ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో టాప్ సీడ్, ప్రపంచ నంబర్ వన్ యాష్లే బార్టీ చరిత్ర సృష్టించింది. 6-3, 7-6(7-2)తో 27వ సీడ్ డేనియల్ కొలిన్స్‌పై విజయం సాధించి ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను సొంతం చేసుకుంది. ఇది యాష్లే బార్టీకి మూడో గ్రాండ్ స్లామ్ టైటిల్.
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌ను ఆస్ట్రేలియాకు చెందిన వ్యక్తి సొంతం చేసుకుని 44 సంవత్సరాలు అవుతుంది. 1978లో క్రిస్ ఓనీల్ తర్వాత ఈ ఫీట్ సాధించింది యాష్లే బార్టీనే. అందుకే కాబోలు యాష్లే విజయం సాధించగానే.. మెల్‌బోర్న్‌లోని రాడ్ లేవర్ ఎరీనాలోని ప్రేక్షకులు ఆనందంలో మునిగి తేలారు. యాష్లే బార్టీ కూడా విజయం సాధించిన అనంతరం ఆనందోత్సాహాల్లో మునిగి తేలింది.
రెండో సెట్‌లో 5-1లో వెనుకబడ్డాక కూడా టైబ్రేక్‌లో యాష్లే బార్టీ ఈ సెట్ సొంతం చేసుకోవడం విశేషం. యాష్లే బార్టీ గురించి ఎక్కువ మందికి తెలియని విషయం ఏంటంటే.. తను కొన్నిరోజులు ప్రొఫెషనల్ క్రికెట్ కూడా ఆడింది. మహిళల బిగ్ బాష్ లీగ్‌లో కూడా తను పాల్గొంది. యాష్లే బార్టీ 2013లో వింబుల్డన్ టోర్నీతో అరంగేట్రం చేసింది. అయితే ఆ తర్వాత 2014లో క్రికెట్ ఆడటానికి టెన్నిస్ నుంచి బ్రేక్ తీసుకుంది. ఆ తర్వాత 2016లో తిరిగి టెన్నిస్ గేమ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
2019లో ఫ్రెంచ్ ఓపెన్, 2021లో వింబుల్డన్‌లు గెలిచిన యాష్లే బార్టీ.. ఇప్పుడు 2022లో ఆస్ట్రేలియన్ ఓపెన్ కూడా సొంతం చేసుకుంది. ఇంక యూఎస్ ఓపెన్ కూడా గెలిచేస్తే.. మొదటి నాలుగు గ్రాండ్ స్లామ్‌లతోనే కెరీర్ స్లామ్ పూర్తి చేసిన క్రీడాకారిణిగా చరిత్రలో నిలుస్తుంది.