NED vs QAT FIFA WC: ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచకప్ లో నిన్న జరిగిన మ్యాచ్ లో ఖతార్ పై నెదర్లాండ్స్ విజయం సాధించింది. తన చివరి లీగ్ మ్యాచులో ఆతిథ్య ఖతార్ ను 2-0తో ఓడించింది. దీంతో గ్రూపులో అగ్రస్థానంతో రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది. అలాగే ఈక్వెడార్ ను మట్టికరిపించిన సెనెగల్ రెండో స్థానంతో నాకౌట్ కు చేరింది. 


ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో మూడుసార్లు రన్నరప్‌ నెదర్లాండ్స్‌ ఈసారి గ్రూప్‌ దశలో అంత గొప్ప ప్రదర్శన చేయలేదు. అయినా కూడా సులువుగానే నాకౌట్‌ చేరింది. తన కంటే బలహీనమైన మూడు జట్లపై ఓటమి లేకుండా గ్రూప్‌ దశను ముగించిన నెదర్లాండ్స్‌ అగ్రస్థానంతో ముందంజ వేసింది. సెనెగల్‌ను ఓడించి, ఈక్వెడార్‌తో డ్రాతో సరిపెట్టుకున్న ఈ జట్టు.. మంగళవారం ఆతిథ్య ఖతార్‌ను 2-0తో ఓడించింది.


ప్రథమార్ధంలో ఒకటి


ఖతార్ తో మ్యాచులో నెదర్లాండ్స్ జట్టు అనుకున్నంత దూకుడుగా ఆడలేదు. ఆ జట్టు స్టార్ ఆటగాడు కోడీ గాక్పో 29వ నిమిషంలో గోల్ కొట్టి జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. క్లాసెన్‌ నుంచి పాస్‌ అందుకున్న అతను కుడి కార్నర్‌లో తక్కువ ఎత్తులో కొట్టిన షాట్‌ను ఖతార్‌ గోల్‌ కీపర్‌ బార్షమ్‌ ఆపలేకపోయాడు. ఆ తర్వాత కూడా నెదర్లాండ్స్‌ ఆటగాళ్లు అడపాదడపా కొన్ని ప్రయత్నాలు చేసినా.. ప్రథమార్ధం ముగిసేలోపు మరో గోల్‌ నమోదు కాలేదు. 


ద్వితీయార్ధంలో మరో గోల్


ద్వితీయార్ధం మొదలైన కాసేపటికే డచ్‌ ఆధిక్యం రెట్టింపైంది. 49వ నిమిషంలో క్లాసెన్‌ క్రాస్‌ను అందుకుని డీపే కొట్టిన షాట్‌ను బార్షమ్‌ సమర్థంగా అడ్డుకున్నాడు. కానీ రీబౌండ్‌ అయి వచ్చిన బంతిని వెంటనే డి జాంగ్‌ గోల్‌లోకి పంపేశాడు. ఈ ఊపులో మరిన్ని గోల్స్‌ పడతాయని ఆశించిన డచ్‌ అభిమానులకు ఒకింత నిరాశ తప్పలేదు. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌ల్లో ఈక్వెడార్‌, సెనెగల్‌ చేతుల్లో ఓడి నాకౌట్‌ రేసు నుంచి నిష్క్రమించిన ఖతార్‌కు చివరి మ్యాచ్‌లోనూ ఓటమి తప్పలేదు. ఆతిథ్య హోదాలో తొలిసారి ప్రపంచకప్‌ ఆడే అవకాశం దక్కించుకున్న ఆ జట్టుకు సెనెగల్‌తో మ్యాచ్‌లో ఒక గోల్‌ కొట్టడం ఒక్కటే ఊరట.


గ్రూపు ఏ నుంచి ఆ రెండు


 ఫిఫా ప్రపంచకప్‌లో గ్రూప్‌- ఏ నాకౌట్‌ బెర్తుల కథ తేలిపోయింది. టోర్నీ ఆరంభానికి ముందున్న అంచనా ప్రకారమే నెదర్లాండ్స్‌, సెనెగల్‌ ముందంజ వేశాయి. ఆతిథ్య ఖతార్‌ ముందే నిష్క్రమించడంతో పోటీ మూడు జట్ల మధ్యే కాగా.. చివరి మ్యాచ్‌ల్లో ఈక్వెడార్‌, ఖతార్‌ జట్లేమీ అద్భుతాలు చేయకపోవటంతో మిగతా రెండు జట్లే ప్రిక్వార్టర్స్‌ చేరాయి. ఖతార్‌ను నెదర్లాండ్స్‌, ఈక్వెడార్‌ను సెనెగల్‌ ఓడించి గ్రూప్‌లో తొలి రెండు స్థానాలతో ముందంజ వేశాయి.