యూఎస్ ఓపెన్‌లో సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్ టైటిల్‌ కోసం జరిగిన పోరులో 18 ఏళ్ల యువ క్రీడాకారిణి విజయం సాధించింది. ఈసారి ఫైనల్ లో ఇద్దరు యువ క్రీడాకారులు తలపడ్డారు. కెనడాకు చెందిన లేలా ఫెర్నాండెజ్‌పై బ్రిటన్ క్రీడాకారిణి ఎమ్మా రదుకాను గెలుపొందింది. ఈ విజయంతో తొలిసారి యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఆమె విజేతగా నిలిచింది. ఎమ్మా రదుకాను లేలా ఫెర్నాండెజ్‌ని వరుస సెట్లలో 6-4, 6-3తో ఓడించింది. వీరద్దరికీ ఇదే తొలి గ్రాండ్ స్లామ్ ఫైనల్ కావడం విశేషం. 


 






అన్ సీడెడ్ గా బరిలోకి 


ఎమ్మా రదుకాను, స్టార్ లీలా ఫెర్నాండెజ్ అద్భుతమైన ప్రదర్శనలతో యూఎస్ ఓపెన్ ఫైనల్స్‌కు చేరుకున్నారు. బ్రిటన్ కు చెందిన 18 ఏళ్ల రదుకాను, కెనడాకు చెందిన 19 ఏళ్ల ఫెర్నాండెజ్ మధ్య పోలికలు ఉన్నాయి. అత్యంత కష్టతరమైన షాట్‌లను అవలీలగా ఆడగల నైపుణ్యం వీరిసొంతం. యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ లో మహామహులను మట్టికరిపించి ఇద్దరు అన్‌సీడెడ్‌ క్రీడాకారిణులు ఫైనల్స్ కు చేరారు. ఫైనల్‌ పోరులో 18 ఏళ్ల బ్రిటిష్‌ యువ క్రీడాకారిణి ఎమ్మా రదుకాను చరిత్ర సృష్టించింది. మహిళల సింగిల్స్‌ టైటిల్‌ పోరులో లెలా ఫెర్నాండెజ్‌ను 6-4, 6-3 తేడాతో ఓడించి తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను గెలుచుకుంది. 


44 ఏళ్ల తర్వాత 


ఈ విజయంతో యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ గెలుచుకున్న తొలి క్వాలిఫైయర్‌గా రదుకాను చరిత్ర సృష్టించింది. 150 ర్యాంక్‌లో ఉన్న ఎమ్మా రదుకాను 73వ ర్యాంక్‌ క్రీడాకారిణి లెలా ఫెర్నాండెజ్‌ను ఓడించింది. దీంతో 44 ఏళ్ల తర్వాత గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలుకున్న బ్రిటన్‌ మహిళగా ఆమె రికార్డును నెలకొల్పింది. బ్రిటన్‌ తరఫున 1977లో వర్జీనియా వేడ్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలుపొందారు. 


Also Read: US Open Final: యూఎస్ ఓపెన్ ఫైనల్లో యువ క్రీడాకారిణులు... ఫైనల్లో ఎమ్మా రాడుకా vs లెయ్‌లా ఫెర్నాండెజ్‌


 






మొత్తం 20 సెట్లలలో గెలుపు


అత్యంత ఉత్కంఠగా జరిగిన తుదిపోరులో ఎమ్మా తొలి నుంచి ఆధిపత్యం ప్రదర్శించింది. ఎక్కడ తప్పిదాలు చేయకుండా మొదటి సెట్‌ను 6-4 తేడాతో గెలిచింది. తొలి సెట్‌ను గెలుపుతో మరింత ఆత్మవిశ్వాసంతో ఆడిన ఎమ్మా రదుకాను రెండో సెట్‌లో 6-3 తేడాతో ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా సొంతం చేసుకుంది. ఎమ్మా టోర్నీ ఆసాంతం ఒక్క సెట్‌ కూడా కోల్పోకపోవడం మరో విశేషం. ఈ టోర్నీలో తాను ఆడిన తొమ్మిది గేమ్ లలోనూ ఒక్క సెట్‌ను కూడా కోల్పోలేదు. మొత్తం 20 సెట్లలోనూ గెలిచింది. టైటిల్‌ గెలుపుతో ఎమ్మా 2.5 మిలయన్‌ డాలర్ల ప్రైజ్‌ మనీ సొంతం చేసుకుంది. ఈ గెలుపుతో ఎమ్మా ర్యాంక్ 150 నుంచి 23కు చేరింది. 


Also Read: T20 World Cup: రషీద్ ఖాన్ అలక... కొత్త కెప్టెన్‌గా మహ్మద్ నబీ... ప్రకటించిన ACB