Virat Kohli, IND vs SL 2nd Test: టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (Virat Kohli) సెంచరీల కరవు త్వరలోనే తీరుతుందని పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ రషీద్‌ లతీఫ్‌ (Rashid latif) అంటున్నాడు. అతడొకసారి డేటా అనలిటిక్స్‌ పరిశీలించాలని సూచించాడు. తన బ్యాటింగ్‌లొ కొన్ని అంతర్గత లోపాలు ఉన్నాయని వివరించాడు. శ్రీలంకతో రెండో టెస్టులో విరాట్‌ కోహ్లీ (Virat Kohli) సెంచరీ చేయాలని అంతా కోరుకుంటున్నారు. ఎందుకంటే చిన్నస్వామి స్టేడియం అతడికి రెండో సొంత మైదానం లెక్క! రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తరఫున అక్కడే ఎక్కువ మ్యాచులు ఆడాడు. అతడి సెంచరీ కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. తన వందో టెస్టైన మొహాలిలో అతడు త్రుటిలో హాఫ్‌ సెంచరీ మిస్‌ చేసుకున్నాడు. 28 నెలలుగా అతడు టెస్టు సెంచరీ చేయనే లేదు. డే/నైట్‌ టెస్టులో విరాట్‌ స్వల్ప స్కోరుకే ఔటయ్యాడు. మరి తనకు ఇష్టమైన చిన్నస్వామిలో రెండో ఇన్నింగ్స్‌లోనైనా విరాట్‌ 71వ సెంచరీ చేస్తాడో లేదో చూడాలి. 

'విరాట్‌ కోహ్లీ పరుగులు చేయాల్సిన సమయం వచ్చేసింది. చాన్నాళ్లుగా అతడు ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్నాడు. జనాలంతా అతడి సెంచరీ కోసమే ఆందోళన చెందుతున్నారు. అతడు ఈ టెస్టు లేదా తర్వాత జరిగే రెండు మూడు మ్యాచుల్లోనైనా సెంచరీ కొడతాడని నా అంచనా. అతడికి కొన్ని అంతర్గత సమస్యలు ఉన్నాయి. కెప్టెన్సీ కోల్పోయాడు. ఫామ్‌లో లేడు. ప్రత్యర్థి జట్లూ అతడి వీక్‌నెస్‌పై వర్క్‌ చేస్తున్నాయి. ఆ ప్లాన్‌ ప్రకారమే అతడికి బౌలింగ్‌ చేస్తున్నారు' అని లతీఫ్ అన్నాడు.

'కొందరు ఆటగాళ్లు ఫామ్‌లో ఉన్నప్పుడు డేటా అనలిటిక్స్‌ను నమ్మరు. కానీ విరాట్‌ కోహ్లీ డేటా అనలిటిక్స్‌ చూడాల్సిన టైమ్‌ వచ్చేసింది. ఓపెన్‌ స్టాన్స్‌ తీసుకోవడమే విరాట్‌ అతిపెద్ద సమస్య. ఔట్‌సైడ్‌ ఆఫ్ డెలివరీలను వెంటాడుతున్నాడు. ప్రత్యర్థులు వీక్‌నెస్‌ను కనిపెట్టారు. అతనాడుతున్న డాట్‌ బాల్స్‌ సంఖ్యను తగ్గించాలి. మరింత దూకుడుగా ఆడాలి. త్వరగా బంతిని అందుకోవాలి. ఓపెన్‌ స్టాన్స్‌ వల్ల అతడు బంతిని ఆలస్యంగా ఆడుతున్నాడు. ఆలస్యంగా ఆడటం ఫర్వాలేదు కానీ మరీ ఆలస్యమైతే మొదటికే మోసం' అని రషీద్‌ లతీఫ్‌ పేర్కొన్నాడు.