IPL 2025 SRH News: సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మతో భారత దిగ్గజ ఆల్ రౌండ‌ర్ యువ‌రాజ్ సింగ్ తో ఉన్న అనుబంధం తెలిసిందే. మెంటార్ గా త‌న‌ను ఎంతో మెరుగు ప‌ర‌చాడని యువ‌రాజ్ గురించి అభిషేక్ ఎంతో గొప్ప‌గా చెప్పేవాడు. వీళ్ల అనుబంధం ఇప్పటిదే కాదు. దాదాపు కోవిడ్ 19రోజుల నుంచి కొన‌సాగుతుండ‌టం విశేషం. పంజాబ్ కు చెందిన అభిషేక్, శుభమాన్ గిల్ ల‌ను త‌న ఇంట్లో ఉంచుకుని, కోవిడ్ 19 స‌మ‌యంలో యువీ శిక్ష‌ణనిచ్చాడు. త‌ర్వాత కాలంలో అభిషేక్ ఐపీఎల్లో త‌న‌ను తాను నిరూపించుకుని ఏకంగా టీమిండియాలో చోటు ద‌క్కించుకున్నాడు. ప్రస్తుతం టీమిండియా టీ20 స్పెష‌లిస్టు బ్యాట‌ర్ గా అభి దాదాపుగా పాతుకుపోయాడు. వ‌చ్చే ఏడాది జ‌రిగే టీ20 ప్ర‌పంచ‌కప్ కోసం త‌య‌రు చేస్తున్న భార‌త జ‌ట్టుకు సంబంధించి ఎంపిక‌లో తానున్నాడు. అయితే త‌మ ద‌గ్గ‌రున్నప్పుడు అభికి తానోక స‌ల‌హా ఇచ్చాన‌ని యూవీ తండ్రి యోగ‌రాజ్ సింత్ తాజాగా తెలిపాడు. 

దానికి దూరంగా ఉండాలి.. క్రికెటర్ అంటే క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారుపేరుగా నిల‌వాల‌ని, నైట్ లైఫ్ లో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని అభిషేక్ కు సూచించాన‌ని యోగ‌రాజ్ తెలిపాడు. నైట్ లైఫ్ లో ముఖ్యంగా ప‌బ్ క‌ల్చ‌ర్ త‌దిత‌ర వాటికి దూరంగా ఉంటే ఎక్కువ కాలం క్రికెట్ కెరీర్ ను కొన‌సాగించ‌వ‌చ్చ‌ని పేర్కొన్న‌ట్లు వెల్ల‌డించాడు. యూవీ ఆడే రోజుల్లో కూడా అత‌డిని ఇలాగే కంట్రోల్లో పెట్టాన‌ని, అందుకే అత‌డు భార‌త జ‌ట్టుకు మెయిన్ ప్లేయ‌ర్ గా ఎదిగాడ‌ని గుర్తు చేసుకున్నాడు. ఇక అభిషేక్ హిట్టింగ్ ప‌వ‌ర్ గురించి స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్స‌న్ ప్ర‌శంస‌లు కురిపించాడు. అతనో గొప్ప అటగాడని, బౌలర్లు తెలివిగా బంతులు సంధిస్తే , వారికి తగినట్లుగా తన ఆటతీరును మార్చుకుని భారీ షాట్లు ఆడగల సామర్థ్యం ఉందని కొనియాడాడు. 

కేన్ మామ హ‌యాంలోనే.. 2019 సీజ‌న్ లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ నుంచి స‌న్ రైజ‌ర్స్ కు అభిషేక్ వ‌చ్చాడ‌ని కేన్ గుర్తు చేసుకున్నాడు. త‌నలో హిట్టింగ్ ఎబిలిటీ సూప‌ర్బ్ గా ఉంటుంద‌ని, చివ‌రి నిమిషంలో షాట్ ను మార్చుకుని కూడా అద్భుత‌మైన షాట్లు ఆడ‌గ‌ల‌డ‌ని పేర్కొన్నాడు. ఒక‌ర‌కంగా చూస్తే త‌న బ్యాటింగ్ ప‌వ‌ర్ ఎస్ ఆర్ హెచ్ కే చెందిన క్లాసెన్ ను పోలి ఉంటుంద‌ని గుర్తు చేశాడు. ఇక గ‌త సీజ‌న్ లో అభిషేక్ దుమ్ము రేపాడు. 16 ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్.. 204కుపైగా స్ట్రైక్ రేట్ తో 484 ప‌రుగులు చేశాడు. ట్రావిస్ హెడ్ తో క‌లిసి విధ్వంస‌క ఓపెనింగ్ భాగ‌స్వామ్యాలు న‌మోదు చేసి, ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల‌ను వ‌ణికించాడు. ఇక గ‌తేడాది టీమిండియా త‌ర‌పున డెబ్యూ చేసిన అభిషేక్.. 17 టీ20ల్లో 33కి పైగా స‌గ‌టుతో రెండు సెంచ‌రీలు చేశాడు. అత‌ని స్ట్రైక్ రేట్ 193కిపైగా అధికంగా ఉండ‌టం విశేషం. అభిషేక్ స‌త్తా చాట‌డంతో య‌శ‌స్వి జైస్వాల్ లాంటి ప్లేయ‌ర్ కు కూడా భార‌త జ‌ట్టులో చోటు ద‌క్క‌డం లేదు.