FIFA World Cup Opening Ceremony: ఫిఫా వరల్డ్‌ కప్‌ 2022కు సర్వం సిద్ధమైంది! ఓ అద్భుతమైన క్రీడా యుద్ధానికి ఖతార్ తొలిసారి ఆతిథ్యం ఇస్తోంది. తమ దేశ చరిత్ర, వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఫుట్‌బాల్‌ పోటీలను నిర్వహించనుంది. ఇప్పటికే కళ్లు చెదిరే రీతిలో ఎనిమిది స్టేడియాలను ఏర్పాటు చేసింది. వేల కోట్ల రూపాయాలను ఖర్చు చేసి సర్వాంగ సుందరమైన, అత్యంత ఆధునికమైన స్టేడియాలను నిర్మించింది. ఇవన్నీ ఒక ఎత్తైతే మునుపెన్నడూ లేని రీతిలో ఆరంభ వేడుకలను నిర్వహించనుంది.


ప్రపంచ వ్యాప్తంగా ఫిఫా వరల్డ్‌ కప్‌ ఆరంభ వేడుకలపై ఆసక్తి ఉంటుంది. అంతర్జాతీయంగా ప్రాముఖ్యం పొందిన ఆర్టిస్టులు, సింగర్లు, నటీనటులు ఈ వేడుకల్లో ఫెర్ఫామ్‌ చేస్తుంటారు. 2022లోనూ అత్యంత ఆదరణ పొందిన పాప్‌ సింగర్‌ అద్భుత ప్రదర్శన ఇవ్వబోతున్నాడు. అంతేకాదు భారత్‌కు చెందిన ఈ నటీమణి పాల్గొంటోందని పుకార్లు వస్తున్నాయి. ఇంతకీ ఫిఫా వరల్డ్‌ కప్‌ 2022 ఓపెనింగ్‌ సెర్మనీ ఎప్పుడు మొదలవుతుంది? భారత్‌లో ఎన్నింటికి టెలికాస్ట్‌, లైవ్‌ స్ట్రీమింగ్‌ అవుతుంది? ఎందులో వస్తుందో? ఆ వివరాలు మీకోసం!


ఫిఫా వరల్డ్‌ కప్‌ 2022 ఆరంభ వేడుకలు ఎక్కడ జరుగుతాయి?


ఈ మెగా టోర్నీ ఆరంభ వేడుకలు ఖతార్‌లోని అల్‌ఖోర్‌లో ఉన్న అల్‌ బయత్‌ స్టేడియంలో ఆదివారం జరుగుతాయి. వేడుకలు ముగిసిన వెంటనే ఆతిథ్య జట్టు తొలి మ్యాచులో ఈక్వెడార్‌తో తలపడుతుంది. గ్లోబల్‌ సింగర్లు, ఆర్టిస్టులు వస్తుండటంతో ఓపెనింగ్‌ సెర్మనీపై ఆసక్తి నెలకొంది.


ఫిఫా వరల్డ్‌ కప్‌ 2022 ఆరంభ వేడుకలు భారత్‌ కాలమానం ప్రకారం ఎన్నింటికి మొదలవుతాయి?


ఖతార్‌ కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటలకు ఫిఫా వరల్డ్‌కప్‌ 2022 ఆరంభ వేడుకలు మొదలవుతాయి. భారత్‌లో రాత్రి 7:30కు ఆరంభమవుతుంది. ఇండియాలోనూ లైవ్‌ స్ట్రీమింగ్‌, లైవ్‌ టెలికాస్ట్‌ ఉంటుంది.


ఫిఫా వరల్డ్‌ కప్ 2022 వేడుకల్లో ఎవరెవరు పెర్ఫామ్‌ చేస్తున్నారు?


దక్షిణాఫ్రికాలో 2010లో ఫిఫా వరల్డ్‌ కప్‌ జరిగింది. అప్పుడు రాబీ విలియమ్స్‌, షకీరా 'వాకా వాకా' సాంగ్‌తో దుమ్మురేపారు. వాళ్లు ఈసారీ ప్రదర్శన ఇస్తున్నారని సమాచారం. బాలీవుడ్‌ నటీమణి నోరా ఫతేహీ పేరు సైతం వినిపిస్తోంది. కానీ అధికార వర్గాలు ధ్రువీకరించలేదు. దక్షిణ కొరియా కేపాప్‌ బాయ్‌ బీటీఎస్‌ జంగ్‌కుక్‌ ప్రదర్శన ఖాయమైంది. ప్రపంచవ్యాప్తంగా బ్యాంగ్‌టన్‌ బాయ్స్‌ లేదా కేపాప్‌ బాయ్‌ బ్యాండ్‌కు మంచి ఆదరణ ఉంది. పాప్‌ సెన్సేషన్‌ దువా లిపా వస్తుందన్న వార్తలు వచ్చినా దానిని లిపా కొట్టిపారేశారు.


భారత్‌ ఫిఫా వరల్డ్‌ కప్‌ 2022 ఆరంభ వేడుకల లైవ్‌ స్ట్రీమింగ్‌ ఎందులో?


ఫిఫా వరల్డ్‌ కప్‌ 2022 ప్రసార హక్కులను స్పోర్ట్స్‌ 18 దక్కించుకుంది. రిలయన్స్‌ వీరి యజమాని. మ్యాచులు, ఆరంభ వేడుకలన్నీ స్పోర్ట్స్‌ 18, స్పోర్ట్స్‌ 18 హెచ్‌డీటీవీలో ప్రసారం అవుతాయి. జియో సినిమా యాప్‌, వెబ్‌సైట్‌, జియో టీవీలో లైవ్‌స్ట్రీమింగ్‌ సేవలు అందుబాటులో ఉంటాయి.