Dutee Chand Suspended:   డోపింగ్ పరీక్షల్లో ఫలితం పాజిటివ్ గా రావటంతో భారత స్టార్ స్ప్రింటర్ ద్యుతి చంద్ పై తాత్కాలిక నిషేధం పడింది. కండరాలను బలోపేతం చేసే, కొవ్వును కరిగించి సామర్థ్యాన్ని పెంచే ఉత్ప్రేరకాలను ఆమె వాడినట్లు తేలింది. గతేడాది డిసెంబర్ 5న ఆమె నుంచి సేకరించిన ఎ శాంపిల్ లో ఈ నిషేధిత ఉత్ప్రేరకం వాడినట్లు తేలిందని జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) వెల్లడించింది. 


ఆమె మూత్రం శాంపిల్ లో నిషేధిత ఉత్ప్రేరకాల ఆనవాళ్లు బయటపడ్డాయి. దీంతో ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ నిబంధనల ప్రకారం ఆమెపై తాత్కాలిక నిషేధం విధించారు. ఈ విషయాన్ని ఆమెకు తెలియజేశామని నాడా వెల్లడించింది. ద్యుతి 2018 ఆసియా క్రీడల్లో 100 మీటర్లు, 200 మీటర్ల విభాగాల్లో రజత పతకాలు సాధించింది. యాంటీ డోపింగ్ డిసిప్లినరీ ప్యానెల్ విచారణలో ద్యుతి చంద్ పై వచ్చిన ఆరోపణలు రుజువైతే ఆమెపై నాలుగేళ్లపాటు నిషేధం పడుతుంది. 


వివాదాలు


ద్యుతి చంద్ ఇంతకుముందు కూడా చర్చనీయాంశంగా మారారు. ద్యుతి చంద్ స్వలింగ సంపర్కంలో ఉన్నట్లు ప్రకటించిన మొదటి భారతీయ క్రీడాకారిణిగా నిలిచారు. 2019 మేలో ఒడిశాలోని తమ గ్రామానికి చెందిన మోనాలిసాతో ఉన్న సంబంధాన్ని వెల్లడించిన ద్యుతి.. ఆమెనే పెళ్లి చేసుకుంటానని బహిరంగంగా ప్రకటించారు. దాంతో పాటు తన శారీరక తత్వం కారణంగా సమాజంలో దారుణమైన వివక్షను ఎదుర్కొన్నానంటూ  వాపోయారు. ఒకరు ఎప్పుడైనా, ఎవరితోనైనా ప్రేమలో పడొచ్చని, కులం, మతం లేదా లింగం ఆధారంగా నిర్ణయించలేమని ద్యుతి చంద్ జూలై 2020లో చెప్పారు.


ఇటీవల భారత జట్టు మహిళా స్టార్‌ స్ప్రింటర్‌ ద్యుతీచంద్‌ ఓ ఆసక్తికర ఫొటోను పంచుకున్నారు. తన భాగస్వామి మోనాలిసాతో కలిసి సంప్రదాయ దుస్తులు ధరించి ఉన్న ఒక పిక్ ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. దాంతో పాటు లవ్ ఈజ్ లవ్ అనే క్యాప్షన్ ను కూడా ఈ ఫొటోకు జత చేశారు.