FIFA World Cup 2022: ఫిఫా ప్రపంచకప్ లో నేడు నెదర్లాండ్స్, ఖతార్ జట్లు పోటీ పడనున్నాయి. అల్ బయత్ మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది. గ్రూప్- ఏలో ఉన్న ఈ రెండు జట్లలో నెదర్లాండ్స్ అగ్రస్థానంలో ఉంది. ఈ మ్యాచులో గెలిస్తే అది రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధిస్తుంది. అయితే ఆతిథ్య ఖతార్ మాత్రం ఇప్పటివరకు పాయింట్ల ఖాతా తెరవలేదు. దీంతో చివరి స్థానానికి పరిమితమైంది. 


తమ మొదటి మ్యాచులో ఖతార్ ఈక్వెడార్ చేతిలో 2-0 తేడాతో ఓడిపోయింది. తన తర్వాతి మ్యాచులోనూ సెనెగల్ చేతిలో 3-1 తో కంగుతింది. దీంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇప్పటివరకు మొత్తం మూడు జట్లు రౌండ్ ఆఫ్ 16కి అంటే తదుపరి దశలోకి ప్రవేశించాయి. 32 జట్లలో మొత్తం 16 జట్లు తదుపరి రౌండ్‌కు అర్హత సాధిస్తాయి. ఇందులో గ్రూప్-డిలోని ఫ్రాన్స్ రౌండ్-16కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. నవంబర్ 26న రెండో విజయం సాధించిన వెంటనే ఆ జట్టు ఈ స్థానాన్ని ఖాయం చేసుకుంది. దీని తర్వాత గ్రూప్-జి జట్టు బ్రెజిల్ రౌండ్ ఆఫ్ 16లో చోటు దక్కించుకున్న రెండో జట్టుగా అవతరించింది. అలానే సోమవారం జరిగిన మ్యాచులో ఉరుగ్వేను ఓడించిన పోర్చుగల్ రౌండ్ ఆఫ్ 16 బెర్తును ఖాయం చేసుకుంది. 


ఇంకా 13 జట్లకు రౌండ్ ఆఫ్ 16 కు అర్హత సాధించే అవకాశం ఉంది. చివరి రౌండ్ మ్యాచులో అయ్యేసరికి ఆయా జట్లేవో తేలతాయి. కెనడా, ఖతార్ జట్లు ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించాయి. 






 



స్పెయిన్- జర్మనీ మ్యాచ్ డ్రా


ఫిఫా ప్రపంచకప్ లో సోమవారం జరిగిన స్పెయిన్- జర్మనీ మ్యాచ్ డ్రా అయింది. తన గత మ్యాచులో జపాన్ చేతిలో ఓడిపోయిన జర్మనీ... బలమైన స్పెయిన్ తో మ్యాచును డ్రా చేసుకుంది. సబ్ స్టిట్యూట్ గా వచ్చిన నిక్లాస్ 83వ నిమిషంలో గోల్ కొట్టటంతో ఆ జట్టు ఓటమిని తప్పించుకుంది. స్పెయిన్ తరఫున అల్వారో మొరాటా 62వ నిమిషంలో గోల్ కొట్టాడు. నాలుగుసార్లు ఛాంపియన్ అయిన జర్మనీ ఈసారి నాకౌట్ చేరడమే కష్టంగా మారింది. ఆదివారం కోస్టారికాతో జరిగే మ్యాచుతో జర్మనీ భవితవ్యం తేలనుంది. 


తన చివరి మ్యాచ్‌లో జర్మనీకి కేవలం గెలిస్తే సరిపోదు. ఇతర జట్ల ఫలితాలపై ఆ జట్టు నాకౌట్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. తమ తమ చివరి మ్యాచ్‌లో స్పెయిన్‌, జర్మనీలు గెలిస్తే రెండు జట్లూ ముందంజ వేస్తాయి. జపాన్‌-స్పెయిన్‌ మ్యాచ్‌ డ్రా అయితే గోల్‌ అంతరంలో జపాన్‌ కన్నా మెరుగ్గా ఉంటేనే జర్మనీ నాకౌట్లో ప్రవేశించగలుగుతుంది. 1988 ఐరోపా ఛాంపియన్‌షిప్‌ తర్వాతి నుంచి ఇప్పటివరకు ఒక్క అధికారిక మ్యాచ్‌లోనూ స్పెయిన్‌ను జర్మనీ ఓడించలేదు. 2014 ప్రపంచకప్‌ గెలిచిన జర్మనీ.. ఆ తర్వాత ఆడిన అయిదు ప్రపంచకప్‌ మ్యాచ్‌ల్లో ఒక్కటి మాత్రమే నెగ్గింది.