2023 Indian Cricket Team Record: భారత క్రికెట్‌ జ‌ట్టు ఈ ఏడాది వన్డేల్లో అరుదైన రికార్డును సృష్టించింది. ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా కొత్త చరిత్ర లిఖించింది. 2023 క్యాలెండర్ ఇయర్‌లో టీమిండియా వన్డేల్లో 27 విజయాలు సాధించింది. ఓవరాల్‌గా వన్డేల చరిత్రలో ఒకే ఏడాదిలో అత్యధిక విజయాలు సాధించిన రెండో టీమ్‌గా భారత్ నిలిచింది. 2003లో ఆస్ట్రేలియా వన్డేల్లో అత్యధికంగా 30 విజయాలు సాధించి ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మూడో స్థానంలో కూడా ఆస్ట్రేలియానే ఉంది. 1993లో వన్డేల్లో 26 విజయాలను ఆస్ట్రేలియా తమ ఖాతాలో వేసుకుంది. నాలుగు, ఐదో స్థానాల్లో దక్షిణాఫ్రికా ఉంది. 1996, 2000లో దక్షిణాఫ్రికా వన్డేల్లో 25 విజయాలు కైవసం చేసుకుంది. ఈ ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచింది. కానీ కీలకమైన ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలై రన్నరప్‌తో సరిపెట్టుకుంది. అంతకుముందు స్వదేశంలోనే ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను కూడా 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.. ఇప్పుడు దక్షిణాఫ్రికా గడ్డపై దక్షిణాఫ్రికాను ఓడించి వన్డే సిరీస్ సాధించింది. 

 

బ్యాటింగ్‌లోనూ మనమే

ఏడాది వన్డే క్రికెట్‌లో అద్భుతాలు సృష్టించిన తొలి పది మంది ఆటగాళ్ల జాబితాలో ముగ్గురు భారత క్రికెటర్లు ఉన్నారు. ఈ జాబితాలో తొలి మూడు స్థానాల్లో టీమిండియా దిగ్గజ ఆటగాళ్లే ఉన్నారు. తొలి స్థానంలో గిల్‌ ఉండగా.. రెండో స్థానంలో విరాట్‌ కోహ్లీ.. మూడో స్థానంలో రోహిత్ శర్మ ఉన్నాడు. స్టార్‌ ఓపెనర్‌ శుభమన్‌ గిల్ ఈ ఏడాది మొత్తం 29 వన్డే మ్యాచ్‌లు ఆడి 63.36 సగటుతో 1584 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 9 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 2023లో గిల‌్ అత్యధిక స్కోరు 208 పరుగులు. ఈ ఏడాది గిల్ ఒక్కసారి మాత్రమే డకౌట్‌ అయ్యాడు. రెండో స్థానంలో ఉన్న విరాట్ కోహ్లీ ఈ ఏడాది 27 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 24 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసి 72.47 సగటుతో 1377 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 8 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 2023లో కోహ్లీ అత్యధిక స్కోరు 166 పరుగులు నాటౌట్. ఆ తర్వాత మూడో స్థానంలో ఉన్న భారత కెప్టెన్ రోహిత్ శర్మ 27 మ్యాచ్‌ల్లో 26 ఇన్నింగ్స్‌ల్లో 52.29 సగటుతో 1255 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు వచ్చాయి. ఈ ముగ్గురు భారత బ్యాట్స్‌మెన్‌లలో రోహిత్ శర్మ అత్యధికంగా 67 సిక్సర్లు కొట్టాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్‌ ఇక ఈ ఏడాది వన్డే మ్యాచ్‌లు ఆడడం లేదు. దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్‌కు కూడా ఈ ముగ్గురికి విశ్రాంతి ఇచ్చారు.

 

2023లో అత్యధిక వన్డే పరుగులు చేసిన టాప్-10లో నాలుగో స్థానంలో న్యూజిలాండ్‌కు చెందిన డారిల్ మిచెల్... అయిదో స్థానంలో శ్రీలంకకు చెందిన పాతుమ్ నిస్సాంక ఉన్నారు. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజామ్ ఆరో స్థానంలో, పాకిస్థాన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మహ్మద్ రిజ్వాన్ ఏడో స్థానంలో, ఇంగ్లండ్‌కు చెందిన డేవిడ్ మలన్ ఎనిమిదో స్థానంలో, దక్షిణాఫ్రికాకు చెందిన ఐడెన్ మాక్రమ్‌ తొమ్మిదో స్థానంలో, కేఎల్‌ రాహుల్‌ పదో స్థానంలో స్థానంలో ఉన్నారు.