Cricketers Should be Proud of Representing Their District MS Dhoni : తమ సొంత జిల్లాలకు ప్రాతినిధ్యం వహించినందుకు క్రికెటర్లు గర్వపడాలని టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్‌కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీ (MS Dhoni) అన్నాడు. జిల్లాకు ఆడటం వల్లే దేశానికి ఆడే అవకాశం వస్తుందని పేర్కొన్నాడు. తిరువల్లూరు జిల్లా క్రికెట్ సంఘం (TDCA) సిల్వర్ జూబ్లీ వేడుకల్లో మహీ మాట్లాడాడు.
'జిల్లా క్రికెట్ సంఘం వేడుకల్లో పాల్గొనడం నాకిదే తొలిసారి. రాంచీలోని మా జిల్లా క్రికెట్ సంఘానికి నేను కృతజ్ఞతలు చెబుతున్నాను. తమ సొంత జిల్లాకు ప్రాతినిధ్యం వహించినందుకు క్రికెటర్లు గర్వపడాలి. జాతీయ స్థాయిలో ఆడినందుకు నేను గర్వపడుతున్నాను. జిల్లా లేదా పాఠశాల క్రికెట్ ఆడకపోతే నాకీ అవకాశం దక్కేదే కాదు' అని ఎంఎస్ ధోనీ గుర్తు చేసుకున్నాడు.
తిరువల్లూరు క్రికెట్ సంఘం విజయవంతంగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు మహీ అభినందించాడు. '25 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు తిరువల్లూరు జిల్లా క్రికెట్ సంఘానికి అభినందనలు. నిజానికి ఇంకెక్కువ ఏళ్లే అయ్యాయి. కానీ మనం ఈ రోజు సంబరాలు చేసుకుంటున్నాం. టీడీసీఏ సెక్రటరీ ఆర్‌ఎన్ బాబా చాలాకాలంగా నాకు తెలుసు. ఆయనతో పాటు జిల్లా అధికారులు అందరికీ శుభాకాంక్షలు. ఒక సంఘం సుదీర్ఘ కాలం సేవలు అందించడం సులభం కాదు. క్రికెట్‌పై ఎనలేని ప్రేమ వల్లే బాబా పని చేస్తున్నారు. ఆయన మైదానాలు, క్రికెటర్లు, క్రీడాకారులను అభివృద్ధి చేశారు' అని ధోనీ అన్నాడు.
'క్రీడాస్ఫూర్తికి ఉన్న విలువను ఈ సంఘం బోధిస్తోంది. టీడీసీఏ ఇలాగే మరిన్ని ఘనతలు అందుకోవాలి. అత్యున్నత స్థాయికి చేరుకోవాలి' అని మహీ కోరుకున్నాడు. ఐసీసీ మాజీ ఛైర్మన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్, సీఎస్‌కే సీఈవో కాశీవిశ్వనాథన్, ఇండియా సిమెంట్స్ డైరెక్టర్ రూపా గురునాథ్, టీఎన్‌సీఏ అధికారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. రవిచంద్రన్ అశ్విన్, దినేశ్ కార్తీక్, ఎండీ తిరుషకామిని సహా తమిళనాడు క్రికెటర్లు వీడియో సందేశాలు పంపించారు.
టీడీసీఏ సెక్రెటరీ డాక్టర్ ఆర్‌ఎన్ బాబా 2012-2015 మధ్యన టీమ్‌ఇండియాకు మీడియా మేనేజర్‌గా పనిచేశారు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ, 2015 ప్రపంచకప్‌కు పనిచేశారు.