WTC 2023 Final:

  రావల్పిండి వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచులో పాకిస్తాన్ పై ఇంగ్లండ్ సంచలన విజయం సాధించింది. ఈ విజయం ఇంగ్లిష్ జట్టుకు సంతోషాన్నే కాదు... టీమిండియాకు సహాయపడుతోంది. అదెలాగంటారా!


జూన్ 2023లో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ జరగనుంది. పాయింట్ల పట్టికలో టాప్ 2 లో ఉన్న జట్లు ట్రోఫీ కోసం పోటీపడతాయి. ప్రస్తుతం ఆ పట్టికలో భారత్ నాలుగో స్థానంలో ఉంది. పాక్ ఐదో స్థానంలో ఉంది. ఇప్పుడు ఇంగ్లండ్ తో పాకిస్థాన్ 3 టెస్ట్ మ్యాచుల సిరీస్ ఆడనుంది. ఒకవేళ తొలి టెస్టులో పాక్ గెలుచుంటే దాని పాయింట్లు పెరిగుండేవి. అయితే ఇంగ్లండ్ గెలవటంతో అది భారత్ కు ప్లస్ అయ్యింది. ఇప్పుడు బంగ్లాదేశ్ తో జరగబోయే 3 మ్యాచుల టెస్ట్ సిరీస్ ను టీమిండియా క్లీన్ స్వీప్ చేస్తే ఫైనల్ చేరుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఆస్ట్రేలియా వెస్టిండీస్ ను వైట్ వాష్ చేస్తే ఆ జట్టూ తుది పోరుకు అర్హత సాధిస్తుంది. ఈ రెండూ గెలిస్తే పాక్ కు ఫైనల్ అవకాశం ఉండదు.  కాబట్టి ఇప్పుడు పాక్ పై ఇంగ్లండ్ గెలవడం కచ్చితంగా భారత్ కు కలిసొచ్చిందనే చెప్పాలి. 






పాకిస్థాన్ పై ఇంగ్లండ్ విజయం 


పాకిస్థాన్ తో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ సంచలన విజయం నమోదు చేసింది. గత కొన్నేళ్లుగా అన్ని ఫార్మాట్లో దూకుడు మంత్రాన్ని జపిస్తున్న ఇంగ్లిష్ జట్టు.. ఈ టెస్టులోనూ ఆ తరహాలోనే ఆడింది. రికార్డులు బ‌ద్ద‌లైన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 74 ప‌రుగుల‌ తేడాతో గెలిచింది. దీంతో మూడు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 15 నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనుకున్న సమయంలో ఇంగ్లాండ్ బౌల‌ర్లు అద్బుత ప్ర‌ద‌ర్శ‌న‌తో మ్యాచ్ గెలిపించారు. స్పిన్న‌ర్ జాక్ లీచ్ న‌సీం షాను ఎల్బీగా ఔట్ చేయ‌డంతో ఇంగ్లాండ్ ఆట‌గాళ్లు సంబ‌రాలు చేసుకున్నారు. 


బ్రెండన్ మెక్‌కల్లమ్(కోచ్)- బెన్ స్టోక్స్(కెప్టెన్) బాధ్యతలు తీసుకున్నాక.. ఇంగ్లాండ్ ఆటగాళ్ల ఆటతీరే మారిపోయింది. ‘బజ్ బాల్’ పేరుతో దూకుడు మంత్రాన్ని జపిస్తున్నారు. టెస్ట్ మ్యాచులను టీ20, వన్డే స్టైల్ లో ఆడేస్తున్నారు. ఈ టెస్ట్ ప్రారంభమైన తొలిరోజే 504 పరుగులు చేశారంటే అర్థం చేసుకోవచ్చు వారి దూకుడు ఎలా ఉందో. అయితే చివరి రోజు టీ బ్రేక్ వరకు మ్యాచ్ పాకిస్తాన్ వైపే ఉంది. తిరిగి ఆట ప్రారంభయ్యాక.. పాకిస్తాన్ పతనం మొదలయ్యింది. ఆఖరి సెషన్ లో విజయానికి 85 పరుగులు అవసరం కాగా.. 10 పరుగులు మాత్రమే జోడించి 74 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యారు.