క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించాడని తనపై వస్తున్న ఆరోపణలు, విమర్శలకు రవిచంద్రన్‌ అశ్విన్‌ ఘాటుగా బదులిచ్చాడు. మ్యాచ్‌ పరిస్థితులను బట్టే తాను ప్రవర్తించానని స్పష్టం చేశాడు. తనకు తానే అండగా నిలబడ్డానని వెల్లడించాడు. కేకేఆర్‌తో మ్యాచులో ఏం జరిగిందో వివరించాడు. గురువారం వరుస ట్వీట్లు పోస్టు చేశాడు.


Also Read: 'శ్రీకర విజయం'.. మాక్సీ విధ్వంసం: ప్లేఆఫ్స్‌ దిశగా బెంగళూరు


షార్జా వేదికగా మంగళవారం దిల్లీ క్యాపిటల్స్‌, కోల్‌కతా నైడర్స్‌ తలపడ్డాయి. 19వ ఓవర్లో వికెట్లకు విసిరిన బంతి పంత్‌ భుజానికి తగిలినా రిషభ్‌ పంత్‌, అశ్విన్‌ అదనపు పరుగు కోసం ప్రయత్నించారు. ఆ తర్వాత ఓవర్లో యాష్‌ను టిమ్‌సౌథీ ఔట్‌ చేశాడు. అయితే అతడు పెవిలియన్‌ చేరే క్రమంలో ఇయాన్‌ మోర్గాన్‌ ఏదో అన్నాడు. దాంతో యాష్‌ వాగ్వాదానికి దిగాడు. వారిని ఆపేందుకు దినేశ్‌ కార్తీక్‌, అంపైర్లు ప్రయత్నించారు.


Also Read: కోహ్లీతో ముగ్గురు ఆటగాళ్ల ఢీ! రోహిత్‌ మద్దతు! సయోధ్య కోసమే ధోనీ మెంటార్‌షిప్‌?


నిబంధనల ప్రకారం యాష్‌ చేసిందాట్లో తప్పేమీ లేదు. అయితే బ్యాటర్ల దేహానికి బంతి తగిలిన తర్వాత పరుగెత్తకూడదని ఓ సంప్రదాయం ఉంది. దానిని యాష్‌ పాటించలేదని షేన్‌వార్న్‌ సహా మరికొందరు విమర్శించారు. వారికి ఇప్పుడు అశ్విన్‌ సుదీర్ఘ వివరణ ఇచ్చాడు.


'1)  ఫీల్డర్‌ బంతి విసరుతున్నప్పుడే నేనే పరుగెత్తాను. బంతి రిషభ్‌ పంత్‌కు తాకిందన్న సంగతి నాకు తెలియదు. 2) పంత్‌కు తగిలిందని తెలిస్తే పరుగెత్తుతానా? బహుశా పరుగెత్తానేమో! కానీ నాకు అందుకు అనుమతి ఉంది. 3) అయితే మోర్గాన్‌ అన్నట్టు నేను క్రీడాస్ఫూర్తిని అగౌరవపరిచానా? నిజానికి కాదు. 4) నేను వాగ్వాదానికి దిగానా? కాదు, నాకు నేనే అండగా నిలిచాను. మా గురువులు, తల్లితండ్రులు నాకదే నేర్పించారు. ఎవరికి వారే అండగా నిలవాలని మీరూ మీ పిల్లలకు నేర్పించండి. మోర్గాన్‌, సౌథీ ఆడుతున్న క్రికెట్‌ ప్రపంచంలో వారి విశ్వాసాలకు వారు కట్టుబడి ఉండొచ్చు. కానీ వారికి ఇతరుల విశ్వాసాలను కించపరిచేలా మాటలు మాట్లాడే హక్కు లేదు' అని యాష్‌ అన్నాడు.


Also Read: తిరుగులేని ధోనీసేనపై సన్‌రైజర్స్‌ నిలవగలదా? జేసన్‌ రాయ్‌పైనే ఆశలన్నీ!


'చాలామంది దీని గురించి మాట్లాడుకోవడం, ఎవరు మంచి, ఎవరు చెడ్డ వ్యక్తో చర్చించుకోవడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. క్రికెట్‌ మర్యాదస్తుల క్రీడ అని చాటే అభిమానులారా? మీకొక్కటే చెబుతున్నా. ఎవరి తెలివితేటలు, ఆలోచనలను బట్టి వారు క్రికెట్‌ ఆడతారు. కెరీర్లు నిర్మించుకుంటారు. ఒక అదనపు పరుగు కోసం ప్రయత్నిస్తున్న వారిని ఔట్‌ చేసేందుకు విసిరే సాధారణ త్రోతో మీ కెరీర్‌ బాగుపడొచ్చు. నాన్‌స్ట్రైకర్‌ దొంగిలించే ఆ పరుగుతో మీ కెరీర్‌ బ్రేక్‌ అవ్వొచ్చు. కానీ అదనపు పరుగు కోసం ప్రయత్నించే నాన్‌స్ట్రైకర్‌ చెడ్డవాడని, పరుగుకు నిరాకరించే వ్యక్తి మంచోడని మీరు తికమకపడొద్దు. ఆటను ప్రాణం పెట్టి ఆడండి. నిబంధనల ప్రకారమే ప్రవర్తించండి. మ్యాచ్‌ ముగిసిన తర్వాత హ్యాండ్‌షేక్‌ ఇవ్వండి. నాకు తెలిసిన క్రీడా స్ఫూర్తి ఇదే' అని యాష్‌ సుదీర్ఘ సందేశం పెట్టాడు.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి