భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గురించి సామాజిక మాధ్యమాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అందేంటంటే నాలుగో టెస్టు నాలుగో రోజు శనివారం అశ్విన్ జట్టు సభ్యులకు దూరంగా ఉండి ఒంటరిగా మ్యాచ్ తిలకిస్తోన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో నెటిజన్ల అశ్విన్‌కి ఏమైంది? జట్టు సభ్యులకు దూరంగా ఎందుకు కూర్చున్నాడు? జట్టు సభ్యులకు అతడు దూరమయ్యాడా? లేక జట్టు సభ్యులే తనను దూరం చేశారా? అని ప్రశ్నల వర్షం కురుస్తోంది. 






ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ లో భాగంగా భారత్ x ఇంగ్లాండ్ మధ్య ఓవల్ వేదికగా నాలుగో టెస్టు జరుగుతోంది. నిన్న (ఆదివారం) నాలుగో రోజు జరిగింది. ఈ మ్యాచ్ జరిగే సమయంలో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్టాండ్స్‌లో ఒంటరిగా కూర్చుని మ్యాచ్‌ని తిలకిస్తూ అభిమానుల కంటికి చిక్కాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.     






ఇప్పటికే నాలుగు టెస్టుల్లో ఒక్క టెస్టులోనూ అశ్విన్‌కు తుది జట్టులో చోటు దక్కకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఇలా ఒంటరిగా మ్యాచ్ చూస్తూ సోషల్ మీడియాకి చిక్కడంతో ఆ అనుమానాలకు ఆజ్యం పోసినట్లైంది. 






నాలుగో టెస్టు ఆరంభానికి ముందు ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ కౌంటీ క్రికెట్లో ఓవల్ మైదానంలో మంచి రికార్డు నెలకొల్పాడు. 27 పరుగులిచ్చి 6 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఈ మైదానంలో మంచి రికార్డున్న అశ్విన్‌కి తుది జట్టులో చోటు ఖాయం అనుకున్నారు. కానీ, ఆసక్తికరంగా అశ్విన్‌కి చోటు దక్కలేదు. దీంతో కెప్టెన్ కోహ్లీతో అశ్విన్‌కి విభేదాలు ఉన్నాయి. అందుకే అతడు తుది జట్టులో స్థానం దక్కించుకోలేకపోతున్నాడు అంటూ కూడా వార్తలు వచ్చాయి. మరి, ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియాల్సి ఉంది. 






నాలుగో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. రవిచంద్రన్ అశ్విన్ ఈ టెస్టులో ఉంటే ఇంగ్లాండ్‌కి ఏమాత్రం గెలిచే అవకాశం ఉండేది కాదు అని మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ ట్వీట్ చేశాడు. ‘ఇమేజ్ ఆఫ్ ది డే, భారత జట్టులో ఒక సభ్యుడు మిస్ అయ్యాడు, పిచ్ పరిస్థితి చూస్తే అశ్విన్‌ని అనవసరంగా మిస్ చేసుకున్నాం అని ఫీలవుతాం, అశ్విన్ సేవలను భారత్ కోల్పోయింది’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.