మహేంద్ర సింగ్ ధోని.. క్రికెట్ ను దైవంగా భావించే భారత్ కు దొరికిన ఓ వరం. అప్పుడెప్పుడో కపిల్ దేవ్ తీసుకొచ్చిన ప్రపంచకప్ ను తిరిగి భారత్ మళ్లీ దక్కించుకునేలా చేసిన నాయకుడు. ధోని లాంటి ఫినిషర్, కెప్టెన్, క్రికెట్ ను అర్థం చేసుకునే ప్లేయర్ టీమిండియాకు దొరకడం చాలా కష్టం. ఈ విషయాన్ని మాజీ ప్లేయర్లతో సహా ఇప్పుడున్న యంగ్ ప్లేయర్లు కూడా చాలా సార్లు చెప్పారు. మరి ధోని ఇప్పుడు లేడు. కానీ ధోని చెక్కిన కుర్రాళ్లు.. టీమిండియాలో దుమ్ము రేపుతున్నారు. తాజాగా ఆ కోవలోకి యంగ్ సెన్సేషన్ దీపక్ చాహర్ కూడా చేరాడు.


దీపక్ ధనాధన్.. 


తాజాగా జరిగిన శ్రీలంక-భారత్ సిరీస్ లో చాహర్ బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లో నూ మెరిశాడు. ఓటమి అంచుల్లో ఉన్న జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. రెండో వన్డేలో లంక నిర్దేశించిన 276 పరుగుల లక్ష్య ఛేదనలో టీమ్‌ఇండియా 160కే 6 వికెట్లు చేజార్చుకొని కష్టాల్లో పడింది. ఈ క్రమంలో ఎనిమిదో స్థానంలో వచ్చిన దీపక్‌ చాహర్‌ (69*; 82 బంతుల్లో 7×4, 1×6), కృనాల్‌ పాండ్య(35)తో 33 (49 బంతుల్లో), భువనేశ్వర్‌(19*; 28 బంతుల్లో 2×4)తో 84* (84) పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పాడు. జట్టుకు విజయంతో పాటు సిరీస్‌ను అందించాడు.


మ్యాచ్ అయిపోయిందిలే అనుకుని టీవీ కట్టేద్దామనుకున్న ఫ్యాన్స్ ను షాక్ అయ్యేలా బ్యాటింగ్ చేశాడు. దీపక్ చూపిన పరిణితి సీనియర్ బ్యాట్స్ మెన్ ను తలపించింది. బౌలర్ మ్యాచ్ నే గెలిపించాడు అని ఫ్యాన్స్ దీపక్ చాహర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.


ధోని చెక్కిన శిల్పం..


దీపక్ చాహర్.. చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ లో తొలి ఓవర్ వేస్తూ ఉంటాడు. చాలా సార్లు మ్యాచ్ లలో తొలి ఆరు ఓవర్లలోనే వికెట్ తీస్తూ టీమ్ కు శుభారంభం ఇచ్చేవాడు. ధోని కూడా దీపక్ పై నమ్మకం ఉంచేవాడు. అయితే ఎప్పుడైనా దీపక్ ఒత్తిడిలో కనబడితే ధోని దగ్గరికి వచ్చి ఇచ్చే సలహా ఎంతో ఉపయోగపడుతుంది. ఈ విషయాన్ని చాలా సార్లు చాహర్ కూడా చెప్పాడు.


అయితే ఫీల్డ్ లో ధోని ఉంటే కుర్రాళ్లకు వచ్చే కిక్కే వేరు. బౌలర్ ఒత్తిడిలో ఉన్నట్లు కనిపిస్తే ధోని దగ్గరకి వచ్చి ఇచ్చే సలహా ఎంత గొప్పగా పనిచేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలా సార్లు వికెట్ పడని సమయంలో ధోని ఇచ్చే ఐడియా బాగా వర్కవుట్ అవుతుంది. 


చాహర్ అనే కాదు..


చాహర్ అనే కాదు టీమిండియాలో ఉన్నప్పుడు ఎంతోమందిని ధోని తనదైన శైలిలో ఓ శిల్పంలా చెక్కాడు. రైనా, జడేజా, అశ్విన్ ఇలా.. ఈ జాబితా పెద్దదే. అందుకే ధోని.. మళ్లీ కోచ్ గా నైనా టీమిండియాతో ఉండాలని ఎంతోమంది మాజీలు కోరుతున్నారు. మరి 'తలా' ఏం చేస్తాడో చూడాలి.