AFC Cup 2023: 


మోహన్‌ బగాన్‌ సూపర్‌ జెయింట్‌ (Mohun Bagan SG) అమేజింగ్‌ విక్టరీ అందుకుంది. ఏసియన్‌ ఫుట్‌బాల్‌ కాన్ఫెడరేషన్‌ (AFC) కప్‌ 2023లో దూసుకుపోతోంది. ప్రిలిమినరీ రెండో రౌండ్లో నేపాల్‌కు చెందిన మచ్చీంద్ర ఎఫ్‌సీని (Machhindra FC) 3-1 తేడాతో చిత్తుగా ఓడించింది.


కోల్‌కతాలోని వివేకానంద యువ భారతీ స్టేడియంలో జరిగిన మ్యాచులో అభిమానులను అలరించింది. కొత్తగా వచ్చిన అన్వర్‌ అలీ (40, 86 నిమిషాలు), జేసన్‌ కమింగ్స్‌ (59వ నిమిషం) గోల్స్‌ కొట్టారు. మచ్చీంద్ర ఎఫ్‌సీలో అఫీజ్‌ ఒలాడిపో (78 నిమిషం) ఒక గోల్‌తో ఆకట్టుకున్నాడు.


బగాన్ దూకుడు


ఈ గేమ్‌లో మోహన్‌ బగాన్‌ ఆటతీరు ఆకట్టుకుంది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ప్రత్యర్థి గోల్‌ పోస్టుపై వరుస దాడులు చేసింది. అయితే మచ్చీంద్ర గోల్‌కీపర్‌, కెప్టెన్‌ విశాల్‌ శ్రేష్ఠ వారి దాడుల నుంచి జట్టును రక్షించాడు. మిడ్‌ ఫీల్డర్‌ సహాల్‌ అబ్దుల్‌ సమద్‌ కొట్టిన రెండు షాట్లను అడ్డుకున్నాడు. దాంతో 30 నిమిషాల వరకు రెండు జట్ల నుంచి గోల్స్‌ నమోదు అవ్వలేదు. ఆ తర్వాతే అద్భుతం జరిగింది. కార్నర్‌ నుంచి హ్యూగో బౌమస్‌ ఇచ్చిన డెలివరీని అందుకున్న అన్వర్‌ అలీ ప్రత్యర్థి గోల్‌ కీపర్‌ను బోల్తా కొట్టించాడు. బంతిని నెట్లోకి పంపిచి స్కోర్‌ 1-0తో ముందుకు తీసుకెళ్లాడు.


ఆఖర్లో అద్భుతం


ప్రథమార్ధంలో మోహన్‌ బగాన్‌కు మరో గోల్‌ వచ్చేదే. ఆషికి కురునియన్‌ ప్రయత్నాలు వృథా అయ్యాయి. బ్రేక్‌ తర్వాత మోహన్ బగాన్‌ మరింత రెచ్చిపోయింది. ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచింది. బంతిని తన నియంత్రణలోనే ఉంచుకుంది. ఇందుకు తగిన ఫలితం లభించింది. అనిరుధ్‌ థాపా ఇచ్చిన పాస్‌ను కమింగ్స్‌ గోల్‌పోస్ట్‌లోకి నెట్టేశాడు. మరికాసేపటికే మచ్చీంద్ర ఎఫ్‌సీ ఫ్రీ కిక్‌ను అందిపుచ్చుకుంది. నైజీరియన్‌ ఫార్వర్డ్‌ ఒలాడిపో గోల్‌ కొట్టడంతో స్కోర్‌ 1-2కు చేరుకుంది.


అలీ హెడర్‌


స్కోరును సమం చేయాలన్న నేపాల్‌ ఆశలను మోహన్‌ బగాన్ భగ్నం చేసింది. ఆఖర్లో అలీ మరో గోల్‌ కొట్టి 3-1తో జట్టును తిరుగులేని ఆధిక్యంలో నిలిపాడు. ఫ్రీకిక్‌ను పెట్రాటోస్‌ బాక్స్‌ వైపు కొట్టగా.. దానిని అలీ హెడర్‌ గోల్‌గా మలిచి విజయం అందించాడు. మోహన్‌ బగాన్‌ తన తర్వాతి మ్యాచులో బంగ్లాదేశ్‌కు చెందిన అబాహని ఢాకాతో తలపడుతుంది. ఆగస్టు 22న ఈ మ్యాచ్‌ జరుగుతుంది.


Also Read: కమ్‌బ్యాక్‌కి ముందే బుమ్రా రికార్డు! టీమ్‌ఇండియా కెప్టెన్‌గా మొదటి బౌలర్‌ అతడే!