WPL Auction 2023: ఉమెన్స్ ఐపీఎల్ ను ఈ ఏడాది నుంచి నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనికోసం ఫ్రాంచైజీలను ఎంపికచేశారు. అహ్మదాబాద్, దిల్లీ, ముంబయి, లక్నో, బెంగళూరు మొత్తం 5 జట్లు ఈ టోర్నీలో తలపడనున్నాయి. ఇప్పుడు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ప్రారంభ ఎడిషన్ కోసం వేలం తేదీని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 13న ముంబయిలో ఈ వేలం జరగనున్నట్లు సమాచారం.
ఆ తేదీనే వేలం నిర్వహిస్తాం
'ఫిబ్రవరి 13న ముంబైలో డబ్ల్యూపీఎల్ వేలం జరుగుతుంది. తేదీ, ప్రదేశంతో ఫ్రాంచైజీలు సంతృప్తిగా ఉన్నారు. అలాగే ముంబయిలో వేలం నిర్వహించడం బీసీసీఐకు కూడా సులభంగా ఉంటుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.' అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. అయితే వేలం, తేదీ గురించి ఫ్రాంచైజీలకు ఇంకా అధికారికంగా తెలియజేయలేదు.
లోతైన సన్నాహాలు అవసరం
'మేం వేలం కోసం తాత్కాలకి తేదీని అనుకున్నాం. ఫిబ్రవరి 13 లేదా 14వ తేదీలో వేలం జరుగుతుంది. ఇది కొత్త లీగ్. కాబట్టి చాలా సన్నాహాలు అవసరం. మేం ప్రతి క్రీడాకారిణి గురించి లోతుగా తెలుసుకుంటున్నాం' అని అహ్మదాబాద్ ఫ్రాంచైజీ ఓనర్ అదాని స్పోర్ట్స్ లైన్ కు చెందిన అధికారి ఒకరు అన్నారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ లు ముంబైలోని రెండు వేదికలపై జరగనున్నాయి. బ్రబౌర్న్ మైదానం, డీవై పాటిల్ స్టేడియాలు ఈ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంను బ్యాకప్ గా ఎంపికచేశారు.
డబ్ల్యూపీఎల్- 2023 ఫార్మాట్
- ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరగనున్నట్లు సమాచారం.
- ఇందులో పాల్గొనే 5 జట్లు ఒకదానితో ఒకటి లీగ్ మ్యాచుల్లో 5 సార్లు తలపడతాయి. మొత్తం 20 లీగ్ మ్యాచ్ లు ఉంటాయి.
- పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్ కు అర్హత సాధిస్తుంది.
- 2, 3 స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. ఇందులో విజయం సాధించిన జట్టు రెండో ఫైనలిస్ట్ గా ఉంటుంది.
- మార్చిలో డబ్ల్యూపీఎల్ టోర్నీ జరగనుంది. అయితే ఇంకా టోర్నమెంట్ నిర్వహణపై బీసీసీఐ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.