Kapil Devs advice for Sachin tendulkar son Arjun Tendulkar: తెందూల్కర్‌ అనే ఇంటి పేరు మోస్తున్నందుకు అర్జున్‌పై (Arjun Tendulkar) కచ్చితంగా ఒత్తిడి ఉంటుందని క్రికెట్‌ దిగ్గజం కపిల్‌ దేవ్‌ (Kapil Dev) అన్నారు. అతడి తండ్రి సచిన్‌ తెందూల్కర్‌ (Sachin Tendulkar) నెలకొల్పిన ప్రమాణాలు ఆ స్థాయిలో ఉంటాయన్నారు. వాటిని అందుకోవడం ఆధునిక తరం క్రికెటర్లకూ సులభం కాదని పేర్కొన్నారు. దయచేసి అర్జున్‌ను సచిన్‌తో పోల్చొద్దని సూచించారు.


ఐపీఎల్‌ 2022 మెగా వేలంలో అర్జున్‌ తెందూల్కర్‌ను ముంబయి ఇండియన్స్‌ కొనుగోలు చేసింది. రూ.30 లక్షలు చెల్లించింది. ఐదుసార్లు ఛాంపియన్‌ రోహిత్‌ సేన ఈ సారి అంచనాలను అందుకోలేదు. జట్టు కూర్పు కురకపోవడం, సరైన ఆటగాళ్లు లేకపోవడంతో ఘోరంగా విఫలమైంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని హృతిక్‌ షోకీన్‌, మయాంక్‌ మర్కండే, కార్తికేయ వంటి కుర్రాళ్లను పరీక్షించింది. ఒక్క మ్యాచులోనూ అర్జున్‌కు చోటివ్వలేదు. ఈ మధ్యే ముంబయి బౌలింగ్ కోచ్‌ షేన్‌ బాండ్‌ మాట్లాడుతూ అర్జున్‌ తన నైపుణ్యాలను ఇంకా పదును పెట్టుకోవాల్సి ఉందని వెల్లడించాడు.


షేన్‌ బాండ్‌ వ్యాఖ్యలపై కపిల్‌ దేవ్‌ స్పందించారు. సచిన్ కొడుకు కావడంతో అర్జున్‌ తెందూల్కర్‌పై ఎప్పుడూ అదనపు ఒత్తిడి ఉంటుందని పేర్కొన్నారు. చిన్న వయసే కావడంతో అతడిని సచిన్‌తో పోల్చడం సరికాదని వెల్లడించారు. తన గేమ్‌ను ఆస్వాదించాలని సూచించారు. 


'ఎందుకంతా అర్జున్‌ గురించి మాట్లాడుతున్నారు? సచిన్‌ కొడుకనేనా!! అతడి మానాన అతడిని ఆడనివ్వండి. సచిన్‌తో పోల్చకండి. తెందూల్కర్‌ అనే ఇంటి పేరు వల్ల ప్రోత్సాహకాలతో పాటు ఇబ్బందులూ ఉంటాయి. ఇలాంటి ఒత్తిడిని తట్టుకోలేకే డాన్‌ బ్రాడ్‌మన్‌ కొడుకు పేరు మార్చుకున్నాడు. అతడి తండ్రిలాగే రాణించాలన్న అంచనాల ఒత్తిడిని తట్టుకోలేక బ్రాడ్‌మన్‌ పేరును తీసేశాడు' అని కపిల్‌ తెలిపారు.


'అర్జున్‌పై ఒత్తిడి పెంచకండి. అతనింకా కుర్రాడే. సచిన్‌ తెందూల్కర్‌ లాంటి గొప్ప తండ్రి అతడికి ఉన్నప్పుడు మనమెందుకు మాట్లాడటం? అయినా నేనతడికి చెప్పేదొకటే. వెళ్లి ఆటను ఆస్వాదించమని అంటాను. తండ్రి సామర్థ్యంలో 50 శాతం ఆడినా చాలు. అంతకుమించి అవసరం లేదు. సచిన్‌ దిగ్గజ క్రికెటర్‌ కాబట్టి తెందూల్కర్‌ పేరు వినగానే మన అంచనాలు పెరుగుతాయి' అని కపిల్‌ వివరించారు.