వెస్టిండీస్ స్టార్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో కీలక నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మైంట్ ప్రకటించి తన అభిమానులకు షాకిచ్చాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ ముగియగానే తన రిటైర్మెంట్ నిర్ణయం అమల్లోకి వస్తుందని స్పష్టం చేశాడు. మరో రెండు, మూడేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడతాడని భావించిన అభిమానులకు, మద్దతుదారులకు షాకిచ్చే నిర్ణయం తీసుకున్నాడు 38 ఏళ్ల ఈ విండీస్ ఆల్ రౌండర్.
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు గత కొన్నేళ్ల నుంచి డ్వేన్ బ్రావో ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఓ సీజన్లో అత్యధిక వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ సైతం అందుకున్నాడు. 2021 సీజన్ ఐపీఎల్ విజేతగా నిలిచిన సీఎస్కే జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించిన బ్రావో ఇతర లీగ్స్‌లో కొనసాగుతాడా లేదా అనే దానిపై స్పష్టత రాలేదు. టీ20 ప్రపంచ కప్ విండీస్ ఆల్ రౌండర్‌కు చివరి అంతర్జాతీయ మ్యాచ్ కానుంది.
Also Read: ఆసక్తికరంగా మారిన గ్రూప్-ఏ.. సెమీస్‌కు ఇంగ్లండ్.. రెండో స్థానం కోసం మూడు జట్లు!
డ్వేన్ బ్రావో కెరీర్..
2004లో ఇంగ్లాండ్ జట్టు మీద టెస్టు అరంగేట్రం చేసిన బ్రేవో 2010లో లంకపై ఆడిన టెస్టు చివరిది. అదే ఏడాది ఇంగ్లాండ్ పైనే వన్డే అరంగేట్రం చేయగా భారత్‌తో 2014లో ఆడిన వన్డే అతడి కెరీర్ లో చివరి 50 ఓవర్ల మ్యాచ్. అయితే టీ20లలో మాత్రం 2006లో ఎంట్రీ ఇవ్వగా జట్టులో యాక్టివ్‌గా కొనసాగుతున్నాడు. మధ్యలో బోర్డుతో వివాదాలు జట్టుకు అతడ్ని దూరం చేశాయి. విండీస్ టీ20 ప్రపంచ కప్ సాధించిన జట్టులో బ్రావో కీలకంగా వ్యవహరించాడు.
Also Read: అస్సాం ట్రైన్ ఎక్కేసిన వెస్టిండీస్.. 20 పరుగులతో శ్రీలంక విజయం
40 టెస్టుల్లో విండీస్ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన బ్రావో 3 శతకాలు, 13 అర్ధశతకాల సాయంతో 2,200 పరుగులు చేశాడు. 86 వికెట్లు పడగొట్టాడు. 164 వన్డేలాడిన బ్రావో 2 శతకాలు, 10 అర్ధశతకాలతో 2,968 పరుగులు సాధించాడు. 89 టీ20లలో 1,243 పరుగులు చేశాడు. ఆల్ రౌండర్‌గా తాను ఆడిన ప్రతి జట్టులోనూ కీలక సభ్యుడిగా విజయాలు అందించాడు. ఐపీఎల్ లోనూ అత్యుత్తమ ఆల్ రౌండర్లలో బ్రావో ఒకడు.