కొత్త సంవత్సరం రాబోతుంది. మరో క్రీడా సంవత్సరం కాల గర్భంలో కలిసిపోతోంది. ఈ ఏడాది క్రీడల్లో ఎన్నో అద్భుతాలు.. మరెన్నో మధుర విజయాలు. కొన్ని విజయాలు అంతర్జాతీయ క్రీడా వేదికపై భారత ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశాయి. కొన్ని పరాజయాలు అభిమానులను కంటతడి పెట్టించాయి. పొట్టి క్రికెట్‌లో చాలామంది క్రికెటర్లు ఈ ఏడాది తమ మార్కు ఆటతీరుతో అబ్బురపరిచారు. భారత క్రికెట్‌లో 2023 సంవత్సరంలో అయిదు చేదు జ్ఞాపకాలను ఓసారి నెమరు వేసుకుందాం.


1‌) ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఓటమి భారత్‌ను తీవ్రంగా నిరాశపరిచింది. ఇంగ్లాండ్‌లోని ఓవల్ మైదానంలో ఆస్ట్రేలియాతో టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో తలపడింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరినా ఓటమి తప్పలేదు. వరుసగా రెండోసారి  ఫైనల్లో ఓడిపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ ఏడాది టీమ్‌ఇండియాకు  చేదు జ్ఞాపకాల్లో ఇది మొదటిది
2‌) ప్రపంచకప్ ఫైనల్‌లో ఓటమి అభిమానులను కంటతడి పెట్టించింది. వన్డే ప్రపంచకప్‌లో ఈసారి టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. ప్రపంచ కప్ గెలిచిన జట్టు ఆస్ట్రేలియా కూడా టీమిండియాలో సాధికారికంగా కనిపించలేదు. ప్రపంచకప్ ఫైనల్లో టీం ఇండియా ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. ఆస్ట్రేలియా భారత్‌ను ఓడించి ఆరోసారి ప్రపంచ కప్ విజేతగా నిలిచింది. ఫైనల్లో టీమిండియా పరాజయంతో ఆటగాళ్లు, అభిమానులు కంటతడి పెట్టుకున్నారు. 


3) ప్రపంచకప్ ఫైనల్‌ ఓటమి తర్వాత ఆటగాళ్ల కన్నీళ్లు.. అభిమానులను కలచివేశాయి. ప్రపంచకప్‌లో జట్టును సమర్థంగా నడిపించిన కెప్టెన్‌ రోహిత్ శర్మ... ఫైనల్‌ తర్వాత భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నాడు. టీమ్ ఇండియాను ఛాంపియన్‌గా చేయడానికి తన వంతు కృషి చేసిన రోహిత్‌ను ఆస్థితిలో చూసి అభిమానులు తల్లడిల్లడారు. కెప్టెన్సీ, బ్యాటింగ్‌తో రోహిత్‌... ప్రపంచకప్‌లో ప్రతీ జట్టుపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. ఫైనల్‌ అనంతరం తల వంచుకుని మైదానం నుంచి బయటికి వెళ్ళిపోతున్న రోహిత్‌ను చూసి అభిమానులు తీవ్రంగా బాధపడ్డారు. కెరీర్‌లోనే చివరి వన్డే ప్రపంచకప్‌గా భావిస్తున్న ఫైనల్లో ఓటమి బాధ రోహిత్‌ ముఖంలో స్పష్టంగా కనిపించింది. కచ్చితంగా టీమ్ ఇండియాకు చేదు జ్ఞాపకాల్లో ఇదీ ఒకటి


4‌) ప్రపంచ కప్ ముగిసిన తర్వాత, టీమ్ ఇండియా సెలక్టర్లు దక్షిణాఫ్రికా పర్యటన కోసం టీమ్ ఇండియా కోసం మూడు ఫార్మాట్‌ల ముగ్గురు కెప్టెన్లు.. మూడు వేర్వేరు జట్లను ఎంపిక చేశారు. గత 15-16 ఏళ్లుగా భారత, ప్రపంచ క్రికెట్‌ను శాసించిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు వన్డే, టీ20 జట్లలో చోటు దక్కలేదు. ఈ ఇద్దరు ఆటగాళ్లకు T20 ఫార్మాట్ నుంచి వన్డేల నుంచి విశ్రాంతి ఇచ్చారు. బహుశా విరాట్ కోహ్లీ, రోహిత్‌ శర్మ పరిమిత ఓవర్ల క్రికెట్‌కు దూరమైనట్లేనని భావిస్తున్నారు. ఈ దిగ్గజ బ్యాటర్లు ఇక టెస్ట్ ఫార్మాట్‌లో మాత్రమే కనిపిస్తారన్న అంచనాలు ఉన్నాయి. ఇది కచ్చితంగా టీమ్ ఇండియా క్రికెట్ అభిమానులకు చేదు జ్ఞాపకమే.


5‌) ఛతేశ్వర్ పుజారా, అజింక్య రహానెలను కూడా టెస్ట్ ఫార్మాట్ నుంచి తొలగించారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు కొన్నేళ్లుగా టీమ్ ఇండియా కోసం టెస్ట్ ఫార్మాట్ యొక్క మిడిల్ ఆర్డర్ బాధ్యతను నిర్వహించారు, అయితే ఇప్పుడు సెలెక్టర్లు ఈ ఇద్దరు ఆటగాళ్లను దక్షిణాఫ్రికా సిరీస్‌ నుంచి తప్పించి యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చారు. టీమిండియా సెలక్టర్లు పుజారా, రహానేల కెరీర్‌కు స్వస్తి పలికారని మాజీలు అంచనా వేస్తున్నారు.  ఇది కూడా భారత క్రికెట్‌ 2023లో చేదు జ్ఞాపకమే.