French Open 2023 Winner: టెన్నిస్ ప్రపంచం అంతా జోకర్ అని నిక్ నేమ్ పెట్టి పిలుచుకునే సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ తాను జోకర్ కాదు... టెన్నిస్ రారాజు అని నిరూపించాడు. ఫ్రెంచ్ ఓపెన్ ను గెలుచుకోవడం ద్వారా... 23వ గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించి రికార్డు సృష్టించాడు. ఇప్పటిదాకా అత్యధిక గ్రాండ్ స్లామ్స్ గెలిచిన రికార్డు నాదల్, జకోవిచ్ వద్ద సమంగా ఉండేది. ఇద్దరూ చెరో 22 తో ఉమ్మడి అగ్రస్థానంలో ఉన్నారు. ఇవాళ జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ లో.... నార్వేకు చెందిన కాస్పర్ రూడ్ మీద వరుస సెట్లలో జకోవిచ్ విజయం సాధించాడు. 7-6, 6-3, 7-5 తేడాతో జకో గెలుపొందాడు. 23వ గ్రాండ్ స్లామ్ ను ఖాతాలో వేసుకున్నాడు.








జకోవిచ్ కెరీర్ లో ఇది మూడో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్. ఆస్ట్రేలియన్ ఓపెన్ పదిసార్లు, వింబుల్డన్ ఏడుసార్లు, యూఎస్ ఓపెన్ మూడుసార్లు గెలుచుకున్నాడు. ఈసారి ఫ్రెంచ్ ఓపెన్ ప్రారంభానికి ముందే క్లే కోర్టు కింగ్ రఫెల్ నాదల్ గాయంతో తప్పుకున్నాడు. అందుకే జకోవిచ్ కు ఓ రకంగా లైన్ క్లియర్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత గ్రాండ్ స్లామ్...వింబుల్డన్ జులై 3 నుంచి ప్రారంభం అవుతుంది. టెన్నిస్ రారాజు, స్విట్జర్లాండ్ దిగ్గజం ఫెదరర్ 20, స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించారు.



జకోవిచ్ సాధించిన అరుదైన ఘనతపై రఫెల్ నాదల్ రియాక్షన్..
టెన్నిస్ గేమ్ లో తలపడితే ప్రత్యర్థే, కానీ ఓ రికార్డు సాధించడం అవతలి ఆటగాడిని అభినందిస్తుంటారు. పురుషుల టెన్నిస్ చరిత్రలో జకోవిచ్ అత్యధిక గ్రాండ్ స్లామ్ నెగ్గడంపై నాదల్ స్పందించాడు. ‘కొన్నేళ్ల కిందటి వరకు 23 అనేది అసాధ్యమైన సంఖ్య. కానీ జకోవిచ్ ఆ రికార్డు గ్రాండ్ స్లామ్ సాధించి, అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. రికార్డ్ క్రియేట్ చేసిన జకోవిచ్ కు అభినందనలు. మీ కుటుంబసభ్యులు, టీమ్ తో కలిసి ఈ విజయాన్ని ఆస్వాదించు’ అని ట్వీట్ ద్వారా అభినందించాడు స్పెయిన్ దిగ్గజం నాదల్.