WTC Final 2023, India vs Australia: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 209 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి మరో ఐసీసీ ట్రోఫీని గెలుచుకుంది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు ఐదు రోజుల్లోనూ తన పట్టును కొనసాగించగలిగింది. ఈ ముఖ్యమైన మ్యాచ్‌లో కంగారూ జట్టు బంతి, బ్యాట్ రెండింటిలోనూ అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది.


ఆస్ట్రేలియా తరఫున ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ బ్యాట్‌తో ముఖ్యమైన పాత్ర పోషించారు. బంతితో స్కాట్ బోలాండ్ మాత్రమే కాకుండా నాథన్ లియాన్ కూడా అద్భుతాలు చేశాడు. ఈ మ్యాచ్‌లో బంతి లేదా బ్యాట్‌తో జట్టును గెలిపించడంలో ప్రధాన పాత్ర పోషించిన ఐదుగురు ఆటగాళ్లు ఎవరో చూద్దాం.


1. ట్రావిస్ హెడ్ (మొదటి ఇన్నింగ్స్‌లో 163, రెండో ఇన్నింగ్స్‌లో 18 పరుగులు)
ఈ టైటిల్ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్న ట్రావిస్ హెడ్ ఇన్నింగ్స్ ఆస్ట్రేలియా జట్టు విజయంలో చాలా కీలక పాత్ర పోషించింది. మొదటి ఇన్నింగ్స్‌లో హెడ్ 163 పరుగుల వేగవంతమైన ఇన్నింగ్స్ ఆడాడు. దాని ఆధారంగా జట్టు స్కోరు 469కి చేరుకోగలిగింది. రెండో ఇన్నింగ్స్‌లో హెడ్ 18 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయితే ఈ మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ సెంచరీ కీలకమైనదిగా నిలిచింది.


2. స్టీవ్ స్మిత్ (మొదటి ఇన్నింగ్స్‌లో 121, రెండో ఇన్నింగ్స్‌లో 34 పరుగులు)
స్టీవ్ స్మిత్ ఈ ఫైనల్‌ మ్యాచ్‌లో తన బ్యాట్‌తో మరో అద్భుతమైన సెంచరీ ఆడాడు. అతను టెస్ట్ క్రికెట్‌లోని దిగ్గజ బ్యాట్స్‌మెన్‌లో ఎందుకు ఉన్నాడో అందరికీ చాటి చెప్పాడు. మొదటి ఇన్నింగ్స్‌లో స్మిత్ 121 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడమే కాకుండా ట్రావిస్ హెడ్‌తో కలిసి 285 పరుగుల ముఖ్యమైన భాగస్వామ్యాన్ని ఏర్పరిచాడు. రెండో ఇన్నింగ్స్‌లో స్మిత్‌ 34 పరుగులు చేశాడు.


3. అలెక్స్ క్యారీ (మొదటి ఇన్నింగ్స్‌లో 48 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 66 నాటౌట్)
ఆస్ట్రేలియన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ అలెక్స్ క్యారీ ఈ మ్యాచ్‌లో జట్టు కోసం లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌తో పాటు ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో క్యారీ బ్యాట్‌ నుంచి 48 పరుగులు వచ్చాయి. రెండో ఇన్నింగ్స్‌లో అజేయంగా 66 పరుగులు సాధించాడు. భారత్‌కు 444 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించడంలో అలెక్స్ క్యారీ తన బ్యాట్‌తో చాలా ముఖ్యమైన పాత్ర పోషించాడు.


4. స్కాట్ బోలాండ్ (రెండు ఇన్నింగ్స్‌ల్లో ఐదు వికెట్లు)
ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియన్ కెప్టెన్ పాట్ కమిన్స్ తమ బౌలింగ్ యూనిట్‌లో స్కాట్ బోలాండ్‌ ఎక్స్ ఫ్యాక్టర్‌ అని చెప్పాడు. ఇది మ్యాచ్‌లోనూ కనిపించింది. ఈ మ్యాచ్‌లో బోలాండ్ భారత బ్యాటర్లను ఎక్కువగా ఇబ్బంది పెట్టాడు. బోలాండ్ మొత్తంగా ఐదు వికెట్లు తీశాడు. శుభ్‌మన్ గిల్, కేఎస్ భారత్‌లను తొలి ఇన్నింగ్స్‌లో పెవిలియన్ బాట పట్టించాడు. రెండో ఇన్నింగ్స్‌లో గిల్‌తో పాటు విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజాలను అవుట్ చేశాడు.


5. నాథన్ లియాన్ (రెండు ఇన్నింగ్స్‌ల్లో ఐదు వికెట్లు)
ఈ మ్యాచ్‌లో ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియాన్ భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో కీలక సమయంలో రవీంద్ర జడేజా వికెట్ పడగొట్టడం ద్వారా ఆస్ట్రేలియా జట్టును పూర్తిగా మ్యాచ్‌లోకి తీసుకువచ్చాడు. రెండో ఇన్నింగ్స్‌లో లియాన్ ప్రమాదకరంగా కనిపిస్తున్న రోహిత్ శర్మ వికెట్‌ను అందుకున్నాడు. దీంతో పాటు కేఎస్ భరత్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్‌లను కూడా లియాన్‌లను అవుట్ చేశాడు.