Yuzvendra Chahal: ఆసియా కప్‌తో పాటు త్వరలో జరుగబోయే వన్డే వరల్డ్ కప్‌లో కూడా భారత  జట్టు తరఫున చోటు కోల్పోయిన టీమిండియా వెటరన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కౌంటీ క్రికెట్‌లో మాత్రం ఘనంగా ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవలే ఇంగ్లాండ్  లోని కెంట్ టీమ్‌తో ఒప్పందం కుదుర్చుకున్న చాహల్..   తొలి మ్యాచ్‌‌లోనే మూడు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు.  


ఇంగ్లాండ్‌లోని కౌంటీ  ఛాంపియన్‌షిప్ డివిజన్ వన్ - 2023లో భాగంగా  నాటింగ్‌హమ్‌షైర్‌తో జరిగిన   మ్యాచ్‌లో  కెంట్ తరఫున ఎంట్రీ ఇచ్చిన చాహల్..  29 ఓవర్లు వేసి  63 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.  ఆట మూడో రోజు  చాహల్‌కు బౌలింగ్ వేసే అవకాశం దక్కగా  చాహల్ ఇందులో ఏకంగా  పది మెయిడిన్ ఓవర్లు వేయడం గమనార్హం.  


 






నాటింగ్‌హమ్‌షైర్‌ బ్యాటర్లలో మాథ్యూ మోంటగొమరీ, లిండన్ జేమ్స్, కల్విన్ హరీసన్‌లను  చాహల్ పడగొట్టాడు.   కెంట్ పేసర్ ఆరోన్ నిజ్జర్   32 ఓవర్లు వేసి  67 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు.  ఇతడు  ఇంగ్లాండ్ దేశస్తుడే  అయినా భారత మూలాలు ఉన్న పేసరే కావడం విశేషం. ఈ ఇద్దరూ కట్టడిచేయడంతో నాటింగ్‌హమ్‌షైర్‌  265 పరుగులకు ఆలౌట్ అయింది.   అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన కెంట్.. 115.4 ఓవర్లలో 446 పరుగులకు ఆలౌట్ అయింది. 


 






చాహల్‌కు  కౌంటీ క్రికెట్‌లో ఇదే తొలి సీజన్. ఇంతవరకూ  ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 51  ఇన్నింగ్స్‌లలో 87 వికెట్లు తీసిన చాహల్.. కౌంటీలలో ఇదే తొలి సీజన్. దేశవాళీలో తన సొంత రాష్ట్రం హర్యానా తరఫున రంజీలు ఆడిన చాహల్ చివరిసారిగా  2022లో  రంజీ ట్రోఫీ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు.  భారత్ తరఫున పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పలు మ్యాచ్‌లు ఆడిన చాహల్ ఇంతవరకూ  రెడ్ బాల్ క్రికెట్‌లో మాత్రం ఎంట్రీ ఇవ్వలేదు. కెంట్  అనుభవం ద్వారా చాహల్ టెస్టు క్రికెట్ లోకి ఎంట్రీ ఇస్తాడేమో చూడాలి. ఇక వన్డే వరల్డ్ కప్‌లో  చాహల్‌కు చోటుదక్కడంపై  టీమిండియా మాజీలు  సెలక్షన్ కమిటీపై విమర్శలు గుప్పిస్తున్నారు.  మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ట్విటర్ వేదికగా  స్పందిస్తూ.. ప్రపంచకప్ జట్టులో   యుజ్వేంద్ర చాహల్ లేకపోవడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది.  అతడు ప్యూర్ మ్యాచ్ విన్నర్’ అని  రాసుకొచ్చాడు.


 
































ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial