WPL 2023, RCB-W vs MI-W:


విమెన్‌ ప్రీమియర్ లీగులో ముంబయి ఇండియన్స్‌ మళ్లీ టాప్‌ ప్లేస్‌కు చేరుకుంది. 12 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. డీవై పాటిల్‌ స్టేడియంలో జరిగిన ఆఖరి లీగు మ్యాచులో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరును ఓడించింది. ఆ జట్టు నిర్దేశించిన 126 పరుగుల లక్ష్యాన్ని ఎలాంటి ఒత్తిడి లేకుండా ఛేదించింది. 16.3 ఓవర్లకు 4 వికెట్ల తేడాతో గెలుపు బావుటా ఎగరేసింది. అమెలియా కెర్‌ (31*; 27 బంతుల్లో 4x4), యస్తికా భాటియా (30; 26 బంతుల్లో 6x4) అదరగొట్టారు. అంతకు ముందు ఆర్సీబీలో రిచా ఘోష్‌ (29; 13 బంతుల్లో 3x4, 2x6) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడింది. ఎలిస్‌ పెర్రీ (29; 38 బంతుల్లో 3x4) ఆమెకు తోడుగా నిలిచింది.




అన్నింటా అమెలియా!


స్వల్ప లక్ష్య ఛేదనలో ముంబయి ఇండియన్స్‌కు హేలీ మాథ్యూస్‌ (24), యస్తికా భాటియా సూపర్‌ స్టార్ట్‌ అందించారు. తొలి వికెట్‌కు 53 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. పవర్‌ప్లేలో ఆఖరి బంతికి యస్తికను ఔట్‌ చేయడం ద్వారా ఈ జోడీని శ్రేయాంక పాటిల్‌ విడదీసింది. జట్టు స్కోరు 62 వద్ద మాథ్యూస్‌ను మేఘాన్‌ షూట్‌ ఔట్‌ చేసింది. ఆ తర్వాత నాట్‌ సివర్‌ (13)ను ఆశా శోభనా పెవిలియన్‌ పంపించింది. అప్పటికి స్కోరు 72. మరో పరుగుకే హర్మన్‌ ప్రీత్‌ (2)ను ఎలిస్‌ పెర్రీ ఔట్‌ చేయడంతో ముంబయి కష్టాల్లో పడ్డట్టు కనిపించింది. ఈ సిచ్యువేషన్లో అమెలియా కెర్‌, పూజా వస్త్రాకర్‌ (19) వికెట్లు పడకుండా అడ్డుకున్నారు. ఐదో వికెట్‌కు 40 బంతుల్లో 47 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. గెలుపు సమీకరణాన్ని సులభం చేశారు. 120 వద్ద పూజా, ఇస్సీ వాంగ్‌ (0)ను కనిక అహుజా వరస బంతుల్లో ఔటైనా అమెలియా విన్నింగ్‌ షాట్‌ కొట్టేసింది.




రిచా ఒక్కరే!


టాస్‌ ఓడిన ఆర్సీబీ మొదట బ్యాటింగ్‌ చేయాల్సి వచ్చింది. భీకరమైన బ్యాటర్‌ సోఫీ డివైన్‌ (0) ఒక పరుగు వద్దే రనౌటైంది. స్మృతి మంధాన (24; 25 బంతుల్లో 3x4, 1x6), ఎలిస్‌ పెర్రీ (29) నిలకడగా ఆడారు. అందివచ్చిన బంతుల్నే బౌండరీకి పంపించారు. పవర్‌ప్లే ముగిసే సరికి జట్టు స్కోరును 32/1కి చేర్చారు. రెండో వికెట్‌కు 32 పరుగుల భాగస్వామ్యం అందించిన ఈ జోడీని అమెలియా కెర్‌ విడదీసింది. 6.4వ బంతికి స్మృతిని ఔట్‌ చేసింది. ఆ తర్వాత ముంబయి పట్టు బిగించింది. అస్సలు రన్స్‌ లీక్‌ చేయలేదు. ప్రమాదకర హీథర్‌ నైట్‌ (12)నూ కెర్‌ ఔట్‌ చేసింది. కనిక అహుజా (12) విఫలమైంది. దూకుడు పెంచే క్రమంలో పెర్రీని నాట్‌ సివర్‌ ఎల్బీ చేసింది. దాంతో 16.6 ఓవర్లకు ఆర్సీబీ 100 పరుగుల మైలురాయిని టచ్‌ చేసింది. ఆఖర్లో రిచా ఘోష్‌ మెరుపు బౌండరీలు, సిక్సర్లు బాది స్కోరు బోర్డును ఉరకలెత్తించింది. ఇస్సీ వాంగ్‌ వేసిన 19.1వ బంతిని భారీ సిక్సర్‌ బాదబోయి ఆమె ఔటవ్వడంతో ఆర్సీబీ 125/9కి పరిమితమైంది.