‌ర్ హ‌మీదా బాను.  ఆమె స్మారకార్థం ఈరోజు గూగుల్ ఈ డూడుల్‌ను రూపొందించింది. బెంగళూరుకు చెందిన కళాకారిణి దివ్య నేగి ఈ డూడుల్‌ను చిత్రీకరించారు. 


ఎవరీ హ‌మీదా బాను?


హమీదా ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌ ప్రాంతంలో జన్మించారు.  1900 ప్రారంభంలో రెజ్లర్ల కుటుంబంలో పుట్టిన ఆమె కెరీర్‌  1940-50ల్లో ఒక దశాబ్దం పాటు కొన సాగింది. సుమారు   300లకు పైగా పోటీల్లో ఆమె విజయం సాధించారు.  రెజ్లర్ల కుటుంబంలోనే పుట్టినా ఆమె  కెరీర్‌ ఎన్నో ఒడుదొడుకులతో సాగింది.  ఎందుకంటే ఆ కాలంలో రెజ్లింగ్ పురుషుల‌కే ప‌రిమితమ‌ని భావించేవారు. ఆడవాళ్లను  దారిదాపుల్లోకి  రానిచ్చేవారు కాదు. అలాంటి కట్టుబాట్లను దాటడమే గాక తనను కించపర్చేవారికి తన  ఆటతో గట్టి సమాధానమిచ్చేవారు హామీదా.  అప్పట్లోనే  హ‌మీదా త‌న‌ను ఓడించిన వారిని పెళ్లి చేసుకుంటాన‌ని స‌వాల్‌ చేశారు. సవాలును స్వీక‌రించి ఆమెతో క‌ల‌బ‌డిన ఎంతోమంది మగాళ్ల‌ను  అతి సుళువుగా మ‌ట్టిక‌రిపించారు. అప్పటికే  పాటియాలా, కోల్‌కతా నుంచి ఇద్దరు ఛాంపియన్లు ఆమెతో పోటీ పడి ఓడిపోయారు. కానీ అప్పుడే ఆమెతో పోటీకి వచ్చారు ప్ర‌ముఖ రెజ్ల‌ర్ బాబా పహల్వాన్‌.  అప్పుడు హామీదా ఆయనకు మరో షరతు కూడా పెట్టారు. తన చేతిలో  ఓడిపోతే బాబా పహల్వాన్‌ ప్రొఫెషనల్‌ రెజ్లింగ్ నుంచి రిటైర్మెంట్‌ కూడా తీసుకోవాలన్నారు.   1954లో ఇదే రోజున జరిగిన రెజ్లింగ్ మ్యాచ్‌లో కేవలం 1.34 నిమిషాల్లోనే అతనిని హామీదా  ఓడించారు.  దీంతో ఇచ్చిన మాట ప్రకారం ఆ ఓటమి తర్వాత పహిల్వాన్ బాబా రెజ్లింగ్ నుంచి విరమించుకున్నారు. ఈ విజయంతో  ఒక్కసారిగా ఆమె అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నారు.  ఆమెకు గుర్తుగానే  నేడు గూగుల్‌ ప్రత్యేక డూడుల్‌ను రూపొందించింది.


హామీదా రష్యా ‘ఫీమేల్‌ బియర్‌’గా పేరొందిన ప్రముఖ మహిళా రెజ్లర్‌ వెరా కిస్టిలిన్‌నుకూడా కేవలం 2 నిమిషాల్లో ఓడించారు. దీంతో అప్పట్లో  కొన్ని సంవత్సరాలపాటూ హామీదా పేరు  మారు మ్రోగిపోయింది. దీంతో ‘అమెజాన్‌ ఆఫ్‌ అలీగఢ్‌’గా గుర్తింపు సాధించారు. ఆమె తినే ఆహారం, వస్త్రధారణ గురించి వార్తలను మీడియా విపరీతంగా కవర్ చేసింది. 


108 కేజీలు ఉండే హామీదా,  రోజులో 9 గంటలపాటూ  నిద్ర, ఆరు గంటలపాటూ  ట్రైనింగ్‌ పోగా మిగిలిన  సమయమంతా భోజనానికే కేటాయించేవారట.  రోజుకు దాదాపు కేజీ మటన్‌, బాదం పప్పు, నాటు కోడి, అరకేజీ నెయ్యి తో పాటూ  5.6 లీటర్ల పాలు, 1.8 లీటర్లు పండ్ల రసం తీసుకునేవారట. అయితే వివాహం అయితే చేసుకోలేదు కానీ ఆమె తన కోచ్ తో సహజీవనం చేశారని చెబుతారు.  గాయాల కారణంగా రెజ్లింగ్‌కు దూరమైన ఆమె.. చివరి రోజుల్లో చాలా కష్టాలు అనుభవించారని ఆమె కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.  ఏమైనా కానీ రెజ్లింగ్ లో తమ కెరియర్ కొనసాగించిన, కొనసాగిస్తున్న మహిళలకు హామీదా ఒక స్పూర్తి..