మహిళల ప్రీమియర్ లీగ్ మొదటి సీజన్ వేలం గ్రాండ్‌గా ప్రారంభం అయింది. భారత స్టార్ ప్లేయర్ స్మృతి మంథనను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఏకంగా రూ.3.4 కోట్లకు కొనుగోలు చేసింది. ప్రస్తుతానికి మహిళల ఐపీఎల్‌లో ఇదే అత్యధికం.


స్మృతి మంథన తర్వాతి స్థానంలో రూ.3.2 కోట్లతో యాష్లే గార్డ్‌నర్ నిలిచింది. యాష్లే గార్డ్‌నర్‌ను గుజరాత్ దక్కించుకుంది. భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌ను రూ.1.8 కోట్లతో ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ ఎలిస్ పెర్రీని రూ.1.7 కోట్లతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది.  న్యూజిలాండా్ ప్లేయర్ సోఫీ డివీన్‌ను కూడా రూ.50 లక్షలకు బెంగళూరు దక్కించుకుంది.


టీమ్‌ఇండియా ఓపెనర్‌ స్మృతి మంథన వీరోచిత ఫామ్‌లో కొనసాగుతోంది. గతేడాది శ్రీలంకతో జరిగిన టీ20లో భారత ఓపెనర్లు స్మృతి మంథన, షెఫాలీ వర్మ చరిత్ర సృష్టించారు. స్మృతి మంథన (94 నాటౌట్: 83 బంతుల్లో, 11 ఫోర్లు, ఒక సిక్సర్), షెఫాలీ వర్మలు (71 నాటౌట్: 71 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) కొత్త రికార్డు సృష్టించారు. శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో 174 పరుగుల లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా ఛేదించారు. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 2-0తో గెలుచుకుంది. మహిళల క్రికెట్‌లో లక్ష్యఛేదనలో వికెట్ కోల్పోకుండా ఛేదించిన అత్యధిక లక్ష్యం ఇదే.


టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక మహిళల జట్టు 50 ఓవర్లలో 173 పరుగులకు ఆలౌట్ అయింది. భారత పేసర్ రేణుకా సింగ్ స్కోరు బోర్డుపై ఏడు పరుగులు చేరేసరికి ఓపెనర్లు ఇద్దరినీ పెవిలియన్‌కు పంపింది. తర్వాతి ఓవర్లోనే టూ డౌన్ బ్యాటర్ మాధవిని (0: 3 బంతుల్లో) కూడా రేణుకనే అవుట్ చేయడంతో శ్రీలంక 11 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.


ఆ తర్వాత కూడా శ్రీలంక బ్యాటర్లు ఎక్కువ క్రీజులో నిలవలేకపోయారు. ఏడో వికెట్‌కు నిలాక్షి డిసిల్వ (32: 62 బంతుల్లో, మూడు ఫోర్లు), అమా కాంచన (47 నాటౌట్: 83 బంతుల్లో, రెండు ఫోర్లు) జోడించిన 42 పరుగులే ఇన్నింగ్స్‌లో అత్యధిక భాగస్వామ్యం. భారత బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీస్తూనే ఉన్నారు. రేణుకా సింగ్‌కు నాలుగు వికెట్లు దక్కగా... మేఘనా సింగ్, దీప్తి శర్మ రెండేసి వికెట్లు తీసుకున్నారు.


174 పరుగుల లక్ష్యాన్ని భారత ఓపెనర్లు ఆడుతూ పాడుతూ ఛేదించారు. ముఖ్యంగా స్మృతి మంథన మొదటి నుంచి బౌండరీలతో చెలరేగింది. షెఫాలీ వర్మ బౌండరీలు ఎక్కువగా కొట్టకపోయినా క్రమం తప్పకుండా స్ట్రైక్ రొటేట్ చేసింది. ఆరుగురు శ్రీలంక బౌలర్లు ప్రయత్నించినా వీరిని అవుట్ చేయలేకపోయారు. 25.4 ఓవర్లలోనే ఈ జోడి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో సిరీస్ టీమిండియా కైవసం అయింది.