South Africa tour of Zimbabwe: టెస్టు క్రికెట్లో అరుదైన రికార్డు నమోదైంది. జింబాబ్వే, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండవ టెస్ట్‌లో వియాన్ ముల్డర్ ట్రిపుల్ సెంచరీ సాధించి సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్ట్ రెండవ రోజున సోమవారం నాడు ఆటలో భాగంగా కేవలం 297 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ పూర్తి చేసి అరుదైన ఘనత సాధించాడు.
వియాన్ ముల్డర్ ప్రపంచంలోనే కెప్టెన్‌గా తన తొలి టెస్ట్‌లోనే ట్రిపుల్ సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా దక్షిణాఫ్రికా బ్యాటర్ నిలిచాడు. తెంబా బావుమా జింబాబ్వేతో జరుగుతున్న ఈ సిరీస్‌లో భాగం కాలేదని, అతని స్థానంలో కేశవ్ మహారాజ్ కు తాత్కాలిక కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. కానీ గాయం కారణంగా కేశవ్ మహరాజ్ జింబాబ్వేతో రెండవ టెస్ట్‌కు దూరమయ్యాడు. కేశవ్ మహరాజ్ స్థానంలో ముల్డర్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు. ఈ క్రమంలో కెప్టెన్‌గా తన తొలి ఇన్నింగ్స్‌లోనే టెస్టు క్రికెట్ చరిత్రలో ట్రిపుల్ సెంచరీ సాధించిన తొలి బ్యాటర్ గా వియాన్ ముల్డర్ నిలిచాడు.
సెకండ్ ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ (Viaan Mulder Triple century)
వియాన్ ముల్డర్ చేసింది టెస్ట్ చరిత్రలో రెండవ అత్యంత వేగవంతమైన ట్రిపుల్ సెంచరీ. కాగా ఈ జాబితాలో తొలి స్థానంలో టీమిండియా మాజీ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఉన్నాడు. సెహ్వాగ్ ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టడానికి వియాన్ ముల్డర్ చాలా దగ్గరగా వచ్చాడు. కానీ సాధ్యం చేసుకోలేకపోయాడు. డాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ 2008లో దక్షిణాఫ్రికా జట్టుపైనే 278 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ. 17 ఏళ్లు గడిచినా ఈ రికార్డు చెక్కు చెదరలేదు.
తాజాగా 297 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన దక్షిణాఫ్రికా బ్యాటర్ ముల్డర్ ఈ జాబితాలో రెండవ స్థానంలో నిలిచాడు. వీరి తరువాత మూడో స్థానంలో ఇంగ్లాండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ఉన్నాడు. బ్రూక్ గత సంవత్సరం పాకిస్తాన్‌పై 310 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ చేయడం తెలిసిందే.
దక్షిణాఫ్రికా తరఫున హయ్యెస్ట్ స్కోర్
దక్షిణాఫ్రికా తరఫున ఓ ఇన్నింగ్స్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో హషీం ఆమ్లా 311 పరుగులను దాటేశాడు. టెస్టుల్లో క్వాడ్రపుల్ సెంచరీ చేసిన వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ బ్రియాన్ లారా రికార్డుపై కన్నేశాడు.