ఇంగ్లండ్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య రావల్పిండిలో జరిగిన తొలి టెస్టును ఇంగ్లండ్ 74 పరుగుల తేడాతో గెలుచుకుంది. ఇప్పటికే వైట్ బాల్ క్రికెట్ ఎలా ఆడాలో డిక్టేట్ చేస్తున్న ఇంగ్లండ్ క్రికెట్ టీం ఇప్పుడు టెస్ట్ మ్యాచెస్ ను కూడా నిర్దేశించే ఆటతీరును ప్రదర్శిస్తున్నట్టుగా ఉంది. ఈ టెస్ట్ మ్యాచ్ విజయంలో ఎక్కువ క్రెడిట్ కచ్చితంగా దక్కాల్సింది కెప్టెన్ బెన్ స్టోక్స్, కోచ్ బ్రెండన్ మెక్ కల్లమ్ ద్వయానికే. ఎందుకంటే వాళ్లు రెండో ఇన్నింగ్స్ లో చేసిన డిక్లరేషన్ అంత సాహసోపేతమైనది కాబట్టి. 


అసలు టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ రోజే చూశాం కదా. పరుగుల వరద. సెంచరీల మోత. బౌండరీల ఊచకోత అబ్బో ఇలా ఎన్ని చెప్పుకున్నా సరే అది ఓ పట్టాన తెగదు. ఇంగ్లండ్ వన్డే స్టైల్ ఆట ఆడుతూ తొలి ఇన్నింగ్స్ లో 657 పరుగులు సాధించిన తర్వాత... అసలు ఈ టెస్ట్ లో ఫలితం వస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ ఇంగ్లండ్ కు దీటుగానే పాకిస్థాన్ బదులిచ్చింది. అంత వేగంగా పరుగులు చేయకపోయినా తొలి ఇన్నింగ్స్ లో  579 పరుగులు సాధించింది. రెండో ఇన్నింగ్స్ కు దిగిన ఇంగ్లండ్ ఈసారి కూడా వన్డే, టీ20 క్రికెట్ ను కలిపి కొడుతూ పరుగులు సాధించింది. 7కు రపైగా రన్ రేట్ తో 264 పరుగులు చేసింది. అక్కడ డిక్లరేషన్ ఇచ్చింది. అంటే నాలుగో రోజు టీ బ్రేక్ సమయానికి.


ఈ డిక్లరేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే అప్పటికి ఇంకా 4 సెషన్ల ఆట మాత్రమే మిగిలి ఉంది. పాకిస్తాన్ ముందు ఇంగ్లండ్ నిలిపిన లక్ష్యం 343. పాక్ బ్యాటర్లను కాస్త ఊరించే టార్గెట్. ఎందుకంటే వారు సరిగ్గా ప్రణాళిక ప్రకారం ఆడి ఉంటే పాక్ గెలిచే అవకాశాలే ఎక్కువ. ఇంగ్లండ్ ఓడిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నప్పటికీ కెప్టెన్ స్టోక్స్, కోచ్ మెక్ కల్లమ్ కలిసి ఆ రిస్క్ తీసుకున్నారు. ఆ టైంలో అసలు డిక్లేర్ చేయకుండా ఇంకాసేపు ఇంగ్లండ్ బ్యాటింగ్ కొనసాగించే వీలు కూడా వాళ్లకు ఉంది. అలా చేసి ఉంటే అసలు ఈ మ్యాచ్ లో ఫలితమే వచ్చేది కాదేమో. కానీ ఓటమి రిస్క్ కళ్ల ముందు కనబడుతున్నా సరే మ్యాచ్ నుంచి ఫలితం రాబట్టడానికే ఇంగ్లండ్ ప్రయత్నించింది. వారు తీసుకున్న డేరింగ్ నిర్ణయానికి ఈ విజయం వారినే వరించింది.


343 పరుగుల టార్గెట్ తో దిగిన పాకిస్థాన్ ఐదో రోజు తొలి 2 సెషన్లలో చాలా బాగా బ్యాటింగ్ చేసిందనే చెప్పుకోవాలి. టీ సమయానికి మ్యాచ్ ఇంకా ఫిఫ్టీ అన్నట్టుగానే ఉంది. పాక్ గెలుపునకు ఎక్కువ అవకాశాలు, ఆ తర్వాత డ్రాకే ఎక్కువ అవకాశాలు అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఒకానొక టైంలో పాక్ స్కోర్ 259 ఫర్ 5. అజర్ అలీ 40 పరుగులతో, అఘా సల్మాన్ 30 పరుగులతో క్రీజ్ లో నిలదొక్కుకున్నారు. వీరిద్దరే బ్యాటింగ్ కొనసాగించి ఉంటే పాక్ దే విజయం అయి ఉండేది. కానీ అప్పుడు మొదలైంది జేమ్స్ అండర్సన్, ఓలీ రాబిన్సన్ రివర్స్ స్వింగ్ మాయాజాలం. రెండో కొత్త బంతి అందుబాటులోకి వచ్చినా సరే దాన్ని తీసుకోకుండా పాత బంతితోనే అద్భుతాలు చేశారు. దెబ్బకు 11 పరుగుల తేడాలోనే పాకిస్థాన్ ఆఖరి 5 వికెట్లు కోల్పోయింది. 74 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఓలీ రాబిన్సన్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. 


అసలు మొదటి రోజు నమోదైన పరుగుల వరద చూస్తే అసలు ఈ మ్యాచ్ లో ఫలితం అనేది రాదని చాలా మంది ఫిక్సయిపోయి అంటారు. పిచ్ కండిషన్ అలాంటిది మరి. కానీ మ్యాచ్ గడిచేకొద్దీ పిచ్ ను అర్థం చేసుకుని, దానికి తగ్గట్టుగా బౌలింగ్ చేసిన ఇంగ్లండ్ ఓ చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. 17 ఏళ్ల తర్వాత పాక్ లో టెస్ట్ సిరీస్ కు వచ్చిన ఇంగ్లండ్ ఘనంగా బోణీ చేసింది. ఇరు జట్ల మధ్యరెండో టెస్ట్ శుక్రవారం ముల్తాన్ లో ప్రారంభమవుతుంది.