Ronaldo felicitated with Globe Soccers Maradona award: పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) ప్రతిష్ఠాత్మక అవార్డుకి ఎంపికయ్యాడు. 2023లో అత్యధికంగా 54 గోల్స్ చేసిన రొనాల్డో... మారడోనా అవార్డుకు నామినేట్ అయ్యాడు. దుబాయ్ గ్లోబ్ సాకర్ అవార్డ్స్ వేడుక (Globe Soccers Maradona award)లో జనవరి 19న .. రొనాల్డో బెస్ట్ గోల్ స్కోరర్ అవార్డును అందుకోనున్నాడు. 2023లో క్రిస్టియానో రొనాల్డో 59 మ్యాచుల్లోనే 54 గోల్స్ సాధించాడు. 2011, 2013, 2014, 2015 సంవత్సరాల్లోనూ రొనాల్డో అత్యధిక గోల్స్ సాధించాడు. రొనాల్డోకు ఫ్రాన్స్ స్టార్ ఎంబాపే, ఇంగ్లండ్ స్టార్ హ్యారీ కేన్‌లతో పోటీ ఎదురైంది. కానీ, వాళ్లిద్దరూ.. 52 గోల్స్‌తో సంయుక్తంగా రెండో స్థానానికే పరిమితమయ్యారు. వరల్డ్ కప్ విజేత లియోనల్ మెస్సీ మాత్రం 44 మ్యాచుల్లో 28 గోల్స్‌తో 2023లో తీవ్రంగా నిరాశపరిచాడు.
క్రిస్టియానో రొనాల్డో మరో అరుదైన ఘనత
అంతకు ముందు ఈ పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు, మరో అరుదైన ఘనత సాధించాడు. ప్రొఫెషనల్ ఫుట్‌బాల్‌లో 1200వ మ్యాచ్ ఆడిన ఆటగాడిగా నూతన చరిత్ర సృష్టించాడు. ఆల్ నస్రీ క్లబ్ తరఫున ఆడుతున్న రొనాల్డో సౌదీ ప్రో లీగ్‌లో ఈ ఘనత సాధించాడు. అల్ రియాద్‌తో జరిగిన మ్యాచ్‌తో 1200 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్ ద్వారా అత్యధిక ఫుట్‌బాల్ ప్రొఫెషనల్ మ్యాచ్‌లు ఆడిన రెండో ఆటగాడిగా క్రిస్టియానో రొనాల్డో రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లండ్ ఆటగాడు పీటర్ షిల్టన్ 1,390 మ్యాచ్‌లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 1200వ మ్యాచ్ ఆడేందుకు సహకరించిన జట్టు సభ్యులకు ధన్యవాదాలని ఈ ప్రయాణం నిజంగా గొప్పదని రొనాల్డో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. 200 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన మొదటి ఆటగాడిగా రికార్డు సొంతం చేసుకున్నాడు.
200 మిలియన్ యూరోలతో ఒప్పందం
గత ఏడాది కెరీర్ చివరి దశలో ఉన్న 37 ఏళ్ల రొనాల్డో సౌదీ అరేబియా కు చెందిన అల్ నజర్ క్లబ్‌తో ఏడాదికి 200 మిలియన్ యూరోలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్‌తో సౌదీ క్లబ్.. రొనాల్డోకు భారత కరెన్సీలో దాదాపు రూ.4400కోట్లు ప్రతీ ఏడాది చెల్లించనుంది. దీంతో ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యధిక ధర కలిగిన ఆటగాడిగా రొనాల్డో సరికొత్త రికార్డు సృష్టించనున్నాడు.మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్‌తో రొనాల్డో డీల్ రద్దు చేసుకున్నాడు. ఫిఫా ప్రపంచకప్ 2022 ప్రారంభానికి రెండు రోజుల ముందు ఈ పరిణామం చోటుచేసుకుంది. పోర్చుగల్ సీనియర్ జాతీయ జట్టుకు 2003లో ఎంపికైన రొనాల్డో అదే ఏడాది క్లబ్ కెరీర్‌ను ప్రారంభించాడు. దాదాపు నాలుగేళ్లపాటు మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్‌కు ఆడాడు. ఆ తర్వాత రియల్ మాడ్రిడ్, జువెంటస్ క్లబ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. 14 ఏళ్ల తర్వాత 2021లో తిరిగి మాంచెస్టర్ క్లబ్‌కు వచ్చినప్పటికీ.. ఏడాదికే ఆ బంధం తెగిపోయింది.
క్రిస్టియానో రొనాల్డో రాక ముందు అల్-నాసర్ జట్టు ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య కేవలం 8.6 లక్షలు మాత్రమే. కనీసం మిలియన్ కూడా లేదు. కానీ, డీల్ జరిగిన నాటి నుంచి దాని ఇన్‌స్టాగ్రామ్‌కు ఫాలోవర్ల సునామీ మొదలైంది. ఆ సంఖ్య మిలియన్లలో పెరుగుతోంది. డీల్ జరిగిన 48 గంటల్లో దాదాపు 30 లక్షలకు చేరగా.. 72 గంటల్లో అది 78 లక్షలకు ఎగబాకింది. హాప్పర్ హెచ్‌క్యూ ప్రకారం, ఈ పోర్చుగల్ ఆటగాడు సోషల్ మీడియా నెట్‌వర్క్‌లో 600 మిలియన్ల మంది ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. అంతేకాకుండా ప్రతి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కు $3.23 మిలియన్లు చార్జ్ చేస్తున్నాడు. ఆయన తరువాత స్థానంలో లియోనెల్ మెస్సీ ఉన్నాడు.