WTC Final 2023: ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్ నేడు ఇంగ్లాండ్ లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఘనంగా మొదలైంది. భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఈ తుదిపోరులో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అయితే ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు  ఇంగ్లాండ్  క్రికెట్ ఫ్యాన్స్‌గా చెప్పుకునే ‘బర్మీ ఆర్మీ’ మరోసారి వంకర బుద్ది  ప్రదర్శించింది. ఈ ఫైనల్ మ్యాచ్‌ను ఇంగ్లాండ్ త్వరలో ఆసీస్‌తో ఆడబోయే ‘యాషెస్ సిరీస్‌కు వార్మప్’ గా పోల్చింది.  


డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు ముందు బర్మీ ఆర్మీ ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘యాషెస్ సిరీస్  కోసం వార్మప్ మ్యాచ్ ఆడబోతున్న ఇరు జట్లకూ శుభాకాంక్షలు’అని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ఇండియన్ ఫ్యాన్స్‌తో పాటు  ఆసీస్ అభిమానులకూ ఆగ్రహం తెప్పించింది.   ఇండియన్ ఫ్యాన్స్ అయితే  బర్మీ ఆర్మీకి స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు. 


 






పలువురు టీమిండియా ఫ్యాన్స్ బర్మీ ఆర్మీ ట్వీట్‌కు రిప్లై ఇస్తూ.. ‘అవునవును. రేపటి వార్మప్ మ్యాచ్‌కు మీ యాషెస్ సిరీస్ కంటే  ఎక్కువమంది స్పాన్సర్లు,  ఎక్కువ వ్యూయర్‌షిప్ నమోదుకాబోతుంది..’అని  కౌంటర్ ఇచ్చారు. మరో నెటిజన్.. ‘బజ్‌బాల్ ఆటతో ఇరగదీస్తున్నాం అని సంకలు గుద్దుకునే టీమ్ కనీసం వార్మప్ మ్యాచ్‌కు కూడా క్వాలిఫై కాలేకపోయింది పాపం..’ అని  కామెంట్ చేశాడు. ఓ నెటిజన్ అయితే.. ‘ఇంగ్లాండ్‌లో బ్యాక్ టు బ్యాక్ డబ్ల్యూటీసీ ఫైనల్స్. కానీ ఇంగ్లాండ్ ఆటగాళ్లు మాత్రం దీనికి క్వాలిఫై కాలేదు. ప్రేక్షకులుగా చూస్తున్నారు.  ఇది మీరు సాధించిన గొప్ప ఘనత..’ అని కౌంటర్ ఇచ్చాడు.  


చాలామంది  బర్మీ ఆర్మీ ట్వీట్‌కు కౌంటర్‌గా ఇంగ్లాండ్ జట్టు వైఫల్యాలను ఎండగడుతూ  కౌంటర్లు ఇస్తున్నారు.  ఓ నెటిజన్ అయితే ఏకంగా.. ‘ఏం బాధపడొద్దు. ఇవే టీమ్స్ ప్రతీసారి ఇంగ్లాండ్ కు వార్మప్ మ్యాచ్‌లు ఆడేందుకు  వస్తాయి. మీరు మాత్రం ప్రేక్షకులుగానే ఉంటారు..’అని  స్పందించాడు. మరో నెటిజన్.. ‘ముందుగా రెండుసార్లు ఇంగ్లాండ్ లోనే జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్స్ కు క్వాలిఫై కాలేకపోయిన మీ టీమ్ కు శుభాకాంక్షలు.   అఫ్‌కోర్స్ వాళ్లంతా గ్రౌండ్ స్టాఫ్‌గా ఉన్నారనుకో..!’ అని కౌంటర్ ఇచ్చాడు.  బర్మీ ఆర్మీ ట్వీట్ తో పాటు  ఇండియన్ ఫ్యాన్స్ కామెంట్స్ కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి.  ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్స్ ఆడిన తర్వాత జూన్ 16 నుంచి ఇంగ్లాండ్ తో యాషెస్ సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. 


 






 






 






కాగా.. ఇండియా - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న ఆసీస్ టీ  బ్రేక్ సమయానికి   51 ఓవర్లలో  3 వికెట్లు కోల్పోయి  170 పరుగులు చేసింది.  ఉస్మాన్ ఖవాజా (0) డకౌట్ అయ్యాడు. మార్నస్ లబూషేన్ (26) కూడా నిలవలేకపోయాడు. డేవిడ్ వార్నర్ (43)  రాణించగా.. ప్రస్తుతం టీ విరామ సమయానికి ట్రావిస్ హెడ్ (75 బంతుల్లో 60 నాటౌట్, 10 ఫోర్లు), స్టీవ్ స్మిత్ (102 బంతుల్లో 33 నాటౌట్, 4 ఫోర్లు)  క్రీజులో ఉన్నారు.  షమీ, సిరాజ్, శార్దూల్‌లకు తలా ఓ వికెట్ దక్కింది.