కొత్త సంవత్సరం రాబోతుంది. మరో సంవత్సరం కాల గర్భంలో కలిసిపోతోంది. ఈ ఏడాది క్రీడల్లో ఎన్నో అద్భుతాలు.. మరెన్నో మధుర విజయాలు. కొన్ని విజయాలు అంతర్జాతీయ క్రీడా వేదికపై భారత ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశాయి. కొన్ని పరాజయాలు అభిమానులను కంటతడి పెట్టించాయి. ఆటలో గెలుపోటములు సహజమే అయినా.. కొన్ని ఓటములను జీర్ణించుకోవడం కష్టంగా మారింది. కొత్త ఏడాదిలోకి మరికొన్ని రోజుల్లో అడుగుపెట్టబోయే సమయంలో క్రీడల్లో గత జ్ఞాపకాలను మరోసారి నెమరు వేసుకుందాం.
2023 ఏడాది భారత క్రికెట్‌కు ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చింది. 2023 సంవత్సరంలో భారత క్రికెట్ జట్టుకు చాలా దెబ్బలే తగిలాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం ODI ప్రపంచకప్ ఫైనల్‌లో ఓటమి భారత్‌ను చిరకాలం వెంటాడుతుంది. ఈ ఏడాదే భారత్ మూడు ఫార్మట్లలో నెంబర్ వన్‌గా నిలిచి సత్తా చాటింది. రోహిత్ శర్మ సారథ్యంలో ఎన్నో అద్భుత విజయాలు సాధించింది. కానీ ఐసీసీ టోర్నమెంట్‌లలో విఫలమై అభిమానులకు తీరని వేదనను మిగిల్చింది. 2023 ఏడాది ఆరంభంలో శ్రీలంకతో టీ 20, వన్డే సిరీస్‌లను గెలుచుకుని ఘనంగా ఆరంభించింది. మూడో మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌ను 2-1తో గెలుచుకున్న టీమిండియా... మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి 2023 ఏడాదిని ఘనంగా ఆరంభించింది. అనంతరం న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లోనూ భారత్ విజయయాత్ర నిరాటంకంగా కొనసాగింది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 3-0తో రోహిత్ సేన క్లీన్ స్వీప్ చేసింది. టీ 20 సిరీస్‌ను కూడా 2-1తో కైవసం చేసుకుని సత్తా చాటింది. ఆ తర్వాత స్వదేశంలో ఆస్టేలియాతో జరిగిన నాలుగు మ్యాచుల టెస్ట్ సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. 2-1తో టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత జట్టు... వన్డే సిరీస్‌ను మాత్రం ఓడిపోయింది.
ఆ తర్వాత జరిగిన ప్రతిష్టాత్మక ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో ఓటమితో మరోసారి అభిమానులకు టీమిండియా నిరాశను మిగిల్చింది. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో భారత జట్టు తేలిపోయింది. 209 పరుగుల భారీ తేడాతో కంగారులు టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నారు. దీంతో భారత జట్టు నిర్వేదంలో మునిగిపోయంది. అనంతరం వెస్టిండీస్‌తో జరిగిన టెస్టుల్లోనూ 1-0తో గెలిచిన భారత్.. వన్డే సిరీస్‌ను కూడా గెలుచుకుంది. కానీ టీ 20 సిరీస్‌ను ఓడిపోయింది. అనంతరం ఐర్లాండ్‌తో జరిగిన మూడో మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌ను గెలుచుకుంది. కానీ ఆసియా కప్‌లో టీమిండియా సత్తా చాటింది. వరుస విజయాలతో ఆసియా కప్ ఫైనల్‌కు దూసుకొచ్చిన భారత్ లంకను చిత్తుచిత్తుగా ఓడించి కప్‌ను కైవసం చేసుకుంది. మహ్మద్ సిరాజ్ బాల్‌తో నిప్పులు చెరిగాడు. దీంతో ఫైనల్లో లంకేయులు 15 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలగా భారత్ ఆరపు ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి ఆసియా కప్ దక్కించుకుంది. ఆసియా కప్‌లోనే చిరకాల ప్రత్యర్థి పాక్‌పైన టీమిండియా మరచిపోలేని విజాయన్ని సాధించింది. తొలుత 356 పరుగులు చేసిన భారత్... పాక్‌ను 128 పరుగులకే కుప్పకూల్చి ఘన విజయం సాధించింది. ఆసియా కప్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ను గెలుచుకుని ప్రపంచకప్‌లో అడుగుపెట్టింది.
ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో అజేయంగా నిలిచి టీం ఇండియా ఫైనల్స్‌కు చేరుకుంది. ప్రపంచకప్ ట్రోఫీని చేజిక్కించుకుంటారని అందరూ భావించారు. ఆస్ట్రేలియా లాంటి టోర్నీ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టులో కూడా భారత ఆటగాళ్ల భయం కనిపించింది. కానీ, టోర్నీ అంతటా చూపిన ఆకర్షణీయ ప్రదర్శనను ఫైనల్‌లో భారత్ నిలబెట్టుకోలేకపోయింది. ఫలితంగా ఆస్ట్రేలియా మరోసారి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది.