MS Dhoni News:  టీమ్‌ఇండియా మాజీ సారథి, మిస్టర్‌ కూల్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ(MS Dhoni) మోసపోయాడు. మీరు వింటున్నది నిజమే. భారత జట్టుకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ధోనీని ఓ కంపెనీ కోట్ల మేర మోసగించింది. క్రికెట్‌ అకాడమీ విషయంలో ధోనీ భాగస్వామిగా ఉన్న ఓ కంపెనీ ఆయనను రూ.15 కోట్ల మేర మోసగించింది. దీంతో ఆ భాగస్వామ్యం నుంచి వైదొలిగిన మహేంద్రుడు.. వారిపై క్రిమినల్‌ కేసు పెట్టారు. దుబాయ్ నుంచి స్వదేశానికి వచ్చిరాగానే మ‌హీ కోర్టును ఆశ్రయించాడు. క్రికెట్ అకాడ‌మీ పేరుతో త‌న‌ను మోసం చేసి రూ.15 కోట్లు కాజేసిన ఇద్దరిపై రాంచీ కోర్టులో కేసు పెట్టాడు.

 

ఇంతకీ ఏం జరిగిందంటే..?

ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అకాడమీలు ఏర్పాటు చేసేందుకు.. ఆర్కా స్పోర్ట్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్ లిమిటెడ్‌ సంస్థ 2017లో ధోనీతో ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం ఆర్కా స్పోర్ట్స్‌..ఫ్రాంఛైజీ ఫీజులు, లాభాల్లో వాటాను క్రికెటర్‌కు చెల్లించాల్సి ఉంటుంది. ఫ్రాంచైజ్ ఫీజు, లాభాల్లో వాటా ఇస్తామ‌ని అగ్రిమెంట్‌లో రాసుకున్నారు. కానీ నిబంధ‌న‌ల‌ను తుంగ‌లో తొక్కుతూ మ‌హీ భాయ్‌ను ఈ సంస్థ మోసం చేసింది. అయితే, ఈ ఒప్పందంలోని షరతులను పాటించడంలో ఆర్కా స్పోర్ట్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌ కంపెనీ విఫలమైంది. దీనిపై ఆర్కా స్పోర్ట్స్‌ య‌జ‌మాని మిహిర్ దివాక‌ర్‌, సౌమ్యా విశ్వాస్‌లతో చర్చించినా ఫలితం లేకపోవడంతో.. ఆ ఒప్పందం నుంచి ధోనీ వైదొలిగారు. 2021 ఆగస్టు 15న ఆర్కా స్పోర్ట్స్‌కు ఇచ్చిన అథారిటీ లెటర్‌ను ఆయన రద్దు చేసుకున్నారు. అనంతరం పలుమార్లు లీగల్‌ నోటీసులు పంపించినా ఎలాంటి స్పందన రాకపోవడంతో ధోనీ తాజాగా కోర్టును ఆశ్రయించారు. ధోనీ ఫిర్యాదుతో  మిహిర్ దివాక‌ర్‌, సౌమ్యా విశ్వాస్‌ల‌పై క్రిమినల్‌ కేసు న‌మోదు చేశారు. . మరోవైపు ధోనీ మోస పోవడం పట్ల పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ధోనీ నమ్మిన వారు చీట్ చేశారని పలువురు అంటుండగా..దీనీనే బోల్తా కొట్టించారని ఇంకొంత మంది వ్యాఖ్యానిస్తున్నారు. 

 

ధోనీ పరువునష్టం కేసు

గతంలోనూ ధోనీ వేసిన పరువు నష్టం కేసులో కోర్టు ఓ ఐపీఎస్‌ అధికారికి జైలు శిక్ష విధించింది. 2013లో ఐపీఎస్ అధికారి సంపత్ కుమార్ ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఐపీఎల్ ఫిక్సింగ్ కు, క్రికెటర్మహేంద్ర సింగ్ ధోనీకి ముడిపెడుతూ క్రికెటర్ ధోనీపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ అంశంపై ధోనీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో సంబంధిత టీవీ ఛానల్‌తో పాటు ఐపీఎస్ అధికారి సంపత్‌పై 2014లో పరువు నష్టం దావా వేశాడు. ఆ అధికారి తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని, పరిహారంగా రూ.100 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశాడు. అంతే కాకుండా తన 17 ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ధోనీ పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు స్పందించి అతడు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని టీవీ యాజమాన్యానికి, ఐపీఎస్ అధికారి సంపత్‌కు నోటీసులు జారీ చేసింది. అయితే దీనిపై టీవీ ఛానల్ ఇచ్చిన వివరణను కోర్టు కొట్టివేసింది. ధోనీ లాంటి అంతర్జాతీయ క్రికెటర్‌పై వార్తలు ప్రచురించే ముందు జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా కోర్టు సూచించింది. మరోవైపు ఐపీఎస్ అధికారి సంపత్ ఇచ్చిన వివరణతో ధోనీ సంతృప్తి చెందలేదు. ఆయన ఇచ్చిన వివరణలో సుప్రీం కోర్టు, హైకోర్టుపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారని, కోర్టు ధిక్కరణ కింద వెంటనే సంపత్‌పై చర్యలు తీసుకోవాలని మరోసారి మద్రాస్ హైకోర్టును ధోనీ కోరాడు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఐపీఎస్ అధికారి సంపత్‌కు 15 రోజుల జైలు శిక్ష విధించింది.