KL Rahul Fitness Test: టీమ్‌ఇండియాకు బ్యాడ్ న్యూస్! ఇంగ్లాండ్ పర్యటనకు ముందు జట్టుకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఓపెనర్ కేఎల్ రాహుల్ (KL Rahul) వేగంగా కోలుకోవడం లేదని తెలిసింది. వైద్య బృందం ఎంత ప్రయత్నించినా రికవరీ ఆలస్యం అవుతోందని సమాచారం. దాంతో ఆంగ్లేయులతో ఐదో టెస్టులో అతడు ఆడటం సందిగ్ధంగా మారింది.
దక్షిణాఫ్రికాతో ఐదు టీ20ల సిరీసుకు (IND vs SA T20 Series) మొదట కేఎల్ రాహుల్‌నే కెప్టెన్‌గా ఎంపిక చేశారు. సరిగ్గా తొలి మ్యాచుకు ముందురోజు ప్రాక్టీస్‌లో అతడు గాయపడ్డాడు. గజ్జల్లో గాయమవ్వడంతో ముందు జాగ్రత్తగా అతడిని సిరీస్ నుంచి తప్పించారు. ప్రస్తుతం బెంగళూరులోని ఎన్‌సీఏలో రిహబిలిటేషన్‌కు వెళ్లాడు. అయితే కోరుకున్నంత వేగంగా అతడు కోలుకోవడం లేదట!
మరో ఐదు రోజుల్లో అంటే జూన్ 20న భారత జట్టులో రెండో బృందం ఇంగ్లాండ్‌కు బయల్దేరనుంది. ఈ లోపే అతడు కోలుకోవాలని అంతా కోరుకుంటున్నారు. ఇప్పటి వరకు గాయం నుంచి ఎంత రికవరీ అయ్యాడో తెలుసుకొనేందుకు శనివారం తక్కువ తీవ్రతతో కూడిన ఫిట్‌నెస్ టెస్టు నిర్వహించనున్నారు. దానిని బట్టి అతడిని ఇంగ్లాండ్‌కు పంపించనున్నారు.
'ఇదో నెమ్మది ప్రక్రియ. కేఎల్ రాహుల్ మెల్లగా కోలుకుంటున్నాడు. టీమ్‌ఇండియాకు ఇది శుభసూచకం కాదు. రెండో బ్యాచ్ ఇంగ్లాండ్‌కు బయల్దేరేందుకు ఇంకా 3-4 రోజుల సమయమే ఉంది. అందుకే శనివారం తేలికపాటి ఫిట్‌నెస్ టెస్టు నిర్వహిస్తున్నాం. అందులో నెగ్గితే ఇంగ్లాండ్ విమానం ఎక్కుతాడు. లేదంటే పూర్తిగా కోలుకొనేంత వరకు ఎదురు చూస్తాం. ఇప్పటికైతే అతడిని ఇంగ్లాండ్ పర్యటన నుంచి తప్పించలేదు' అని బీసీసీఐ అధికారి ఒకరు తమకు చెప్పినట్టు ఇన్‌సైడ్ స్పోర్ట్స్ రిపోర్టు చేసింది.
'ఈ దశలో కేఎల్ రాహుల్‌కు టైమ్‌లైన్ ఏమీ లేదు. అతడు కోలుకుంటున్నాడు. నెమ్మదిగా రికవరీ అవుతున్నాడనేది నిజమే. టెస్టు మ్యాచుకు ముందే అతడు పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడని మాకు విశ్వాసం ఉంది. అవసరమైతే ఆలస్యంగా అతడిని ఇంగ్లాండ్‌కు పంపిస్తాం' అని ఆ అధికారి వెల్లడించారు.
కేఎల్ రాహుల్ గాయపడటం కొత్తేమీ కాదు. ఏడాది కాలంగా అతడు కొన్ని కీలకమైన సిరీసులకు దూరమయ్యాడు. 2021 నవంబర్లో తొడ కండరాలు పట్టేయడంతో న్యూజిలాండ్ టెస్టు సిరీస్ ఆడలేదు. అదే ఏడాది ఫిబ్రవరిలో పిక్క కండరాల గాయంతో వెస్టిండీస్, శ్రీలంక టీ20 సిరీసుల నుంచి తప్పుకున్నాడు. మార్చిలో లంకపై టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. జనవరిలో మణికట్టు గాయంతో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీసు నుంచి తప్పుకున్నాడు.