CSK vs RCB Innings Highlights: ఐపీఎల్ 2024 మొదటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై బెంగళూరు మంచి స్కోరు సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. అనుజ్ రావత్ (48: 25 బంతుల్లో, నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దినేష్ కార్తీక్ (38 నాటౌట్: 26 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) తనకు చక్కటి సహకారం అందించాడు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహ్మాన్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి 120 బంతుల్లో 174 పరుగులు కావాలి.


మొదట్లో మోతెక్కించారు...
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మంచి ఆరంభం లభించింది. కెప్టెన్, ఓపెనర్ ఫాఫ్ డుఫ్లెసిస్ (35: 23 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు) బౌండరీలతో విరుచుకుపడ్డాడు. దీంతో బెంగళూరు మొదటి మూడు ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 33 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఐదో ఓవర్ నుంచి బెంగళూరు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయింది. ముస్తాఫిజుర్ రెహ్మాన్ తన మొదటి ఓవర్లోనే ఫాంలో ఉన్న ఫాఫ్ డుఫ్లెసిస్, వన్ డౌన్ బ్యాటర్ రజత్ పాటీదార్‌లను (0: 3 బంతుల్లో) పెవిలియన్ బాట పట్టించాడు. పేస్ బౌలర్ దీపక్ చాహర్ తర్వాతి ఓవర్లోనే ఫాంలో ఉన్న గ్లెన్ మ్యాక్స్‌వెల్ (0: 1 బంతి) వికెట్ దక్కించుకున్నాడు. దీంతో బెంగళూరు పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయి 48 పరుగులు చేసింది.


చావు దెబ్బ తీసిన ముస్తాఫిజుర్...
అనంతరం విరాట్ కోహ్లీ (21: 20 బంతుల్లో, ఒక సిక్సర్), కామెరాన్ గ్రీన్ (18: 22 బంతుల్లో, ఒక ఫోర్) కలిసి ఇన్నింగ్స్‌ను కుదుటపరిచే ప్రయత్నం చేశారు. వీరు నాలుగో వికెట్‌కు 35 బంతుల్లో 35 పరుగులు జోడించారు. నెమ్మదిగా ఆడటంతో స్కోరింగ్ రేటు పడిపోయింది. ఈ దశలో ముస్తాఫిజుర్ మరోసారి బెంగళూరును గట్టి దెబ్బ కొట్టాడు. ఇన్నింగ్స్ 12వ ఓవర్లో విరాట్ కోహ్లీ, కామెరాన్ గ్రీన్ ఇద్దరినీ అవుట్ చేశాడు. దీంతో బెంగళూరు 78 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. బెంగళూరు పని అయిపోయంది అనుకున్నారంతా.


అవుట్ ఆఫ్ ది సిలబస్‌గా వచ్చిన అనుజ్, దినేష్
కానీ చెన్నై సూపర్ కింగ్స్‌కి అనుజ్ రావత్ (48: 25 బంతుల్లో, నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు), దినేష్ కార్తీక్ (38 నాటౌట్: 26 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) పూర్తిగా అవుట్ ఆఫ్ సిలబస్ షాకిచ్చారు. మొదటి రెండు ఓవర్లు కాస్త నిదానంగా వీరిద్దరూ మూడో ఓవర్ నుంచి చెలరేగిపోయారు. తుషార్ దేశ్ పాండే వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్లో ఈ జోడీ మూడు సిక్సర్లు, ఒక ఫోర్‌తో ఏకంగా 25 పరుగులు రాబట్టింది. హేమాహేమీలకే ఆడటం సాధ్యం కాని ముస్తాఫిజుర్‌ను కూడా వీరు ఒక ఆటాడుకున్నారు. తను వేసిన 19వ ఓవర్లో 16 పరుగులు పిండుకున్నారు. 


చివరి ఓవర్లో తుషార్ దేశ్‌పాండే కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో తొమ్మిది పరుగులు మాత్రమే వచ్చాయి. చివరి బంతికి అనుజ్ రావత్ రనౌట్ అయ్యాడు. వీరు ఆరో వికెట్‌కు 50 బంతుల్లోనే 95 పరుగులు జోడించడం విశేషం. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహ్మాన్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. దీపక్ చాహర్‌కు ఒక వికెట్ దక్కింది.