Sunil Gavaskar:  టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ ను తాను ఆల్ రౌండర్ గా పరిగణనిస్తానని భారత మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ అన్నాడు. అతను ఓపెనర్ గా, వికెట్ కీపర్ గా, అవసరమైతే ఫినిషర్ గానూ చేయగలడని గావస్కర్ అభిప్రాయపడ్డారు. 


వచ్చే ఏడాది స్వదేశంలో వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఇప్పటికే దీనికోసం టీమిండియా సన్నాహాలు ప్రారంభించింది. అయితే జట్టు కూర్పుతో భారత్ ఇబ్బంది పడుతోంది. ముఖ్యంగా వికెట్ కీపర్ గా ఎవరిని తీసుకోవాలి అనే దానిపై మల్లగుల్లాలు పడుతోంది. ప్రస్తుతం రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ లు ఆప్షన్ లుగా కనిపిస్తున్నారు. అయితే వీరిలో ఎవరిని తీసుకోవాలనే అనే దానిపై క్లారిటీ అవసరం. 


వన్డే ప్రపంచకప్ కోసం రెండు స్థానాలు (రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ) తప్ప మిగతా స్థానాల్లో ఎవరు ఆడతారనేదానిపై స్పష్టత లేదు. ఒక్కో సిరీస్ కు ఒక్కో జట్టును బీసీసీఐ ప్రకటిస్తోంది. ముఖ్యంగా వికెట్ కీపర్ స్థానంపై చర్చ జరుగుతోంది. ప్రస్తుతం బంగ్లాతో జరుగుతున్న సిరీస్ కు విక్కీగా పంత్ ఎంపికైనప్పటికీ మొదటి వన్డేలో ఆడలేదు. వన్డే సిరీస్ మొత్తానికి పంత్ దూరమైనట్లు తర్వాత బీసీసీఐ ప్రకటించింది. అయితే దానికి గల కారణాలు మాత్రం తెలుపలేదు. ఫస్ట్ మ్యాచుకు కేఎల్ రాహుల్ కీపింగ్ బాధ్యతలు చేపట్టాడు. ఈ క్రమంలోనే జట్టు కూర్పుపై సునీల్ గావస్కర్ తన అభిప్రాయాలను తెలియజేశారు. 


అందుకే అతను ఆల్ రౌండర్


రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ లు ఇన్నింగ్స్ ప్రారంభిస్తారు. నెం. 3 స్థానం కచ్చితంగా విరాట్ కోహ్లీదే. నాలుగో స్థానంలో శ్రేయస్ ఉన్నాడు. అయితే కేఎల్ రాహుల్ 5 లేక 6వ స్థానంలో బ్యాటింగ్ చేయాలి. అతనికి అదే సరైనదని నాకనిపిస్తోంది. అలా అయితే జట్టులో ఇంకో అదనపు బౌలర్ ను తీసుకునే వీలుంటుంది.  అతను ఓపెనింగ్ చేయగలడు, కీపింగ్ బాధ్యతలు తీసుకోగలడు. అలాగే ఫినిషర్ పాత్ర పోషించగలడు. అందుకే రాహుల్ ను ఆల్ రౌండర్ అంటాను. అతను కొట్టే షాట్లు, అతనికి ఉన్న అనుభవాన్ని బట్టి ఫినిషంగ్ కూడా చేయగలడు. అని గావస్కర్ అన్నారు. 


ఇకపోతే రిషభ్ పంత్ టీమిండియా రెగ్యులర్ వికెట్ కీపర్ గా ఉన్నాడు. ఈ ఏడాది ఆడిన 12 వన్డేల్లో పంత్ ఒక సెంచరీ, మూడు అర్ధసెంచరీలతో 37.33 సగటుతో 336 పరుగులు చేశాడు. ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచుతో సహా రాహుల్ ఈ సంవత్సరం కేవలం 8 వన్డేలు. అతను 32.71 సగటుతో 2 అర్ధసెంచరీలతో 229 పరుగులు చేశాడు.