CWG Champions PM Meeting: ప్రధాని నరేంద్రమోదీ తమకు ఆతిథ్యం ఇవ్వడం ఆనందంగా ఉందని కామన్వెల్త్‌ క్రీడాకారులు అంటున్నారు. ఆయన స్వయంగా ప్రోత్సహించడం ప్రేరణనిచ్చిందని వెల్లడించారు. దిల్లీలోని స్వగృహంలో మోదీ ఆతిథ్యమివ్వడం, సన్మానించడం గొప్ప గౌరవంగా వెల్లడించారు. ఈ ఈవెంట్‌కు సంబంధించిన చిత్రాలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు.




బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. మొత్తం 61 పతకాలు కైవసం చేసుకుంది. ఇందులో 22 స్వర్ణం, 16 రజతం, 23 కాంస్య పతకాలు ఉన్నాయి. షూటింగ్‌ క్రీడ లేనప్పటికీ టీమ్‌ఇండియా ఈ స్థాయిలో పతకాలు సాధించడం ఇదే తొలిసారి. ప్రతిష్ఠాత్మక క్రీడల్లో పాల్గొన్న అథ్లెట్లను శనివారం మోదీ ఆహ్వానించి సత్కరించారు. వారితో కలిసి మాట్లాడారు. వారిచ్చిన బహుమతులు స్వీకరించారు.


తెలంగాణ ముద్దుబిడ్డ, బాక్సర్ నిఖత్‌ జరీన్‌ను మోదీ ప్రత్యేకంగా అభినందించారు. బాక్సర్లంతా సంతకాలు చేసిన బాక్సింగ్ గ్లోవ్స్‌ను ఆయనకు బహూకరించడం గౌరవమని నిఖత్‌ పేర్కొంది. ఈ అద్భుత అవకాశం అందించినందుకు ధన్యవాదాలు తెలియజేసింది.




స్ప్రింటర్‌ హిమదాస్‌ సంప్రదాయ అస్సాం గమ్చాను మోదీ మెడలో అలంకరించింది. 'ప్రధాని నరేంద్రమోదీ ఆశీర్వాదాలు అందుకోవడం సంతోషంగా ఉంది. ఆయనకు సంప్రదాయ గమ్చా బహూకరించడం నా అదృష్టం. అస్సాం ప్రజలందరి తరఫున కృతజ్ఞతలతో ఆయన మెడలో గమ్చాను అలంకరించాను' అని ఆమె ట్వీట్‌ చేసింది.




'ప్రధాని నరేంద్రమోదీ సర్‌ను కలిసి మాట్లాడటం గౌరవం. మీరిచ్చిన మద్దతు, ప్రోత్సాహానికి ధన్యవాదాలు. జై హింద్‌' అని భారత బంగారు కొండ, స్వర్ణ పతక విజేత మీరాబాయి చాను ట్వీట్‌ చేసింది.




బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ ఆటగాడు, స్వర్ణ విజేత చిరాగ్‌ శెట్టి సైతం ధన్యవాదాలు తెలియజేశాడు. 'మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు థాంక్యూ సర్‌. మీ ఇంటివద్ద ఆతిథ్యమివ్వడం గౌరవం. మీతో మాట్లాడటం ఎప్పటికీ ఆనందమే' అని ట్వీటాడు.




బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌ స్వర్ణ పతక విజేత లక్ష్య సేన్‌  ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలియజేశాడు. 'అథ్లెట్లందరికీ ఇదో గొప్ప రోజు. మా కష్టాన్ని గుర్తించి, ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు. మీ మద్దతు దక్కడం మా అదృష్టం. మేమిలాగే దేశాన్ని గర్వపడేలా చేస్తాం. జై హింద్‌' అని పోస్టు చేశాడు.




'మరోసారి ప్రధాని నరేంద్రమోదీని కలిశాను. ఆయనతో మాట్లాడటం, ఆశీర్వాదాలు తీసుకోవడం ఎప్పుడూ ప్రేరణ కలిగిస్తూనే ఉంటుంది. ఆయన మా ప్రదర్శనలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ప్రతిదీ కనుక్కుంటారు' అని పారా టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి భావినా పటేల్‌ తెలిపింది.