Australia vs Pakistan 3rd Test: ఆస్ట్రేలియా స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ (David Warner) ఫేర్‌వెల్‌ టెస్ట్‌లో విజయం సాధించే అవకాశాన్ని పాకిస్థాన్‌ (Pakistan) చేజేతులా చేజార్చుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 313 పరుగులు చేసి కంగారుల (Australia)ను 299 పరుగులకే పరిమితం చేసిన పాక్‌... రెండో ఇన్నింగ్స్‌లో పేకమేడలా వికెట్లను కోల్పోయింది. 58 పరుగుల వరకూ సాఫీగా సాగిన పాక్‌ ఇన్నింగ్స్‌.. ఆ తర్వాత సైకిల్‌ స్టాండ్‌ను తలపించింది. 


పేకమేడలా కూలిన పాక్‌ వికెట్లు
58 పరుగులకు ఒక్క వికెటే కోల్పోయి పటిష్ట స్ధితిలో కనిపించిన పాక్‌.. ఆ తర్వాత తొమ్మిది పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి 67 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ ఒక్క పరుగు చేయకుండా ఆరు వికెట్లు కోల్పోతే.. ఇప్పుడు అటుఇటుగా పాక్‌ దీన్నే ఫాలో అయింది. రెండో ఇన్నింగ్స్‌లో పాక్‌ తొమ్మిది పరుగుల వ్యవధిలో ఆరు వికెట్లు కోల్పోయి భారత్‌ను ఫాలో అయింది. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 58 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయిన పాక్‌.. ఆతర్వాత తొమ్మిది పరుగుల వ్యవధిలో ఆరు వికెట్లు కోల్పోయి మ్యాచ్‌పై పట్టు కోల్పోయింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు స్కోర్‌ 67/7గా ఉంది. ప్రస్తుతం ఆ జట్టు కేవలం 82 పరుగుల ఆధిక్యంలో ఉంది. చేతిలో మూడు లోయర్‌ ఆర్డర్‌ వికెట్లు మాత్రమే ఉన్న దశలో పాక్‌... ఆసిస్‌ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచుతుందనేది అత్యాశే అవుతుంది. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో ఆసిస్‌ సీమర్‌ హాజిల్‌వుడ్‌ అయిదు ఓవర్లు వేసి కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే విచ్చి నాలుగు వికెట్లు నేలకూల్చాడు. 


82 పరుగుల ఆధిక్యంలో పాక్‌
మూడో రోజు ఆట ముగిసే సమయానికి సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది క్రీజులో మహ్మద్‌ రిజ్వాన్‌(6), అమీర్‌ జమాల్‌(0) ఉన్నారు.  ఆసీస్‌ బౌలర్లలో జోష్‌ హాజిల్‌వుడ్‌ 4 వికెట్లు పడగొట్టగా.. హెడ్‌, లయోన్‌, స్టార్క్‌ తలా వికెట్‌ పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన అధిక్యంతో కలుపుకుని 82 పరుగుల ముందుంజలో పాక్‌ ఉంది. 


ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌.. లోయర్‌ ఆర్డర్‌ ఆటగాళ్ల పుణ్యమా అని తొలి ఇన్నింగ్స్‌లో 313 పరుగులు చేసింది. ఆరో నంబర్‌ ఆటగాడు మొహమ్మద్‌ రిజ్వాన్‌ (88), ఏడో నంబర్‌ ఆటగాడు అఘా సల్మాన్‌ (53), తొమ్మిదో నంబర్‌ ప్లేయర్‌ ఆమిర్‌ జమాల్‌ (82) అర్ధసెంచరీలు చేసి పాక్‌ను ఆదుకున్నారు.  అనంతరం ఆసీస్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 299 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో లబుషేన్‌(60) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. లబుషేన్‌తో పాటు మిచెల్‌ మార్ష్‌(54), ఖావాజా(47) పరుగులతో రాణించారు. పాక్‌ బౌలర్లలో అమీర్‌ జమీల్‌ 6 వికెట్లతో సత్తాచాటాడు. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లను గెలిచిన ఆసీస్‌ ఇదివరకే సిరీస్‌ను కైవసం చేసుకుంది.


వార్నర్‌కు గార్డ్ ఆఫ్‌ ఆనర్‌
స్వదేశంలో చివరి టెస్ట్‌ ఆడుతున్న డేవిడ్‌ వార్నర్‌(David Warner)కు పాకిస్థాన్‌(Pakistan) ప్లేయర్లు గార్డ్ ఆఫ్‌ ఆనర్‌(Guard of Honour) ఇచ్చి గౌరవించారు. ఆస్ట్రేలియా(Australi) జట్టుకు ఎన్నో మరపురాని విజయాలను అందించిన ఈ స్టార్‌ ఓపెనర్‌కు పాక్‌ ఆటగాళ్లు, కంగారు జట్టులోని సహచర ఆటగాళ్లు అభినందనలు తెలిపారు. పాక్‌ ఆటగాళ్లు చెరో వైపున నిలబడి వార్నర్‌కు చప్పట్లతో స్వాగతం పలికారు. వార్నర్‌ బ్యాటింగ్‌కు వచ్చేముందు మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా కూడా వార్నర్‌ను ఆప్యాయంగా కౌగలించుకున్నాడు. కెప్టెన్‌ మసూద్‌, వికెట్‌ కీపర్‌ రిజ్వాన్‌ సహా ప్రతి ఒక్కరూ వార్నర్‌కు అభినందనలు తెలిపారు. తొలి రోజు ఆట ముగిసేసమయానికి ఆసీస్ వికెట్‌ నష్టపోకుండా ఆరు పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ ఆరు పరుగులతో... ఉస్మాన్ ఖవాజా పరుగులేమీ లేకుండా క్రీజులో ఉన్నారు.