Ambati Rayudu: ఐపీఎల్ లో 2010 నుంచి ఆడుతున్న తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు ఈ సీజన్ లో మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు. ఐపీఎల్ - 16 లో పెద్దగా ఫీల్డింగ్ చేయకపోయినా చెన్నై అతడిని ఇంపాక్ట్ ప్లేయర్‌గా వినియోగించుకుంటున్నది. అయినా కూడా రాయుడు.. ఈ సీజన్ లో 12 మ్యాచ్ లలో 10 ఇన్నింగ్స్ లలో బ్యాటింగ్ చేసి 15.25 సగటు, 127.08 స్ట్రైక్ రేట్ తో 122 పరుగులే చేసి విమర్శల పాలవుతున్నాడు.
ఒకప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్‌లో మిడిలార్డర్‌కు రాయుడు వెన్నెముకగా వ్యవహరించేవాడు. 2018 సీజన్ లో రాయుడు 16 మ్యాచ్ లలో ఏకంగా 602 పరుగులు చేశాడు. ఈ సీజన్ లో అతడు ఓ సెంచరీ కూడా చేశాడు. 2018లో సీఎస్కే ట్రోఫీ నెగ్గడంలో రాయుడుది కీలక పాత్ర. ఆ తర్వాతి సీజన్ లో రాణించకపోయినా 2020లో 359 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. కానీ గడిచిన రెండు సీజన్లలో రాయుడు బ్యాటింగ్ లో మునపటి దూకుడు లేదని చెప్పక తప్పదు.
2021 సీజన్ లో 13 ఇన్నింగ్స్ ఆడిన రాయుడు 257 పరుగులు చేశాడు. ఈ సీజన్ లో కూడా సీఎస్కే ట్రోఫీ నెగ్గింది. కానీ గత సీజన్ లో అతడు 11 ఇన్నింగ్స్ లలో 274 రన్స్ చేశాడు. ఇక ఐపీఎల్-16లో కూడా అతడి వైఫల్యాలు కొనసాగుతున్నాయి. ఈ సీజన్ లో మరీ దారుణంగా మూడు డకౌట్లు అయిన రాయుడు అత్యధిక వ్యక్తిగత స్కోరు 23గా ఉంది. తాజాగా కోల్‌కతాతో మ్యాచ్ లో రాయుడు.. ఏడు బంతుల్లో నాలుగు పరుగులే చేసి సునీల్ నరైన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
ఇంకెన్నాళ్లు భరించాలి..?
రాయుడు వరుస వైఫల్యాలతో ట్విటర్ లో సీఎస్కే అభిమానులు ఇక అతడు రిటైర్మెంట్ ప్రకటించాలని కోరుతున్నారు. రాయుడు సీఎస్కేకు చేసిన సేవలు చాలని, అతడు ఇకనైనా తప్పుకుని యువ ఆటగాళ్లకు ఛాన్స్ ఇస్తే మంచిదని కామెంట్స్ చేస్తున్నారు. రాయుడును ట్రోల్ చేస్తూ షేర్ చేస్తున్న మీమ్స్, ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. పలువురు చెన్నై అభిమానులైతే.. ‘రాయుడూ.. ఇకనైనా మా క్లబ్ (సీఎస్కే)ను వీడు ప్లీజ్..’అని విన్నవిస్తున్నారు. రాయుడు విషయంలో సీఎస్కే యాజమన్యం కీలక నిర్ణయం తీసుకోవాలని.. షేక్ రషీద్ వంటి యువ ఆటగాళ్లకు ఛాన్స్ ఇస్తే టీమ్‌కు మేలు చేసినవారవుతారని కోరుతున్నారు.
రాజకీయాలలోకి ఎంట్రీ..!
ఇప్పటికే రాయుడు ఆంధ్రా రాజకీయాలపై ఫోకస్ పెట్టాడని చాలాకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు రాయుడు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో పలుమార్లు చర్చలు కూడా జరిపారని, ఐపీఎల్ - 16 ముగిసిన వెంటనే రాయుడు తన రాజకీయ రంగ ప్రవేశంపై ప్రకటన చేయనున్నాడని గుసగుసలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.