WTC Final 2023:


ఐసీసీ ఎట్టకేలకు ఓ కీలక నిర్ణయం తీసుకుంది! అంతర్జాతీయ క్రికెట్లో వివాదాస్పదంగా మారిన 'సాఫ్ట్‌ సిగ్నల్‌'కు రెడ్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ నుంచే ఈ నిబంధనను రద్దు చేస్తున్నట్టు తెలిసింది. ఇకపై కాంట్రవర్సీలకు తెరవేయనుంది! సౌరవ్‌ గంగూలీ నేతృత్వంలోని ఐసీసీ క్రికెట్‌ కమిటీ ఇందుకు ఆమోదం తెలిపినట్టు సమాచారం. అంతేకాకుండా వాతావరణం బాగాలేకున్నా, సహజమైన వెలుతురు లేకున్నా ఫ్లడ్‌లైట్లు వేసేందుకు అనుమతించింది.


కొన్నేళ్లుగా సాఫ్ట్‌ సిగ్నల్‌ అంశంపై క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు, నిపుణులు విమర్శిస్తూనే ఉన్నారు. జట్ల గెలుపోటములను తారుమారు చేసే ఆ నిబంధనను తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇన్నాళ్లకు ఐసీసీ స్పందించి తుది నిర్ణయం తీసుకుంది. సాధారణంగా మైదానంలోనే అంపైర్లే తుది నిర్ణయం తీసుకుంటారు. అయితే కొన్నిసార్లు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని పరిస్థితులు ఎదురవుతాయి.


ఉదాహరణకు.. ఒక బ్యాటర్‌ బంతిని ఆడేందుకు క్రీజుదాటి స్ట్రైక్‌ చేశాడని అనుకుందాం. కానీ మిస్సైన ఆ బంతి కీపర్‌ చేతుల్లో పడింది. వెంటనే అతడు స్టంపౌట్‌ చేయడానికి ప్రయత్నిస్తాడు. అదే సమయంలో బ్యాటర్‌ క్రీజు లైన్‌పై కాలు పెట్టాడని అనుకుందాం.


Also Read: రాయుడూ.. ఇక చాలు - మీ సేవలకు సెలవు ప్రకటించరా! - అంబటికి ఫ్యాన్స్ విన్నపం


ఇవన్నీ రెప్పపాటు సమయంలోనే జరుగుతాయి. ఆన్‌ఫీల్డ్‌ అంపైర్‌కు ఎలాంటి నిర్ణయం ప్రకటించాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటప్పుడు నాన్‌ స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉండే అంపైర్‌ తన నిర్ణయాన్ని ప్రకటించి మూడో అంపైర్‌కు సమాచారం అందిస్తాడు. టీవీ అంపైర్‌ ఎన్నిసార్లు రిప్లేలు చూసినా.. ఎంత ప్రయత్నించినా ఔటయ్యాడో లేదో చెప్పలేకపోతున్నాడని అనుకుందాం. అలాంటప్పుడు ఆన్‌ఫీల్డ్‌ అంపైర్‌ ప్రకటించిన నిర్ణయాన్నే ఆమోదిస్తాడు. ఇది చాలా మ్యాచుల్లో వివాదాలకు దారితీసింది. ఔటైనప్పటికీ నాటౌట్‌గా... నాటౌట్‌గా ఉన్నా ఔటవ్వడంతో జట్ల గెలుపు ఓటములపై ప్రభావం చూపిస్తుంది.


వివాదాస్పదంగా ఉన్న ఈ నిర్ణయాన్ని రద్దు చేయాలని చాలామంది డిమాండ్‌ చేశారు. 'ఐసీసీ సాఫ్ట్‌ సిగ్నల్‌ విధానాన్ని రద్దు చేయాలి. నిర్ణయం తీసుకోలేనప్పుడు ఆన్‌ఫీల్డ్‌ అంపైర్లు మూడో అంపైర్‌కు సమాచారం అందిస్తే చాలు. టెక్నాలజీ సాయంతో మూడో అంపైరే నిర్ణయం తీసుకోవడం మంచిది. సాఫ్ట్‌ సిగ్నల్‌ ఇచ్చిన ప్రతిసారీ వివాదమే ఎదురవుతోంది' అని ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా టెస్టు సమయంలో మార్నస్‌ లబుషేన్‌పై వివాదాస్పద నిర్ణయం తీసుకున్నప్పుడు ట్వీట్‌ చేశాడు. 


అహ్మదాబాద్‌లో ఇంగ్లాండ్‌, భారత్‌ నాలుగో టీ20లో సూర్యకుమార్‌ యాదవ్ ఔటైనప్పుడూ ఇలాంటి వివాదమే చెలరేగింది. దాంతో బీసీసీఐ సెక్రటరీ జే షా సైతం ఇలాగే స్పందించాడు. ఐసీసీ బోర్డు మీటింగ్‌లో దీనిపై చర్చించేలా చేశాడు.  టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సైతం అసహనం వ్యక్తం చేశాడు. అయితే నిబంధన రద్దు చేయనప్పటికీ ఎంసీసీ అంపైర్లకు కొన్ని ఆదేశాలు జారీ చేసింది. నిర్ణయించుకోలేని పరిస్థితుల్లో మూడో అంపైర్‌కు సమాచారం మాత్రమే ఇవ్వాలని.. ఔట్‌, నాటౌట్‌ సిగ్నల్స్‌ ఇవ్వొద్దని సూచించింది. చివరికి గంగూలీ అధ్యక్షత వహించే కమిటీ దీనిని ముగింపు పలకనుంది.