మంకీ గేట్‌...! టీమ్‌ఇండియా, ఆస్ట్రేలియా టెస్టు సిరీసుల్లో కనీవినీ ఎరగని వివాదం ఇది. క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత సున్నితమైన సమస్యగా మారిన ఉదంతమిది. 2008లో చోటు చేసుకున్న ఈ వివాదం గురించి మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ మరోసారి గుర్తు చేసుకున్నాడు. ఇప్పటి వరకు చెప్పని ఓ కఠిన నిజాన్ని బహిరంగంగా వ్యక్తం చేశాడు.


టీమ్‌ఇండియా 2008లో ఆస్ట్రేలియాలో పర్యటించింది. ఓ మ్యాచ్‌ ఆడుతుండగా ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ ఆండ్రూ సైమండ్స్‌, భారత స్పిన్నర్‌ హర్భజన్‌ మధ్య మాటల యుద్ధం జరిగింది. సైమండ్స్‌ను భజ్జీ 'కోతి' అన్నాడని కంగారూలు ఆరోపించారు. జాతివివక్ష ప్రదర్శించాడని ఆక్షేపించారు.


తన నోటితో అనని మాటలకు తనను నిందిస్తున్నారని భజ్జీ వాపోయాడు. మంకీ అని అనలేదని స్పష్టం చేశాడు. ఆసీస్‌ క్రికెటర్లు అబద్దపు సాక్ష్యాలు చెప్పడంతో భజ్జీపై మూడు మ్యాచుల నిషేధం, 50 శాతం మ్యాచు ఫీజు కోసేశారు. సిరీసు ఆడకుండా వెళ్లిపోతామని భారత బృందం గట్టిగా చెప్పడంతో అతడిపై నిషేధం ఎత్తేసి కేవలం జరిమానా విధించారు. ఈ సంఘటన గురించి 'బ్యాక్‌ స్టేజ్‌ విత్‌ బొరియా' షోలో భజ్జీ వివరించాడు.


Also Read: Ashleigh Barty: ‘ఏ బిడ్డా.. ఇది నా అడ్డా..’ 44 సంవత్సరాల తర్వాత చరిత్ర.. ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా యాష్లే!


Also Read: David Warner Daughter: డేవిడ్ వార్నరే కాదు తన కూతురు కూడా.. ‘తగ్గేదే లే’!


'ఆ సంఘటనతో నేను డిస్టర్బ్‌ అయ్యాను. అసలెందుకు అదంతా జరిగిందో అర్ధంకాలేదు. నేనని మాటల గురించి ఎందుకంత రచ్చ చేశారో తెలియదు. నేను మాట్లాడని మాటకు ఆరేడుగురు సాక్ష్యులు కనిపించారు. నేనేమీ అనలేదు. సంబంధం లేని విషయం తెరపైకి తీసుకొచ్చారు' అని భజ్జీ అన్నాడు.


'నీ నెత్తిపైన వృషణాలు మొలిచాయి.. అని వారు నన్ను మైదానంలో వెక్కిరించారు. ఇది నా మతానికి అవమానం. నా పట్ల జరిగిన అమానుషం. నేనప్పుడు నోరు తెరవలేదు. ఎందుకంటే అది మరిన్ని వివాదాలకు దారి తీసేంది. ఆ కఠిన సందర్భంలో నేను గదిలోనే ఎక్కువగా గడిపేవాడిని. నా సహచరులు, జట్టు యాజమాన్యం నాకు అండగా ఉన్నప్పటికీ వారికేమీ చెప్పలేదు. అప్పటికే నేను కుంగిపోయాను. దాని గురించి చెప్పి మిగతావారినీ కుంగదీయలేను. ఏం జరిగినా నేనే చూసుకోవాలని నిర్ణయించుకున్నా. దాన్నుంచి బయటపడ్డాను. టీమ్‌ఇండియాకు ఆస్ట్రేలియాలో విజయాలు అందించాను' అని భజ్జీ వివరించాడు.