ఫిపా ప్రపంచకప్‌లో మొరాకో డ్రీమ్ రన్‌కు తెర పడింది. సెమీస్‌లో మొరాకోను ఫ్రాన్స్ 2-0తో ఓడించి ఫైనల్స్‌కు చేరుకుంది. ఆదివారం రాత్రి జరగనున్న ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మహా సంగ్రామంలో మెస్సీ ఆర్మీ అర్జెంటీనాతో ఫ్రాన్స్ పోటీ పడనుంది. ఫుట్ బాల్ ప్రపంచకప్‌ సెమీస్‌కు చేరిన మొదటి ఆఫ్రికా జట్టుగా రికార్డు సృష్టించిన మొరాకో ఇక్కడే ఇంటి బాట పట్టింది. గత ఏడు ప్రపంచ కప్‌ల్లో ఫ్రాన్స్ నాలుగు సార్లు ఫైనల్‌కు చేరడం విశేషం. 1998, 2018లో చాంపియన్స్‌గా కూడా నిలిచింది. ఆదివారం జరగనున్న ఫైనల్లో ఫ్రాన్స్ విజయం సాధిస్తే 60 సంవత్సరాల తర్వాత కప్ గెలుచుకున్న డిఫెండింగ్ చాంపియన్‌గా చరిత్ర సృష్టించనుంది.


ఐదో నిమిషంలో థియో హెర్నాండెజ్ గోల్
ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్‌కు చెందిన థియో హెర్నాండెజ్ ఐదో నిమిషంలో తొలి గోల్ చేశాడు. దీంతో ఫ్రాన్స్ జట్టు 1-0తో ముందంజ వేసింది. థియో హెర్నాండెజ్ తన అద్భుతమైన ఫుట్ వర్క్‌తో మొరాకో గోల్ కీపర్ బునౌను బోల్తా కొట్టించాడు. మొదటి అర్ధభాగం ముగిసే సరికి ఫ్రెంచ్ జట్టు 1-0 ఆధిక్యంలో ఉంది.


దాల్ కోలో మువానీ రెండో గోల్
ఫ్రాన్స్ తరఫున దాల్ కోలో మువానీ రెండో గోల్ చేశాడు. 79వ నిమిషంలో అతను ఈ గోల్‌ సాధించాడు. దీంతో ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్ 2-0తో ముందంజ వేసింది. సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగిన రాండాల్ కోలో మువాని కేవలం 44 సెకన్లలోనే గోల్ చేశాడు. ఆ తర్వాత మొరాకోకు ఏ మాత్రం చాన్స్ ఇవ్వని ఫ్రాన్స్ 2-0తో మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. ఈ విధంగా మొరాకో ఓటమితో ఆఫ్రికా, అరబ్ దేశాల కల చెదిరిపోయింది. డిసెంబర్ 17వ తేదీన మొరాకో, క్రొయేషియా మధ్య మూడో స్థానం కోసం మ్యాచ్ జరగనుంది.