WPL Top 10 Players List:
మహిళల ప్రీమియర్ లీగ్ క్రికెటర్ల వేలం రసవత్తరంగా సాగుతోంది. అంతర్జాతీయ టీ20ల్లో ఎక్కువ అనుభవం, దూకుడు, నిలకడగా ఆడే అమ్మాయిల కోసం ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్ తమ వ్యూహాలతో ఆకట్టుకుంటున్నాయి. కొత్త ఫ్రాంచైజీలైన యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్ తెలివిగా క్రికెటర్లను ఎంపిక చేసుకుంటున్నాయి. ఈ వేలంలో ఇప్పటి వరకు ముగ్గురు రూ.3 కోట్లు, నలుగురు రూ.2 కోట్లు, రూ.కోటి -2 కోట్ల మధ్య చాలామంది ఎంపికయ్యారు.
అరంగేట్రం మహిళల ప్రీమియర్ లీగులో అత్యంత ఖరీదైన క్రికెటర్‌గా టీమ్‌ఇండియా ఓపెనర్ స్మృతి మంధాన రికార్డు సృష్టించింది. ఆమెను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఏకంగా రూ.3.4 కోట్లకు దక్కించుకుంది. ఎడమచేతి వాటం బ్యాటర్, వివిధ టీ20 లీగుల్లో ఆడిన అనుభవం ఆమెకు ఉపయోగపడింది. ఆమె స్టార్‌డమ్‌కు తిరుగులేదు.
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ యాష్లే గార్డ్‌నర్ రెండో స్థానంలో నిలిచింది. రూ.3.20 కోట్లకు ఆమెను గుజరాత్ జెయింట్స్ తీసుకుంది. ప్రపంచకప్‌ల్లో కీలకంగా ఉండటం, పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కావడం, బిగ్‌బాష్ లీగులో మెరుపులు మెరిపించడంతో ఆమెకు ఇంత ధర చెల్లించాల్సి వచ్చింది.
ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ నటాలీ షివర్ రికార్డు సృష్టించింది. ముంబయి ఇండియన్స్ ఆమెను రూ.3.20 కోట్లకు కొనుగోలు చేసింది. మహిళల టీ20 లీగుల్లో ఆమెకు తిరుగులేదు. పైగా ఆమె బౌలింగ్, బ్యాటింగ్‌లో దూకుడుగా ఉంటుంది.
టీమ్‌ఇండియా స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్, నిలకడకు మారుపేరైన దీప్తి శర్మకు రూ.2.6 కోట్లు దక్కాయి. యూపీ వారియర్స్ ఆమెను సొంతం చేసుకుంది. టీ20, వన్డే, టెస్టుల్లో దీప్తి శర్మ నిలకడగా ఆడగలదు. బహుశా ఆమెకు కెప్టెన్సీ అప్పగించే అవకాశాలు ఉన్నాయి.
భారత యువ కెరటం, టాప్ ఆర్డర్లో కీలకమైన జెమీమా రోడ్రిగ్స్ జాక్‌పాట్ కొట్టేసింది. దిల్లీ క్యాపిటల్స్ ఆమెను ఏకంగా రూ.2.20 కోట్లకు కొనుగోలు చేసింది. ఓపెనింగ్, వన్‌డౌన్, సెకండ్ డౌన్‌లో బ్యాటింగ్ చేయగల సత్తా ఆమె సొంతం. మ్యాచ్ పరిస్థితిని బట్టి ఆమె బ్యాటింగ్‌లో గేర్లు మార్చగలదు.
ఆస్ట్రేలియా వికెట్‌కీపర్ బ్యాటర్, విధ్వంసక క్రికెటర్ బెత్‌మూనీకి అనుకున్నట్టే మంచి ధర లభించింది. గుజరాత్ జెయింట్స్ ఆమెను రూ.2 కోట్లకు సొంతం చేసుకుంది. ఆమె క్రీజులో నిలిచిందంటే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు తప్పదు. ఏకధాటిగా 20 ఓవర్లు ఆడగల సత్తా ఆమె సొంతం.
టీమ్‌ఇండియా డేరింగ్, డ్యాషింగ్ ఓపెనర్, అండర్-19 ప్రపంచకప్ విజేత షెఫాలీ వర్మ కోసం వేలంలో ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. రూ.2 కోట్లకు ఆమెను దిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. షెఫాలీ క్రీజులో నిలిచిందంటే బంతికి వీరేంద్ర సెహ్వాగ్ గుర్తుకు రావడం ఖాయం.
భారత పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్ రూ.1.90 కోట్లు దక్కించుకుంది. బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగలదు. నిలకడగా మంచి లెంగ్తుల్లో బంతులు విసరుతుంది. అలాగే లోయర్ మిడిలార్డర్లో సిక్సర్లు, బౌండరీలు బాదగల సత్తా ఆమె సొంతం.
టీమ్‌ఇండియా యువ వికెట్ కీపర్ రిచా ఘోష్‌కు మంచి ధర లభించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆమెను రూ.1.90 కోట్లకు కొనుగోలు చేసింది. చక్కని వికెట్ కీపింగ్ నైపుణ్యాలతో పాటు మిడిలార్డర్లో భారీ సిక్సర్లు బాదేస్తుంది. హ్యాట్రిక్ బౌండరీలూ కొట్టగలదు. రిషభ్ పంత్‌లా నిమిషాల్లో మ్యాచ్ గమనం మార్చేయగల సత్తా ఆమెకుంది.
భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్‌కు అనుకున్నంత ధర రాలేదు. అయితే రూ.1.8 కోట్లతో ఆమె టాప్-10లో నిలిచింది. బహుశా ముంబయి ఇండియన్స్ ఆమెకే పగ్గాలు అప్పగించొచ్చు. ఇంగ్లాండ్ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ సోఫీ ఎకిల్‌స్టోన్‌ను యూపీ వారియర్స్ రూ.1.8 కోట్లకు సొంతం చేసుకుంది.