MS Dhoni Autograph To Sunil Gavaskar: భారత క్రికెట్‌లో  సచిన్ టెండూల్కర్‌కు ముందే   టెస్టులలో పది వేల పరుగులు చేసిన  ఏకైక క్రికెటర్  సునీల్ గవాస్కర్. సచిన్ వంటి ఎందరో గత తరపు ఆటగాళ్లకు  ఆయన ఆదర్శం.  70  ఏండ్లు దాటినా గవాస్కర్ మాత్రం  ఇప్పటికీ  క్రికెట్‌తో తన బంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు.  తన రిటైర్మెంట్ తర్వాత వచ్చిన రెండో తరపు ఆటగాడి దగ్గర  గవాస్కర్ ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు.  ఇందుకు  చెన్నై లోని  చెపాక్ స్టేడియం వేదికైంది. 


భారత జట్టుకు  మూడు ఐసీసీ ట్రోఫీలను అందించిన   మాజీ సారథ మహేంద్ర సింగ్ ధోని వద్ద గవాస్కర్ ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు. నిన్న చెన్నై లోని చెపాక్ లో  కోల్‌కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ ముగిశాక  ధోని..   స్టేడియం  చుట్టూ కలియతిరిగాడు.  చెన్నై ఆటగాళ్లంతా  ధోని వెంట నడుస్తూ  అభిమానులకు అభివాదం చేస్తూ చెపాక్ లో సందడి చేశారు. 


ఇదే క్రమంలో అక్కడికి వచ్చిన గవాస్కర్..  ధోనిని ఆటోగ్రాఫ్ అడిగాడు.  తన  షర్ట్ మీదే  గవాస్కర్  ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు. అనంతరం  గవాస్కర్ ధోనిని మనసారా హత్తుకున్నాడు. ఇందుకు సంబంధించిన  చిత్రాలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.  గవాస్కర్ తో పాటు కోల్‌కతా  మిడిలార్డర్ బ్యాటర్  రింకూ సింగ్ కూడా ధోని  ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు. ఆటోగ్రాఫ్ తీసుకున్న తర్వాత గవాస్కర్ మాట్లాడుతూ.. ధోని వంటి ఆటగాళ్లు శతాబ్దానికి ఒకరు ఉంటారని ప్రశంసలు కురిపించాడు. 


 






వాస్తవానికి  ధోనికి ఇదేం ఫేర్‌వెల్ మ్యాచ్ కాకపోయినా   ఈ సీజన్ లో  చెన్నైకి  చెపాక్ లో ఇదే మ్యాచ్. చెన్నై తమ చివరి  లీగ్ మ్యాచ్ ను ఢిల్లీతో ఆడాల్సి ఉంది.   ఇప్పటికే  చెన్నై జట్టు ప్లేఆఫ్స్ బెర్త్ ను దాదాపు ఖాయం చేసుకుంది.    క్వాలిఫయర్ మ్యాచ్ లలో  రెండు మ్యాచ్ లు  కూడా  చెన్నై వేదికగానే జరుగనున్నాయి. కానీ దీనికంటే ముందే ధోని.. చెపాక్ లో  స్టేడియం చుట్టూ కలియతిరుగుతూ  ఫ్యాన్స్‌కు అభివాదాలు చేయడం కొత్త అనుమానాలకు దారి తీస్తోంది.  ధోనికి ఇదే ఆఖరి సీజన్  అని భావిస్తున్న తరుణంలో   సీఎస్కే సారథి  దాని  గురించి  చెప్పకనే చెప్పాడా..? అన్న వాదనలూ ఉన్నాయి. 


 






ఇక చెన్నై - కోల్‌కతా మధ్య  ముగిసిన మ్యాచ్‌ను కేకేఆర్  ఆరు వికెట్ల తేడాతో  విజయం సాధించింది.   ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై..  నిర్ణీత 20 ఓవర్లలో  6 వికెట్ల నష్టానికి  144 పరుగులే చేసింది.   శివమ్ దూబే (48) కాస్త మెరుగ్గా ఆడాడు.  అనంతరం లక్ష్య ఛేదనలో  కేకేఆర్.. 18.3 ఓవర్లలోనే  విజయాన్ని అందుకుంది. కేకేఆర్ సారథి నితీశ్ రాణా  (57 నాటౌట్), రింకూ సింగ్ (54) లు రాణించి కేకేఆర్‌కు ఊరట విజయాన్ని అందించారు.