Ind VS wi 2nd test latest News: వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టులో అజేయ భారీ శతకం బాదిన ఇండియన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (253 బంతుల్లో 173 బ్యాటింగ్, 22 ఫోర్లు) తాజాగా అరుదైన ఘనతలను దక్కించుకున్నాడు. శుక్రవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో జైస్వాల్ తన కెరీర్ లో ఏడో టెస్టు సెంచరీని నమోదు చేశాడు. కేవలం 24 ఏళ్ల లోపు వయసులో ఏడవ సెంచరీ మార్కును చేరుకుని అరుదైన క్లబ్ లో చోటు దక్కించుకున్నాడు. 24 ఏళ్ల వయసులో అత్యధిక సెంచరీలు చేసిన టెస్టు బ్యాటర్లలో తను సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాడు. మొదటి స్థానంలో ఆస్ట్రేలియా గ్రేట్ డాన్ బ్రాడ్మన్ 12 సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. రెండో స్థానాన్ని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 11 సెంచరీలతో దక్కించుకున్నాడు. 9 సెంచరీలు చేసిన వెస్టిండీస్ దిగ్గజం సర్ గ్యారీ ఫీల్డ్ సోబర్స్ మూడో స్థానంలో నిలిచాడు. ఇక నాలుగో స్థానంలో జైస్వాల్ తో పాటు జావెద్ మియాందాద్ (పాకిస్థాన్), గ్రేమ్ స్మిత్ (దక్షిణాఫ్రికా), సర్ ఆలిస్టర్ కుక్ (ఇంగ్లాండ్), కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్) నిలిచారు.
డెబ్యూ నుంచి శతకాల జోరు..ఇక రెండేళ్ల కిందట టీమిండియాలో అరంగేట్రం చేసిన జైస్వాల్.. ఈ స్వల్ప కెరీర్ లో ఏడు సెంచరీలు సాధించాడు. అందులో రెండు డబుల్ సెంచరీలు ఉండటం విశేషం. ఈక్రమంలో తను అరంగేట్రం చేసినప్పటి నుంచి అత్యధిక సెంచరీలు చేసిన భారత ఓపెనర్ గా జైస్వాల్ నిలిచాడు. తనతో జోడికి దిగిన మిగతా ఓపెనర్లంతా కలిపి చేసిన సెంచరీలు ఆరు అయితే, జైస్వాల్ ఒక్కడే ఏడు చేయడం విశేషం. ఇక జైస్వాల్ అరంగేట్రం నుంచి అత్యధిక సెంచరీలు చేసిన రెండో ప్లేయర్ ఎవరంటే ఇంగ్లాండ్ కు చెందిన బెన్ డకెట్ కావడం విశేషం. తను కేవలం నాలుగు సెంచరీలు మాత్రమే సాధించాడు. ఈ గణాంకాలు చాలు అంతర్జాతీయ టెస్టుల్లో జైస్వాల్ జోరు ఎలా సాగుతుందో చెప్పడానికి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ట్రిపుల్ కొడతాడా..?ఇక తాజా మ్యాచ్ లో 173 పరుగులు చేసిన జైస్వాల్ మరో 27 పరుగులు సాధిస్తే కెరీర్లో ముచ్చటగా మూడో డబుల్ సెంచరీ సాధిస్తాడు. ఇంకా జోరు కొనసాగిస్తే ట్రిపుల్ సెంచరీ చేసే అవకాశాన్ని కూడా తోసి పుచ్చలేం. డొమెస్టిక్ క్రికెట్ నుంచి కూడా సెంచరీలను భారీ స్కోర్లుగా మలచడం తనకు అలావాటే. అదే ఒరవడిలో జైస్వాల్ నుంచి సంచలన సెంచరీ రావాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. ఇక, వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ సత్తా చాటడంతో తొలిరోజు ఆటముగిసేసరికి 90 ఓవర్లలో 2 వికెట్లకు 318 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో జైస్వాల్ తో పాటు కెప్టెన్ శుభమాన్ గిల్ (20 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. జోమెల్ వర్రీకన్ కు రెండు వికెట్లు దక్కాయి. ఇక తొలి టెస్టును ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో టీమిండియా దక్కించుకున్న సంగతి తెలిసిందే. దీంతో రెండు టెస్టుల సిరీస్ లో 1-0తో ఇండియా ఆధిక్యంలో ఉంది.