నిన్నటితరం ఆస్ట్రేలియా ప్రముఖ క్రికెటర్‌, ఒకప్పుడు  టీమిండియా మాజీ కోచ్‌ గ్రెగ్‌ చాపెల్‌ తీవ్ర ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాడు. 75 ఏళ్ల వయసులో అరకొర ఆదాయంతో భార్యతో కలసి కాలవెళ్లదీస్తున్నాడు. అతిశయం, ఆత్మాభిమానంతో ఉండే గ్రెగ్ చాపెల్ కోసం అతని స్నేహితులు సహాక నిధిని సమకూర్చడానికి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చాపెల్‌..2005 నుంచి 2007 వరకు భారత జట్టు కోచ్‌గా వ్యవహరించాడు. అయితే అప్పుడు అతను ఫలితాల కంటే వివాదాలతోనే ఎక్కువ ప్రాచుర్యం పొందాడు. అప్పటి సారథి సౌరవ్ గంగూలీతో గ్రెగ్ చాపెల్ గొడవలు అందరికీ తెలిసిందే. 


టీమిండియా కోచ్ గా వైదొలిగాక... చాపెల్ ను ఎవరూ  దగ్గరికి రానివ్వలేదు.  అతని తరం లో  కొంతమంది  కామెంటేటర్లుగా,  మరికొందరు  ఇతర క్రికెట్ సంబంధిత వృత్తుల్లో బిజీగా ఉండగా చాపెల్ మాత్రం నోటి దురుసుతనంతో అందరినీ దూరం చేసుకుని, ఇప్పుడు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు. దీంతో ఆర్థిక ఇబ్బందులతో అల్లాడిపోతున్న అతడిని ఆదుకునేందుకు స్నేహితులు ఆన్‌లైన్‌లో నిధుల సేకరణకు సిద్ధమయ్యారు.  అతడి కోసం నిధులు సేకరించేందుకు స్నేహితులు  ‘గో ఫండ్‌ మి’( GoFundMe) పేరిట ఆన్ లైన్ లో నిధులు సేకరిస్తున్నారు. 


ఈ మేరకు అతని సన్నిహితులు  ఓ కార్యక్రమం ఏర్పాటు చేయగా... దానికి గ్రెగ్ చాపెల్ తో పాటు అతడి ఇద్దరు సోదరులు ఇయాన్ చాపెల్, ట్రెవర్ చాపెల్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన  చాపెల్ , తాను మరీ ఆర్థికంగా ఏమీ దిగజారిపోలేదని, అలా అని అద్భుతమైన జీవితాన్ని కూడా గడపటం లేదన్నాడు. నిధులు సేకరించేందుకు తన స్నేహితులు ముందుకు వచ్చారని, వారి ఆలోచన తనకు ఇష్టం లేకపోయినా సరేనన్నానని వెల్లడించారు. ఈ కార్యక్రమ ద్వారా తన స్నేహితులు సేకరిస్తున్న నిధులను తానొక్కడినే తీసుకోవడంలేదని, తనలాగే ఇబ్బందులు పడుతున్న క్రికెటర్లకు కూడా వాటిని అందిస్తానని  వివరించారు.


ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత కూడా ప్రొఫెషనల్ క్రికెట్ తో సంబంధాలు ఉన్నప్పటికీ తను చాలానే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని చెప్పాడు. అనేకమంది క్రికెటర్లు కెరీర్ లో ఉన్నతస్థాయికి ఎదిగేందుకు తాను సాయపడ్డానని, తన వల్ల సాయం పొందిన వారు ఇవాళ తన పరిస్థితిని గుర్తిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.


న్యూజిలాండ్ జట్టు  మాజీ కెప్టెన్ అయిన జాన్ రైట్  2004/05 చివరిలో భారత కోచ్ గా తన  ఒప్పందాన్ని పునరుద్ధరించుకోకపోవడంతో, ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ గ్రెగ్ చాపెల్ , కొత్త భారత కోచ్‌గా ఎంపికయ్యాడు. అయితే అప్పటినుంచే అతను సీనియర్ ఆటగాళ్లయిన  మాస్టర్ సచిన్, సౌరవ్ గంగూలీ లాంటి పలువురినిదూరం పెట్టడం, జట్టులో రాజకీయాలు చేయడం వంటి పనులతో వివాదాలకు కేంద్రబిందువుగా మారాడు. చివరకు భారత జట్టు సభ్యులే తిరుగుబాటు చేసే పరిస్థితి రావడంతో కోచ్ పదవిని కోల్పోవాల్సి వచ్చింది.


అయితే చాపెల్ తన   గ్రెగ్ చాపెల్ ఫౌండేషన్ ద్వారా నిధులు సేకరిస్తూ గూడులేని నిరుపేదల కోసం సేవలు అందిస్తూ వస్తున్నాడు.  నిబంధనల ప్రకారం ట్రస్టును నిర్వహించే వ్యక్తులు తమ వ్యక్తిగత అవసరాలకు నిధులలోని కొంత మొత్తాన్ని వాడుకొనే వెసలుబాటు ఉన్నా..అందులోని డాలర్ ముట్టుకోని వ్యక్తిత్వం గ్రెగ్ చాపెల్ ది కావడంతో అవసానదశలో కష్టాలు మొదలయ్యాయని సన్నిహితులు చెబుతారు.  మిగిలిన క్రికెటర్ల మాదిరిగా అవసానదశలో దర్జాగా, విలాసవంతంగా, నిశ్చింతంగా జీవించాల్సిన వయసులో గ్రెగ్ చాపెల్ చాలీచాలని ఆదాయంతో గుట్టుగా బ్రతకడం తమను కలచి వేసిందని అందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని అతని సన్నిహితులు చెబుతున్నారు.