హైదరాబాద్‌లో, ప్రత్యేకంగా అమీర్ పేట్‌లో ఉండే వారికి సత్యం థియేటర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఆ థియేటర్ ఉన్న ప్రదేశంలో ఏషియన్ సత్యం మాల్ వెలిసింది. ఇందులో అల్లు అర్జున్ భాగస్వామ్యంతో ‘ఏఏఏ సినిమాస్’ అనే వరల్డ్ క్లాస్ థియేటర్‌ను కూడా నిర్మించారు. ఈ థియేటర్ జూన్ 15వ తేదీన ప్రారంభం కానుంది. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ థియేటర్‌ను ప్రారంభించనున్నారు.
ఈ ఏషియన్ సత్యం మాల్‌లో అల్లు అర్జున్, ఏషియన్ సునీల్ నారంగ్, భరత్ నారంగ్, మురళీ మోహన్, సదానంద్ గౌడ్ భాగస్వాములుగా ఉండనున్నారు. మూడు లక్షల చదరపు అడుగుల్లో రూపొందిన ఈ మాల్‌లో మూడు ఫ్లోర్ల పార్కింగ్ ఉండనుంది. ఏఏఏ ఫుడ్ కోర్ట్ మూడో ఫ్లోర్‌లోనూ, ఏఏఏ సినిమాస్ నాలుగో ఫ్లోర్‌లోనూ ఉండనున్నాయి.
ఏఏఏ సినిమాస్‌లో మొత్తం ఐదు స్క్రీన్లు ఉండనున్నాయి. వీటిలో మొదటి స్క్రీన్ 67 అడుగుల ఎత్తు ఉండనుంది. బార్కో లేజర్ ప్రొజెక్షన్, అట్మాస్ సౌండ్ వంటి వరల్డ్ క్లాస్ ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి. స్క్రీన్ 2లో ఎపిక్ లక్సాన్ స్క్రీన్ ఉండనుంది. ఇది కూడా అట్మాస్ సౌండ్‌తోనే రానుంది. మిగతా స్క్రీన్లన్నీ 4కే ప్రొజెక్షన్‌తో రానున్నాయి. డాల్బీ 7.1 సౌండ్ కూడా ఉండనుంది.
జూన్ 14వ తేదీన దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. జూన్ 15వ తేదీన మాల్, సినిమాస్, ఫుడ్ కోర్ట్ ఓపెన్ కానున్నాయి. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అల్లు అర్జున్ ఈ మాల్‌ను ప్రారంభించనున్నారు. దీంతోపాటు మాల్ భాగస్వాములు, కొందరు ఇతర అతిథులు కూడా రానున్నారు. జూన్ 16వ తేదీన విడుదల కానున్న ‘ఆదిపురుష్’ సినిమానే ఇందులో ప్రదర్శితం అయ్యే మొదటి చిత్రం కానుంది.
అయితే హైదరాబాద్ ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఐమ్యాక్స్ స్క్రీన్ విషయంలో మాత్రం ఈసారి కూడా మొండి చెయ్యే ఎదురైంది. ఏఏఏ సినిమాస్‌లో కూడా ఐమ్యాక్స్ స్క్రీన్ అందుబాటులో లేదు. ఒక ఐమ్యాక్స్ స్క్రీన్, నాలుగు సాధారణ స్క్రీన్లతో థియేటర్ రూపొందించాలనేది మొదట ప్లాన్ అని, కానీ అది వర్కవుట్ కాలేదని తెలుస్తోంది.